Pages

Wednesday, March 5, 2008

తెల్ల కాగితం


వీధి గుమ్మంలో నించుని వీధి లోకి చూస్తూన్నాను. పక్కింటి గుమ్మం లోంచి లోపలికి తొంగి చూసాను. రమణ పని నుండి ఇంకా రాలేదు. దూరంగా కృష్ణా గాడి గొర్రెలు, వాటి వెనకే కృష్ణ కనిపించారు. వీడి గొర్రెలు వచ్చే టైం అయ్యిందంటే ఈ సరికే రమణ వచ్చుండాలి, ఇంకా రాలేదంటే పొరుగూరి పనికి వెళ్ళుంటాడు ఇక రాడు.
శీను గాడి కొత్త నోటు పుస్తకం గురించి రమణ తో చెప్పాలని ఆత్రంగా ఉంది.
ఇంటి ముందు నుండి కృష్ణ గాడు వెళుతున్నాడు పోని వీడికి చెప్పనా! వీడికేమీ తెలియదు, చెప్పినా పట్టించుకోడు!
వాడు గొర్రెల తో బాటు మాఇంటిని దాటి వెళ్ళి పోయాడు.

ఉదయం బడి లో చూసిన శీను గాడి నోటు పుస్తకమే పదే పదే గుర్తొస్తూ ఉంది. ఎంత బావుందో అందమైన అట్ట ఒక్క సారి చూపించి దాచుకున్నాడు. సిటీ నుండి మా బాబాయ్ నాకోసం తెచ్చాడు కొత్త పేజీలు ఎంత మంచి వాసనో అంటూ ఊరించి చెప్పి, నాకూ ఇవ్వరా నేనూ చూస్తానని ఎంత అడిగినా ఇవ్వనేలేదు.

"శివా రారా" ఇంట్లోంచి అమ్మ గొంతు. గంజి తాగ టానికి పిలుస్తుంది. మళ్ళీ ఒక సారి వీధి చివరిదాకా చూసాను. సాయంత్రం వేళ దాటి మెల్లిగా చీకటి కమ్ముతూఉంది.
లోపలికి వెళ్ళాను. కూలిపోవటానికి సిద్దంగా ఉన్న వసారా బయట పొయ్యి ముందు ఉన్న అమ్మ ప్రక్కనెళ్ళి కూర్చున్నా
కమ్మటి గంజి వాసనకి పొట్టలో ఆకలి మొదలైంది, గబ గబా గంజి తాగేసి నాన్న కోసం గుమ్మం దగ్గరెళ్ళి నిలుచున్నా. దూరంగా వీధి మొదట్లో నాన్న కనిపించగానే పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళి కబుర్లు మొదలెట్టాను.
నాన్నా మా తరగతి లో ఈసారీ కూడా పరిక్ష లో నేనే ఫస్ట్ వచ్చా, ఈ రోజు నేను వేసిన బొమ్మ చూసి మాస్టారు నన్ను వెరీ గుడ్ అన్నాడు." చెపుతూ నాన్న తో కలిసి ఇంట్లో కి వచ్చాను.
నాన్న అమ్మ ఇచ్చిన నీళ్ళు తాగుతూ వసారా లో గోడ కి ఒరిగి కూర్చున్నాడు.
"నాన్నా శీను గాడు ఈ రోజు కొత్త నోటు పుస్తకం తెచ్చు కున్నాడు నాకు కొంటానని ఎప్పుడూ చెపుతావు ఇప్పటి దాకా కొననే లేదు."
"వరస గా కరువే కదరా! ఒక్కో సారి ఒక్కో కారణం తో పంటలే లేవు, ఈసారి పరవా లేదు. పంట డబ్బు రాగానే కొంటాలేరా. రైతు నై ఉండీ పంటలు లేక కూలికెళదామన్నా కూలి కూడా దొరకని రోజులొచ్చాయి! ఈ చిన్న రైతు బతుకు నీకు మాత్రం ఒద్దురా, నువ్వు బాగా చదివి ఉద్యోగం చేయాలి." అన్నాడు నాన్న.

