Pages

Thursday, July 22, 2010

మా తోట

కొన్నాళ్ళ క్రితం. అంటే.. కొన్ని చాన్నాళ్ళ క్రితం అన్నమాట. చుట్టలు చుట్టుకుంటూకుంచెం త్వరగానే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోవచ్చు. ( పుగాకు చుట్టలు కాదు సినిమాల్లోలా ఫ్లాషు బ్యాకు చుట్లు/ వలయాలు)
ఓ రోజు మా వారు ఫోన్ చేసి 'చిన్నూ రెడీగా ఉండు బయటకెడుతున్నాం, నేనో అరగంటలో వచ్చేస్తాను' అన్నారు ఆ అరగంట చుట్టుపక్కల తన ఫ్రెండ్స్ ఇండ్లల్లో (ఆటకి వెళ్ళిన) మా వాడిని వెతికి ఇంటికి తీసుకువచ్చే సరికే అయ్యింది. ఈయన వచ్చీరావడంతోనే "పదా పదా వెళదాం ఇలాగే రండీ." అంటూ.. "సరే సరే ఎక్కడికీ ఎక్కడికీ ముందది చెప్పండి." అంటూ నేను. (ఎక్కడికో తెలిస్తే అక్కడికి తగ్గట్టు ముస్తాబై వెళ్ళాలి కదా :p )
"నీకు తోటలు చెట్లూ చేమలు పొలాలు చేన్లూ అంటే పిచ్చి కదా. ( ) అదే అదే పిచ్చిప్రేమ కదా.. ఓ తోట వుంది నీకు నచ్చిందంటే అది మనదే."
"భలే! కానీ ఇప్పుడా మనం వెళ్ళేసరికే చీకటి పడిపోతుందేమో అక్కడేం చూస్తాం."
"ఎంతా అరగంటలో అక్కడుంటాం" ఆయన నోట్లోంచి వస్తున్న మాటలు పూర్తవకుండానే ఓ వాటర్ బాటిల్ బ్యాగులో పడేసుకుని చెప్పులేసుకుని సిద్దం అయిపోయ్యాం ఉన్నఫలంగా.

{ఇక్కడో పి.వే. ;- మేం ఇప్పటి వరకు ఏది చేసినా, ఏది చూసినా, ఎక్కడికి వెళ్ళినా చీకటి పడిపోయే వుంటది :( మా హీరోగారు హడావిడిగా ఆలస్యంగా పదా పదా అంటూ వస్తారు. హూ  అర్ధరాత్రి స్వాతంత్ర్యం పొందినవాళ్ళం కదా, అదే పరంపరలో మా పనులు}
"మనకి దగ్గర.  ఎప్పుడుకావాలన్నా వెళ్ళొచ్చు...  అంటూ మొదలెడుతూ ఆ పొలమూ తోటా విశేషాలు, సంగతులూ చెప్తూ ఊరిస్తున్నారు. వింటూ కలల్లోకి వెళ్ళిపోయాను నలుపూ తెలుపులో సావిత్రి ఎంటీయార్ లా పొలం పనుల్లో నేనూ మావారు. వెనకే ఓ బుల్లి రైతు గెటప్పులో మా చిన్నోడు . మనసు తెరపై వరసగా దృశ్యాలు మారుతున్నాయి . పొలం గట్లపై క్రిష్ణా శ్రీదేవి లా (డ్యూయెట్) కబుర్లు చెప్పుకుంటూ. నాగేశ్వర్రావ్ వాణిశ్రీలా...

