Pages

Wednesday, December 12, 2007

లెట్ ఇట్ గో.

పొద్దు వెబ్ జైన్‌ లో 17-1-2008

లెట్ ఇట్ గో

Wednesday, September 26, 2007

సుబ్బారావు జ్ఞానయోగం

ఓరోజు అనుకోకుండా సుబ్బారావ్ సహజానందస్వామి గారి ఉపన్యాసం వినడం జరిగింది.
ఆస్వామీజీ గేదెలు పల్లు తోముకుంటాయా? అనే ప్రశ్న తో ఉపన్యాసం మొదలు పెట్టాడు. జంతువులు డబ్బు సంపాదించవు వాటికి ఇల్లు అక్కర లేదు, అవి వండుకు తినవు ఇలా మొదలైన ఆఉపన్యాసంలో మనిషీ ఒక జంతువేనని కాని జంతువు కన్నా నీచంగా జీవిస్తున్నాడని అందుకేఅన్ని సమస్యలు, రోగాలు వస్తున్నాయని జంతువులు సహజంగా జీవించటం వల్ల వాటికేసమస్యలూ లేవని తీర్మానించాడు, అందుకే అందరూ ప్రక్రుతి సహజంగా వుండాలని ఉద్బోదించాడు. అతను సెలవిచ్చిన వాటిలో కొన్ని ఇవి.
భోజనం వండకుండా అన్నీ పచ్చిగా తినాలి.
డబ్బు సంపాదించ కూడదు
శవాల్ని తినకూడదు(మాంసాహారం)
పాలు,గుడ్డు తీసుకోకూడదు(గుడ్డు కోడి ఋతుస్రావమని,పాలలోబ్యాక్టీరియా తప్పించి ఏమీ లేదనీ సెలవిచ్చారు).
టీలు కాఫీలు కాకుండా గంజి తాగాలని.
పేపర్ చదవకూడదు టివి చూడకూడదు.
ఎలక్ట్రానిక్స్ ఏవీ వాడకూడదు.
రోగాలొస్తే మందులు వాడకూడదు(జంతువులు వాడవు మరి)అవే సహజంగా తగ్గిపోవాలి.
అలంకరణలకి దూరంగా ఉండాలి . బట్టలు వొంటిని కప్పుకోటానికేకాని ప్రదర్శణకి కాదు.
రోగాలొస్తే మందులు వాడకూడదు(జంతువులు వాడవు మరి రోగాలు సహజంగా అవేతగ్గిపోవాలి).
పిల్లల్ని professional చదువులు చదివించకూడదు.
ఇతర దేశాలకి ఉద్యోగాలకి వాటికి వెళ్ళకూడదు.
ప్రాపంచిక సుఖాలకి దూరంగా ఉండాలి. ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలతో సాగింది ఆ ఉపన్యాసం.
సుబ్బారావు చాలా ఇంప్రెస్ అయిపోయి ఇన్నాళ్ళు ఈప్రాపంచిక విషయాల్లో మునిగి పోయి కృత్రిమ జీవనం గడుపుతున్న తన అజ్ఞానానికి బోలెడంత సిగ్గు పడుతూ వెంటనే ఆస్వామీజీ చెప్పినట్టుగ జీవించాలని గట్టిగానిర్ణయించేసుకున్నాడు.

ఆరోజు నుండీ పూర్తిగా సహజాతిసహజంగా జీవించాలని అనుకున్నాడు. ఇంట్లో కరెంటు తీయించేసాడు, కాలినడకనే తిరగాలనుకున్నాడు, (ఎక్కువదూరాలకి ఎడ్లబండి ఒకటి కొందామా అని ఆలోచన)
(డ్రెస్ లన్నీ మూటకట్టేసి) నాలుగు పంచెలు కొన్నాడు, పిల్లలకీ గోచీపెట్టమన్నాడు. ఇంకా బడికి వెళ్ళని వాడిని, ఇప్పుడే ఏ బి సి డి లు నేర్చుకునేవాడిని పిలిచి పెద్దచదువులు చదవద్దని గట్టిగా చెప్పాడు.
పిల్లల్ని కూడా పాలు త్రాగనివ్వట్లేదు. సోఫాలు, వగైరా ఓ గదిలో వేసి తాళం పెట్టేసాడు నేలపైనే పడక వగైరా. అపార్ట్ మెంటుని గుడిసె గాఎలా మార్చాలో తెలియక ఊర్కున్నాడు. డబ్బు సంపాదన గురించి ఎటూ తేల్చుకోలేక ప్రస్తుతానికి ఆఫీసుకి సెలవు పెట్టాడు.