"ఓ అలాగే నాన్నా నేను బాగా చదువుతాగా, మా లెక్కల మాస్టారు రోజూ అంటాడు నేను గొప్పవాన్నౌతానంట."
తరువాత చాలా సేపు అమ్మ తో ఈ సారి పంట గురించి, ధరలు, వ్యవసాయం గురించి మాట్లాడు తూనే ఉన్నాడు నేను చిన్నప్పటి నుండీ వింటున్నవే! వారి మాటలు వింటుంటే ఎప్పుడో నిద్ర పట్టేసింది.

తెల్ల వారి లేచి చూస్తే నాన్న లేడు చీకటి తోనే పొలాని కెళ్ళాడు. ఈసారి వాతావరణం బాగుంది, పంట బాగానే వచ్చేటట్టుంది, దీంతో పాత అప్పులన్నీ తీరితే చాలు అంటూ అస్తమానం పొలం దగ్గరే గడుపుతున్నాడు.
బడి కెళ్ళ డానికి తయారై పోయి "అమ్మా బడి కెళుతున్నా" అమ్మ వైపు చూస్తూ చెప్పా తలూపింది. అంటే ఇంక తినటానికేమీ లేనట్టే! పుస్తకాలు తీసుకుని బయటకొచ్చి రమణ వచ్చాడేమో నని ఓ సారి వాళ్ళింట్లోకి తొంగి చూసా వాడు లేడు.
బడి కేసి నడవ సాగాను శీను గాడి కొత్త నోటు పుస్తకం గుర్తొచ్చింది అలాంటి తెల్లటి కాగితాల పై రాసుకోవాలని నా కెప్ప టి నుండో ఆశ. ఇప్పటి దాకా కొత్త తెల్లకాగితం పై ఎప్పుడూ రాయలేదు. అక్కడా ఇక్కడ అడిగి తెచ్చిన పాత కాగితాలు, పోస్టర్ లు, ఓ వైపు ఖాళీ గా ఉన్న కరపత్రాలు, లాంటి వాటినన్నింటినీ పుస్తకం లా కుట్టి ఇస్తాడు నాన్న.
అసలు మా బడిలో చాలా మందికీ ఇంతే కొత్త పుస్తకాలు ఉండవు ఎక్కువ మంది మధ్యాహ్నం బడి లో పెట్టే అన్నం కొరకే బడి కి వచ్చేది. ఐదో తరగతి వరకూ వస్తారు, ఆతరువాత ఎవరూ చదవరు. ఆ తరువాత బడి లో అన్నం పెట్టరు గా అందువల్ల! ఐదు తరువాత పెద్ద బడి కెళ్ళ కుండా ఏదో ఓ పనికి వెళతారు.
రమణ పోయినేడాది వరకు తనతో బడి కి వచ్చేవాడు ఈ సంవత్సరం వాడు ఆరో తరగతి లోకి వెళ్ళాలి కాని చదువు మానిపించి వాళ్ల బావ దగ్గరికి కొయ్య పని లోకి పంపించాడు వాడి నాన్న. వచ్చే సంవత్సరం నేను ఆరు లోకి వెళతాను నాన్నైతే తనని మానిపించనని చదివిస్తాననే అంటున్నాడు.
ఆలోచించుకుంటూ బడి కి వచ్చేసా. సీను గాడి కోసం చూసాను వాడు కనిపించ లేదు. గది లో వెళ్లి కూర్చున్నా.
ప్రక్కన రాజు గాడు వాడి దగ్గరున్న నిన్న మాష్టారు వదిలేసి పోయిన చాక్ పీస్ ముక్కలు అందరితో ఎలా పోట్లాడి గెలుచుకున్నాడో చెపుతూ చూపిస్తున్నాడు.
"సరేలేరా " అని శీను రాలేదేమా నని చూస్తున్నా.
మొదటి పిరియడ్ మొదలైయ్యాక వాడు వచ్చాడు. మాష్టారు పాఠం చెప్పేసి "నేను చెప్పిందంతా చదవండి రా." అని తనతో తెచ్చిన పేపర్ చదుకుంటున్నారు.
తరగతి అంతా గోల గా ఉంది అందరూ ఇప్పటి నుండే అన్నం బెల్లు కొరకు ఎదురుచూస్తున్నారు.

"అరేయ్ మీరంతా అన్నం బెల్లు కి ముందు ఆకలికి, తరువాత నిద్ర కి జోగుతార్రా!" అని రోజూ అన్నట్లే అని తెలుగు మాష్టారు వెళ్లి పోయారు.