అలా నా గోలలో నేనున్నా నా సుపుత్రిడి ప్రశ్నలూ ఈయన సమాధానాలు ఓపక్క విపిస్తునే వున్నాయి.
"డాడీ నాకు తోటలో బోరు కొట్టకుండా ఎదన్నా పెంచుకోనా"
"ఓయస్స్ నాన్నా, ఓయస్స్."
"చిక్స్ పెంచుకుంటా, ఎంచక్కా వాటితో ఆడుకోవచ్చు."
"ఓకే, ఓకే"
"మేక పిల్లను పెంచుకుంటా డాడీ, కార్టూన్ లో ఆమెవెంటే మేకపిల్ల వెళుతూ వుంటది గెంతుతూ భలే బావుంటది. నేను పెంచింది నా వెనకే అలాగే వస్తుంది."
"రైట్, పెంచేద్దాం."
కుందేళ్ళూ, బాతులు, నెమళ్ళు, పక్షులు అంటున్నాడు. కాసేపు వాటికేం పేర్లు పెడతాడో చెప్పాడు. అన్నింటికీ వాళ్ళ నాన్న రైటో రైటో.
"డాడీ గుర్రం పెంచుకుందాం. నేను పొలంలో తిరగడానికి కావాలి కదా."
వాళ్ళ నాన్న తల ఆడించడం ఏమాత్రం తగ్గించకుండా అలాగే అలాగే అన్న ఫోజులోనే వున్నారు వరాలిచ్చే దేవుడిలా.
హమ్మో నేనింక నా ఊహల్లోంచి బయటపడి విషయాన్ని నా చేతుల్లోకి తీసుకోకపోతే నా సుపుత్రుడు ఏనుగు, ఒంటే కూడా పెంచుతానంటాడు :(
(వాడికి ఏదైనా నో చెప్పినా ఊరుకుంటాడుగానీ సరే అన్నతరువాత దాన్ని వద్దంటే :(
నా మనసులోని అందమైన సినిమాకి తెరవేసి వాడిని మెల్లిగా వేరే కబుర్లలోకి మళ్ళించడం మొదలెట్టాను. మా వారు చిద్విలాసంగా డ్రైవింగ్ మునిగి పోయారు. కారు సిటీ దాటింది.



*********** కట్ .. చేస్తే .. *************


సావిత్రీ, ఎంటీయార్, పొలం పాటలు దృశ్యాలైతే లేవుగానీ...

జీవితంలో వున్న ఆనందాలకు మరొక్కటి జతకూడింది :)

ఇంకా.... రోజూ  ఇంటికి వచ్చే తోటలోని కాయగూరలు, పండ్లూ,పూలు, పాలు. అప్పుడప్పుడు ఆకుపచ్చని వారాంతాలు. ఇంకా ఇంకా...


తోటలోని కొన్ని చిత్రాలు





Thursday, July 1, 2010

ఆ జ్ఞాపకాలు ఇకలేవు!

హైవేనుండి ఊళ్ళోకి వెళ్ళే రోడ్డు దారి పట్టింది కారు. ఏదో తెలియని ఉత్సాహంతో మనసు మరింత చిందులేస్తోంది.
"అప్పట్లో ఈ గుడిని చూస్తే భయమేసేది. ఇప్పుడేంటో ఇలాగైపోయింది." రోడ్డు పక్కనే ఉన్న గూడులాంటి గ్రామదేవత గుడిని చూపిస్తూ చెపుతోంది అమ్మ. "ఓసారి ఇదిగో ఈ చింతచెట్ల కిందగా బండిలో వస్తోంటే నువ్వు చింతకాయకోసం కొమ్మలు పట్టేసుకున్నావు, బండి వెళ్ళిపోతూనే వుంది నువ్వేమో ఏడుస్తూ కొమ్మని అలాగే పట్టుకువ్రేలాడుతూ ఉండిపోయావు." ఎప్పటివో గుర్తుతెచ్చుకుంటో అమ్మ.
ఈ చెట్టేనా.., ఉహూ కాదు దీనికంత పొడవు కొమ్మలు లేవు అదిగో అదేమో, ఓ చిన్ని బుజ్జిపాపను ఆ చెట్టుకొమ్మకి ఊహించుకుంటూ నేను.
మసకగా గుర్తున్న ఆ ఊరి జ్ఞాపకాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఊహతెలియని వయసులోనివి నాకు ఇంకా ఎలా గుర్తున్నాయి అది అమ్మకే కాదు నాకూ ఆశ్చర్యమే!