భోజనం వండనివ్వడు అన్నీ అలాగేతిందాం అంటున్నాడు, ఒకరోజు గడిచేసరికి అందరికీ పొట్టలో ఎదో ఇబ్బంది, పిల్లలకి విరోచనాలుపట్టుకున్నాయి. ఇంట్లో ఉక్కపోత నిలవ లేకుండా వుంది. ఇరుగు పొరుగు అంతా తలుపులు బిడాయించుకుని టీవి సీరియల్స్ లో మునిగిపోయి వున్నారు, ఎవ్వరినీ పలుకరించేట్టు లేదు.
ఆ సాయంత్రానికల్లా అర్జెంటు గా వాళ్ళవాళ్ళు గుర్తొస్తున్నారని, భార్య పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది.

అంత ఇబ్బంది లోనూ సుబ్బారావ్ కి స్వామీజీపై ఆరాధన రెట్టింపైయింది. ఇలా జీవించే స్వామీజీ ఎంత గొప్పవాడో కదా అతని సేవ చేస్తూ అతని వద్దే ప్రకృతి సహజమైన జీవనం నేర్చు కొని జీవించాలని నిర్ణయించు కున్నాడు.

వెంటనే స్వామీజీ ఇంటికి వెళ్ళి అక్కడి స్వామీజీ పియ్యే ని కలిసాడు.
"ఇక్కడ స్వామీజీ కలవరు వారిని చూడాలంటే వారి ప్రోగ్రాం ఫలానా చోట ఉంది మీరు అక్కడ వారిని చూడొచ్చు, ఆ ప్రోగ్రామ్ కి ఇక్కడ మీరు మీ పేరు రిజిష్టర్ చేసుకోవచ్చు." అన్నాడు పియ్యే.
"ఐతే నాపేరు తీసుకోండి" అని చెప్పాడు సుబ్బారావ్.

"దీంట్లో కేటగిరీస్ వున్నాయండి 1000/-,500/-,250/-. మీరు స్వామి గారి భోధనలు దగ్గరగా కూర్చుని వినాలంటే 1000/- చెల్లించి మీ పేరు నమోదు చేసుకోండి" చెప్పుకుపోయాడు పియ్యే.
'ఇదేంటి డబ్బు సంపాదించటం నిషేదమన్నారే?' అనుకుని ఏమోలే ముందు స్వామిజీ దగ్గరకు చేరితే చాలు అనుకుని 1000/- చెల్లించి సాయంత్రానికళ్ళా ఆప్రోగ్రాం దగ్గరికి వెళ్ళాడు.
ఆ హాలు సగం కంటే ఎక్కువ 1000/- టిక్కెట్టు వారితో నిండిపోయివుంది. వెనకేక్కడో స్థలం దొరికింది, ఓ గంట సేపు వాళ్ళ కార్య కర్తలే ఏవో ఉపన్యాసాలు, నీతిభోధలూ చేసారు. చివరన స్వామీజీ గారు వేంచేసి ఓ అరగంట 'సహజాతిసహజంగా ఎలా జీవించాలో' ఉపదేశించి వెళ్ళిపోయారు.
చివరిగా అక్కడివాళ్ళు వాళ్ళ సేవా? సంస్థ కిచందాలు ఇవ్వ వలసిందిగా కోరారు.
ఎలాగైనా స్వామిజీ ని కలవాలని పట్టు వదల కుండా ఎక్కడ ప్రోగ్రాం వున్నా టిక్కెట్టు కొని వెళ్ళడంమొదలెట్టాడు.
అలా ఓ పది సార్లు వెళ్ళాక అక్కడి PA సుబ్బారావ్ కి ఓ సలహా ఇచ్చాడు.
'ఈ సంస్థ కి 20,000/- కంటే ఎక్కువ చందా ఇచ్చే వాళ్ళని స్వామీజీ గారు పర్సనల్ గా దీవెనలు అంద జేస్తారు' అని. సుబ్బారావు వెంట నే 25,000/- వారి సంస్థ కి విరాళం ఇచ్చాడు.