మెల్లి గా మరో రెండు పిరియడ్ లు గడచాయి.
అన్నం బెల్లు కాగానే అందరం వరస గా వెళ్ళి అన్నం తెచ్చుకుని మాట్లాడు కుంటూ తినసాగేం. ఈ సారి నాకు తప్పక కొత్త నోటు పుస్తకం కొంటానన్నాడు రా మానాన్న! అందరి తో చెప్పాను.

"అట్ట మాత్రం చాలా అందంగా ఉండాలని చెప్పరా." చెప్పాడు శీను.

"వీడిలా గీతల కాయితాలు ఉండొద్దు రా పూర్తి గా తెల్లది కొనుక్కో ."అన్నాడు రాజు గాడు.
తరువాత అందరం తరగతి గది లోకి వెళ్ళాం. ఇప్పుడు సుబ్బారావ్ మాష్టారు రావాలి కాని ఆ మాష్టారు ఎప్పుడూ సెలవు లోనే ఉంటుంటాడు కాబట్టి ఇది మాకు ఆట ల పిరియడ్ లాంటిది.
గదంతా గోల గోల గా ఉంది,అందరం శీను గాడి చుట్టూ చేరి వాడి నోటు పుస్తకం గురించి వాడు చెప్పేవన్నీ విన్నాం. ఈ పిరియడ్ చాలా తొందరగా అయినట్టు అనిపిస్తుంది రోజూ.

తరువాత గణితం మాష్టారు వచ్చారు.
శివా నిన్న నేను చెప్పింది బోర్డు పైని రాయరా." అని నాకు చాక్ పీస్ ఇచ్చారు. నేను రాసిన లెక్క చూసి "అరేయ్ నువ్వు మాత్రం చదువు మానేయకురా నీకు మంచి భవిష్యత్తుంది." అన్నారు ఎప్పటి లాగే.

చివరి పిరియడ్ సాంఘీక శాస్త్రం మాష్టారు పటాలు తెచ్చి భారతదేశ పటం పాఠం చెపుతున్నారు. అందరి చూపూ గుమ్మం వేపే ఉంది. వరండాలో మా తరగతిగది చివరగా ఉంటుంది. దీన్ని దాటి వరండా చివర కెళితే అక్కడ బెల్లు ఉంటుంది.
ఈ చివరి పిరియడ్ లో రహీం మాతరగతి ముందు నుండి వెళ్ళాడంటే బెల్లు అయినట్టే. రహీం నిచూడగానే అరచుకుంటూ బయటకి పరుగు పెట్టేస్తారు అంతా.

రహీం ని చూడ గానే మాష్టారు పాఠం చెప్పడం ఆపేసారు. అంతా తోసుకుంటూ వెళుతున్నారు.
"శివా నువ్వుండరా, ఈ మ్యాపులు తీసుకుని నాతో రా." అన్నారు మాష్టారు. ఆ పటాలు పట్టుకుని మాష్టారుతో ఆఫీసు గది కి వెళ్ళి టేబుల్ పై పెట్టి బయటకి వస్తుంటే గుమ్మం పక్కన తెల్లటి మబ్బుముక్కలా పడుంది ఓ తెల్ల కాగితం. అన్నం బెల్లప్పుడు వచ్చిన ఆ గవర్నమెంట్ సార్లు పడేసుకున్నారేమో పాపం!
వంగి దాన్ని చేతిలోకి తీసుకున్నా. అబ్బా ఎంత బావుందో పూర్తిగా తెల్లది, కొత్త కాగితం! వెనిక్కి తిరిగి చూసా మాష్టారు పటాలు సర్దుకుంటుంన్నారు.
"ఇది ఇక్కడ పడుంది నేను తీసుకోనా మాష్టారు.. " అడిగా. నావైపు తిరిగి చూసి "ఊ తీసుకో" అన్నారు.