కారు మెల్లిగా ఊళ్ళోకి ప్రవేశించింది. నా స్మృతిలో విశాలంగా ఉన్న రోడ్డు చిన్నగా ఇరుకుగా! "అయ్యో ఊరేంటి ఇలా మారింది" ఆశ్చర్యమో మరింకేదో అమ్మ గొంతులో. "చూడు వీధికి ఎదురుగా ఉన్న ఆఇల్లు ఆరోజుల్లో ఎత్తుగా ఊరంతటికీ అందంగా అనిపించేది, అదే కాదు ఇండ్లన్నీ చిన్నగా కుచించుకు పోయినట్టు అదోలా ఐపోయాయి!" నమ్మలేనట్టుగా చూస్తూ అంటోంది. అందరూ ఇండ్లలో తలుపులు బిగించుకుని టీవీ లో మునిగారేమో వీధుల్లో ఒక్కరూ లేరు.

గతుకులరోడ్డు పై డ్రైవింగులో మా వారు నా మాటలు వింటూ ఊరిని చూసే పరిస్థితిలో లేరు.
సీరియస్ గా, తనకేమీ పట్టనట్టుగా నాన్న. ఆయకిష్టంలేదు తప్పనిసరై వచ్చాడు. ఆయన్ని అనవసరంగా బలవంతపెట్టి తీసుకొచ్చానా అనే గిల్టీ నాలో ఓసారి తొంగిచూసి లోనకెళ్ళింది.

ఊరి మధ్య ఎత్తుగా ఆంజనేయస్వామి గుడి వుండాలి. ఎత్తైన మిద్దెలా రాళ్ళను పేర్చిన కట్టడం పైన స్థలంలో చుట్టూ చిన్న పిట్టగోడ మధ్యలో ఆరు బయటే నిలువెత్తు ఆంజనేయస్వామి విగ్రహం ఊరంతటినీ చూస్తున్నట్టుగా ఉండేది. వెతుక్కుంటూ చూస్తున్నా దాన్ని దాటివెళ్ళినా గుర్తుపట్టలేకపోయాను. ఓ రాళ్ళకుప్పని అదేనేమో నన్న అనుమానంతో తిరిగి తిరిగి చూస్తూ అదేనని నిర్ధారించుకొన్నా.
నగరాల్లో ఎత్తైన భవనాలు, విశాలమైన రోడ్లకి అలవాటైన నా కళ్ళకి ఇవన్నీ చిన్న చిన్ని మట్టి బొమ్మల్లా ఉన్నాయేమో :(

ఇంటిదాకా వచ్చేసాం.ఆ చిన్నరోడ్డుపైనే ఓ పెద్ద చెట్టుకింద కారు ఆపుకుని దిగి పరిసరాల పరిశీలనలో మునిగిపోయాను. ఇంటికెదురుగా ఎత్తైన ప్రహారీ లోన పెద్ద వృక్షాల మధ్య హుందాగా నిలుచుని ఉన్న బడి భవంతి దానికీ ఇంటికి మధ్య పేద్ద (చిన్నపిల్లలకు అలా అనిపించేదేమో) రోడ్డు అదీ నా జ్ఞాపకం. కానీ అక్కడలాలేదు :( ఇంటికెదురుగా చిన్న రోడ్డు కావల వెలిసిపోయిన శిధిలమైన ఓ చిన్న బడి!

అయోమయంలోంచి తేరుకుంటూ అమ్మ వెనక ఇంటిగేటు వైపు అడుగులేసాను. ఇంట్లోని వస్తువులతో సహా బంధువులకి ఒప్పజెప్పిన ఇల్లు. మరో రెండుమూడు చేతులుమారి ఇప్పుడెవరో ఉంటున్నారు. కృంగిపోయిన ఆ ఇల్లు ఉహూ అదికాదు నా జ్ఞాపకం :(
ఒప్పుడు ఆ ఆవరణలో అపరిశుభ్రంగా పశువులు,శిధిలావస్థలో ప్రహారీగోడ. లోనకెల్లకుండానే వచ్చేసి రొడెంటా నడుస్తూ ముందుకెళ్ళాను.