ఆ మర్నాడే స్వామీజీ ఇంటికి వెళ్ళాడు, వారిని పరిచయం చేసుకుని వారిని సేవించు కోవాలనే తన కోరిక విన్నవించుకుని, అక్కడే ఓ మూల వండుకు తిని, ఇంట్లో, బయట వారి పనులు చేస్తూ యధాశక్తి సేవించుకోవటం మొదలు పెట్టాడు.

కొద్ది రోజులలోనే ఆస్వామీజీ గారి ఏసీ బెడ్రూం వరకూ వెళ్ళే చనువు సంపాదించాడు. తరువాత వారం రోజుల్లో చాలా విషయాలు తెలుసుకున్నాడు సుబ్బారావ్ .

అక్కడ స్వామీజీ భోజనం మూడు ఫ్రై లు, ఆరు పులుసులు. అతని పర్సనల్ ఫ్రిజ్ లో(దర్శించవచ్చేవారు తెచ్చే)స్వీట్లు చూసి, పాలతో చేసిన పాయసం మరియూ కేక్(egg cake) లు అతని ఫేవరేట్ అని తెలిసి అవాక్కయ్యాడు.

ఆ స్వామి గారు (తన ఇన్ ఫ్లూయన్స్ తో)తన ప్రభుత్వ ఉద్యోగానికి అప్పుడప్పుడు అలా విజిట్ చేసి నెల తిరిగేసరికి పూర్తి జీతం తన బ్యాంకు లో వేసుకోవటం చూసి మళ్ళీ అవాక్కయ్యాడు.
స్వామీజీ గారి కుటుంబ విలాసాలు, అతని పిల్లల professional చదువులు, వారి ఫ్యాషన్ డ్రెస్సులు, అతని భార్య నగలు, చీరెలు, విదేశం లో వున్న తమ పెద్ద కూతురు,అళ్ళుడు గురించి, ఆ దేశం గురించి, ఆమె చెప్పే గొప్పలు చూసి, విని మళ్ళీ మళ్ళీ అవాక్కయ్యాడు.

స్వామీజీ వేసుకునే మందులు, తాగే కాఫీలు, కొనే ఆస్తులు, గడ్డానికి జుట్టుకీ వేసే రంగు, భార్య తో అతని కీచులాటలు, ఆడంబరమైన అతని జీవన విధానం తెలిసి భీభత్సంగా అవాక్కయ్యాడు.

ఇంక అవాక్కయ్యే ఓపిక లేనంతగా ఎన్నో విషయాలకు మళ్ళీమళ్ళీ అవ్వాక్కయ్యి, చివరాకరికి ఓరోజు, ఆస్వామి గారి భార్య ఎవరికో తమ పై అంతస్తు పోర్షన్ అద్దెకిస్తే ఎంత డబ్బు వస్తుందో, దాన్ని స్వామీజీ వాడటం వల్ల తనకి ఎంత నష్టమో వివరించి చెపుతున్న ఆసాయంత్రం, తన ఇంటికి బయల్దేరాడు తన ఆఫీసు విషయము, తన భార్యా పిల్లల్ని ఇంటికి తెచ్చుకునే విషయము, పిల్లడి స్కూలు పోతుందనేవిషయము, మెదలైనవన్నీ మనసులో గుర్తుకు తెచ్చుకుంటూ.

***