దాన్ని భద్రంగా పట్టు కుని ఇంటికి బయల్దేరాను. స్కూల్ ఓ పక్కన పడి పోయిందని ఇంకో మంచి గదులు కట్టించ మని పెద్ద మాష్టారు గవర్నమెంట్ కి రాసారంట ఈ రోజు వాళ్ళొచ్చి చూసెళ్ళారు.
రాజు గాడి ఇంటి దగ్గర కొచ్చాను వాడు బైటే నిలుచుని ఉన్నాడు,
"ఆటకి రావారా." నన్ను చూసి అరచాడు. ఉహూ రాను చెప్పి మా వీధి మలుపు తిరిగాను. మన కేమైనా సమస్య వస్తే గవర్న మెంట్ కి రాస్తే వారొచ్చి తీరుస్తారట! గవర్న మెంట్ గురించి మాష్టారు చెప్పే వన్నీ గుర్తు తెచ్చు కుంటూ ఇంటికొచ్చాను.

పూర్తి తెల్ల కాగితం, కొత్త ది నాదే అనుకుంటే సంతోషతో ఉప్పొంగి పోతున్నా.., శీను గాడి నోటు పుస్తకం సంగతి పూర్తి గా మర్చి పోయాను.
వీధి లోకి వచ్చి ఎవరైనా కనిపిస్తారేమోనని చూస్తున్నా, రమణ వస్తున్నాడు. వాడికీ ఎంతో ఇష్టం చదుకోవటం. పనికి వెళితే వాడికి డబ్బులేమీ ఇవ్వరంట వాడి బావ దగ్గర నలుగురు పనివాళ్లున్నారు వారిదగ్గర చిన్న చిన్న పనులు వీడు చేయాలట. ఆ కొయ్య పని నేర్చుకుని పెద్దయ్యాక బాగా చేస్తే అప్పుడు డబ్బు లిస్తారంట. అప్పుడు ఒకే సారి అన్ని పుస్త కాలూ కొనుక్కుంటారా అంటాడు వాడు.
అమ్మంటుంది మన పరిస్తితులకి రోజూ అన్నం పెట్టి, సంవత్సరానికి ఓ లాగూ, చొక్కా ఇచ్చి పని నేర్పుతున్నారంటే అది వాడి అదృష్టమేనంట.
"నిన్నంతా రాలేదారా?" వాడు దగ్గరికి రాగానే అడిగాను.
"లేదురా. రేపటి నుండీ ఇక్కడుండను, సిటీ లో బావ కి పెద్ద పని కుదిరింది. రెండు నెలలు అక్కడే ఉండి పని పూర్తి చేయాలి. బావ దగ్గర పనిచేసే వాళ్ళ అక్కడే ఉన్నారు బావ వాళ్ళ ఇంటికొస్తూ నన్నూ తీసుకొచ్చాడు ఇప్పుడే వస్తున్నా మళ్ళీ రేపెళ్ళిపోవాలి."
వాడికి నా తెల్లకాగితం గురించి చెబుతూ ఇంట్లోకి తీసుకొచ్చి చూపించాను.
"బావుంది. ఏమ్రాస్తావు రా దీనిపైని ? బొమ్మ వెయ్యిరా నువ్వు బొమ్మలు బాగా వేస్తావు" అన్నాడు.

వాడెళ్ళాక ఆలోచించడం మొదలెట్టా ఏం రాయను దీని పైనని. తెల్ల గా ఉన్న దాన్ని చూస్తే ఎంతో ఆనందంగా గొప్పగా ఉంది. ఏదైనా రాయడం నచ్చలేదు. నాజీవితం లో మెదటి సారి నా సొంత తెల్ల కాగితం ఇది. దాన్ని భద్రంగా పుస్తకాల మధ్య దాచాను. ఇక అప్పటి నుండీ అది నాప్రాణమై పోయింది. అదే నా పెన్నిధి.
బడిలో బైటా అందరికీ చూపించి దాచుకున్నా. నాన్న కొత్త నోటు పుస్తకం కొనిచ్చాక దీనిపై ఏదైనా రాసుకోవాలి అనుకున్నా, కాని ఒద్దనిపించింది. దీన్నిలాగే దాచుకుని ఆ పుస్తకం లో రాసుకుంటా అనుకుని దాని కోసం ఎదురు చూడ సాగాను.