కారు పక్కనే కదలకుండా నాన్న. ఒకప్పుడు ఆ ఊరివాళ్ళైన తన స్నేహితులకి(ఇప్పుడెవరూ లేరు ఆ వూళ్ళో) ఫోన్ చేస్తూ. మీరొస్తామని చెపితే వచ్చేవాళ్ళం అన్నారట. 'పెద్ద చదువులు అందరినీ వూరికి దూరంగా పట్టుకెళ్ళిపోయాయి. ఊళ్ళో ఎవరుంటారు మన పిచ్చిగాని.' అక్కడే మిగిలి వున్న వాళ్ళలో కళ్ళలో 'ఏదో ఇంకేదీ చేతగాక ఇక్కడే పడివున్నాం' అన్న విసుగు.

కాసేపు ఫోన్ మాట్లాడుతూ, కాసేపు ఊరికే తనకేం పట్టనట్టు బడి వైపు చూస్తూ అక్కడే వుండిపోయాడు నాన్న. 'అబ్బ ఎంత అదృష్టవంతుడు. పుట్టి పెరిగిన సొంత వూరిని ఎన్నో ఏళ్ళతరువాత చూసినా ఏ అనుభూతీ, ఆరాటమూ లేకుండా!' స్థితప్రజ్ఞుడు!
అనవసరంగా బలవంతపెట్టి తీసుకొచ్చానేమో, ఉహూ అనుభూతి అంటూ లేని మనిషెవరుంటారు. ఏమో..!

కాస్త ముందుకెళితే అక్కడ గచ్చుతో కూడిన పునాదులు ఉండాలి అది నాన్న వాళ్ళదే పూర్వీకులది అది పడిపోయాక ఇటుపక్కగా ఇంకోఇల్లు కట్టించారట. అల్లిబిల్లిగా అల్లుకున్న చెట్లలో ఆసక్తిగా చూస్తూ మా వారితో ఆ సంగతులు చెపుతూ నేను. పక్కనే పెద్ద బావి ఒకేసారి నలుగు తోడుకునేవిధంగా నాల్గువైపులా గిలకలతో. అది మాత్రం ఇంకా అలాగే ఉంది ఊరికి నీళ్ళందిస్తూ.
చేనంతా ఎవరెవరో ఆక్రమించుకుని ఇండ్లు కట్టుకున్నారు. దానికావల వాగు. అన్నయ్యతో కలిసి వాగులో చేపలు పట్టే వాళ్ళని గమనిస్తూ ప్రశ్నలేస్తూ ఒంటిమీద సృహలేకుండా రోజంతా తిరిగి బాబాయితో చేతిలో తిన్న ఆ దెబ్బలు ఇంకా గుర్తున్నాయి ఏమిటో నాకు!
వాగు దాటి కాళ్ళు నెప్పెట్టేంత దూరం నడిస్తే నాన్న వాళ్ళ తోట. పెద్దబావి దాని పంపులోంచి వేగంగా ఎగిరిదూకే పాలనురుగులాంటి నీళ్ళూ అవి పారే కాలువ వాటిల్లో నా ఆటలు. కాలువ నిళ్ళ అడుగున మెరిసే సన్నటి ఇసక గుండ్రని నున్నని రాళ్ళూ..
బావికి ఓపక్క పచ్చటి పొలం, ఇంకోవేపు మామిడి తోట దాంట్లో తాతమ్మ, తాతయ్య సమాధులు. ఇంకోపక్క కాయగూరల మడులు.. నా జ్ఞాపకాలు.
ఇప్పుడూ అలాగే వుందో లేదో.
"అక్కడికి వెళ్దామా?"
అడిగాను వాగుకీవల నిలుచుని కనిపించనంత దూరంలో వున్న ఆ తోటకోసం చూస్తూ.
"వద్దులే గుళ్ళో దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం." వాగులో కాళ్ళు కడుకుని పక్కనే వున్న కొండ మెట్లవైపు వెళ్ళింది అమ్మ. వాగునానుకుని కొండ దానిపై శ్రీనివాసుడి కోవెల. ఆ మెట్లు చాలా ఎత్తుగా నిట్టనిలువుగా వున్నట్టుగా వుంటాయి. ఈ నిరుత్సాహంలో ఆ మెట్లు ఎక్కలేనంతగా నీరసించాను.