****

సిటీ నుండి రమణ ఇంకా రాలేదు. నేను ఎప్ప టి లాగే బడి కెళుతూనేఉన్నా.
గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకున్నారట ఓ కాంట్రాక్టర్ వచ్చాడు బడి లో రెండు కొత్త గదులు కడుతున్నారు.
నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సారి అన్నీ కలిసొచ్చాయి వాతావరణం బాగుంది, ఈపంట చూస్తుంటే పాత అప్పులన్నీ తీరిపోయి కొంత డబ్బు మిగులుతుంది అని రోజు కొక్క సారైనా అంటున్నాడు.
నా తెల్ల కాగితం నాప్రాణ మై పోయింది రోజూ లేవ గానే తిరిగి పడుకునే ముందు దాన్ని చూసుకోవాల్సిందే.

"నాన్నా కాగితం చెట్టు నుండే వస్తుందని మాష్టారు చెప్పారు మన పొలం లో ఆ చెట్లేసి మనం బోల్డు కాగితం తయారు చేసుకుందామా."
"అవి తయారవ డానికి మిషిన్లు కావాలి కదరా. చెట్లని మనం పెంచి అమ్మినా కాగితాలని కొట్టు కెళ్ళి డబ్బు లిచ్చి కొనుక్కోవాలి. సూరి మామ పత్తి పండించినా బట్ట లు కొనుక్కోవల్సిందే కదా అలాగన్న మాట." చెప్పాడు నాన్న.
సూరి మామ పత్తి వేసినా వాళ్ళు పాత బట్టలే వేసుకుంటారు. పత్తి నుండే బట్ట లొస్తాయని మాష్టారు చెప్పి నప్పుడు , నాకైతే చాలా పత్తి పంటేసి చాలా చాలా గుడ్డ తయారు చేస్తే అందరూ చిరుగుల్లేని కొత్త బట్టలు వేసుకోవచ్చు కదా! అని పిస్తుంది. కాని అందరూ ఈ సారి ఎక్కువ పండిచేసారు కాబట్టే పంట ధర చాలా తక్కువ పలికింది అన్నాడు మామ. అలాగైతే మరి కొట్టు లో బట్టలు కూడా తక్కు వధర ఉండాలి గా! నాకు అస్సలు అర్ధం కాలేదు.

****

ఈ రోజు నాన్న పంట అమ్మి డబ్బు తేవడానికి టౌన్‌ మార్కెట్ కెళ్ళాడు.
బడి నుండి వచ్చి నాన్న కోసం ఎదురుచూస్తూ ఉన్నా. చీకటి పడి పోయింది. పక్కింటి మామ వస్తున్నాడు మా ఇంటి దగ్గరికి రాగానే ఆగి మీనాన్న రాత్రికి రానని చెప్పాడు రా, పంట ధర పలక లేదు రేపటి దాకా చూసి రేపొస్తానని చెప్పమన్నాడు. మీ అమ్మకి చెప్పు అంటూ వాళ్ళింట్లోకి వెళ్ళాడు.
ఇంట్లో కి వచ్చి అమ్మ తో చెప్పి నాన్న తెచ్చే వాటి గురించి ఆలోచిస్తూ నిద్ర పోయాను.

తెల్ల వారి బడి కెళ్ళినా నా మనసంతా ఇంటి మీదే ఉంది నాన్న వచ్చాడేమో కొత్త నోటు పుస్తకంతెచ్చే ఉంటాడు అనుకుంటూ వున్నా.
బడి నుండి వచ్చే సరికి ఇంకా నాన్న రాలేదు అమ్మ ఏడుస్తూ కనిపించింది. పక్కింటి అత్త కూడా కళ్ళు తుడుచుకుంటూ అమ్మ పక్కనే కూచునుంది.
మన పంట ని కొనే వాళ్ళు మరీ అన్యాయ మైన ధర చెబుతున్నారంట, ఇంకా ఏవేవో మాట్లాడు కుంటుంన్నారు. అక్కడే కూచుని వాళ్ళ మాటలు వింటూ అనుకున్నా.. కొట్టు లో మనమేమయినా కొనుక్కుంటే ధర కొట్టు వాడే చెబుతాడు కదా! మరి మనంపంట అమ్మేటప్పుడు కొనే వాడు ధర చెప్పడ మేంటో నాకు అస్సలు అర్ధంకాలేదు. అమ్మ ని అడుగు దామను కున్నా అమ్మ ఏడుస్తుందికదా ఒద్దులే నాన్నవచ్చాక ఈ విషయంఅడగాలి. నాన్న నేనేమడిగినా చెపుతాడు అవి నాకు కొన్ని అర్ధమవక పోయినా నాన్న చెపుతుంటే అలాగే వినాలనిపిస్తుంది.
చీకటి పడ్డాక నాన్నొచ్చాడు. అమ్మా నాన్నా చాలా సేపు మాట్లాడు కున్నారు. నాన్న కూడా ఏడ్చాడు. నాకు భయమేసి నిద్రపోయాను.

పొద్దున్నే లేచేసరికి నా పక్కనే కూచును కనిపించాడు నాన్న. నిన్న జరిగింది గుర్తొచ్చింది,

"ఎందుకు నాన్నా మన పంట వాళ్ళు అన్యాయపు రేటు కి కొన్నారు?"
"మన అవస రాన్ని కనిపెట్టి వాడు ధర కడు తున్నాడు" చెప్పాడు నాన్న.
"మరి కొట్టు లో మనంకొంటే కొట్టు వాళ్ళే ధర చెపుతారుగా!"
"అక్కడా మన అవసరాన్ని కనిపెట్టి వాడే ధర చెబుతాడు. సంవత్సర మంతా కష్ట పడి చేసిన పనికి రూపాయి పెట్టిన చోట అర్ధరూపాయి కూడా రాలేదు. వచ్చిన ఆడబ్బు కూలీలకి ఇవ్వటానికే సరి పోతుంది. అప్పు పెరుగుతూనే ఉంది. ఒకో సంవత్సరం ఒకో కారణంగా పంట దెబ్బ తింటుంది. మంచి పంట వచ్చినప్పుడు ఇలాగుంది." అన్నాడు.

"మరెలా నాన్నా అలాగైతే?"
"గవర్న మెంటు సరైన ధర ఇచ్చి మన పంట కొంటే అప్పులు తీరి మళ్ళీ పంటేయ టానికి బ్రతికుంటాం. ఇలాగే ఐతే ఈ వ్యవసాయంకన్నా ఏసిటీకో పోయి ఏ కూలి పనో చేసుకుంటే కనీసం ఆకూలి డబ్బైనా దక్కుతుంది. ఇక్కడ మన పొలం లో మనంచేసే కూలీ కీ విలువ లేదు.." అంటూ ఇంకా చాలా చెప్పాడు.
గవర్నమెంటు మన పంట కొంటే అసలింకా సమస్యే లేదని నాకు అర్ధమైంది. మరింకేం గవర్నమెంట్ కొనచ్చుగా!
పెద్ద మాష్టారు గారు రాయగానే వచ్చి బడి లో గదులు కడుతున్నారు గా గవర్నమెంటు వాళ్ళు!
అనుకుంటూ రోజు లాగే పాత పుస్త కాలలో దాచుకున్న నా తెల్ల కాగితాన్ని చూసుకుంటుంటే నేనేం చేయాలో తెలిసింది.

పెన్‌సిల్ ముక్క తీసుకుని దాని పై రాయ సాగాను
'గవర్నమెంట్ గారు మాఊళ్ళో రైతు లు పండించే పంటని మీరువచ్చి న్యాయ మైన ధర కి కొనాలి మాకు ఆడబ్బులు ఉంటేనే మీరు కట్టించే బడి గదుల్లో చదువుకోగలం లేకపోతే అందరూ సిటీ వెళ్ళి పోతామని,' ఇంకా నాన్న చెప్పిన విషయాలూ, నాకు తోచినవి అన్నీ రాసేసాను.
దాన్ని తీసుకెళ్ళి నాన్నా ఇదిగో దీన్ని గవర్న మెంటు కి పంపించు. ఇక ముందంతా వాళ్ళే వచ్చి మనంచెప్పిన ధరకే పంట కొంటారు. గవర్న మెంటు చాలా మంచిది నాన్నా మాపెద్ద మాష్టారు రాయగానే వచ్చి బడి గదులు కట్టేస్తున్నారు.

నాన్న నా వైపు ఓసారి చూసి ఏదో అనబోయి, సరే అలాగేరా అని దాన్ని తీసుకున్నాడు.
***
(కొత్తపాళీ గారి కథ రాయండి శీర్షిక కోసం (ఇతివృత్తం తెల్ల కాగితం) నేను రాసిన కథ ఇది)