వాగుకి కొండకి మధ్య కాలిబాట ఆ వైపుగా వెళితే ఇంకోపొలం ఒకప్పుడు బంగారంలా పండే వరిpolaM, ఇప్పుడంతా పత్తి వేశారు. ఈ పొలం ఎంతబావుండేది. పక్కనే పంట నూర్పిళ్ళకోసం సహజసిద్దమైన బల్లపరుపుగా పరుచుకున్న కొండరాయి. అలసిపోతే విశ్రాంతికి పెద్ద వేపచెట్టు. పైగా ఇంటికి పక్కనే. ఇప్పుడా పొలం ఎవరిదో!

నా జ్ఞాపకాలేవీ అక్కడున్న వాటితో సరిపోలలేదు. ఆ ఊరంటే ఇప్పుడింక ఇవే గుర్తొస్తాయి. ఏదో అనుకుని వెళ్ళి ఆ పాత బంగారు జ్ఞాపకాలను పోగొట్టుకున్నాను.

ఊరడించే నా మనసు మాటలు వింటూ బయలుదేరాను, లేదు లేదు అనుభూతులు ఎన్నటికీ వదిలిపోవు కదూ తిరిగి అలాంటి సన్నివేశాలు నాజీవితంలో ఉంటాయి రూపం మార్చుకుని. జీవితంలో వ్యక్తులు మారతారు ప్రేమమారదు. దారులు పరిసరాలు,ప్రదేశాలు మారతాయి అనుభూతులూ స్పందనలూ మారవు.
మన కోసం మన జ్ఞాపకాలని ఊరువాడా ఏరు ని ఎవరో అట్టేపెట్టుకు కూర్చోవాలని అనుకోవడం అత్యాశ కదూ!

మళ్ళీ..

నేనేమీ కొత్తగా రాయకపోయినా అడపా దడపా కామెంట్లతో పరకరిస్తూనే వున్నారు మిత్రులు. తట్టిలేపిన వారందరికీ దన్యవాదాలు.

రాయండి, ఎందుకని మానేసారు అంటూ అడిగారు ఓ ప్రెండ్. మిగతా సాకులన్నీ పక్కన పెడితే,
నిజంగా చెప్పాలంటే... రాయడానికేమీ లేదండి నా అభిప్రాయాలు మారిపోతూ ఉన్నాయి. ఏదైనా రాయాలంటే చూసిందో విన్నదో లేదూ అనుభవమో దానికి మన అభిప్రాయాన్ని జోడించడమేగా! నమ్మకాలు అభిప్రాయాలు కాలాన్ని బట్టి మారుతున్నాయి. ఈ లెఖ్ఖన ఇప్పుడు నేనేదన్నా చెప్పానో అది నాకు ఇంకొన్నాళ్ళకు సరి అనిపించదేమో కదూ!

పోనీయండి అభిప్రాయాలు మారనివ్వండి మారుతున్న అభిప్రాయాలే ఓ రికార్డ్ గా ఉండనివ్వండి. సందేశాలేమీ ఇవ్వనప్పుడు, అవి భోధనలు కాదని అన్నప్పుడు ఇంక పేచీ ఏముంది. రాయండి. ఈ క్షణంలో మీకేం అనిపిస్తే అది. మరు క్షణం ఆ అభిప్రాయం మారనీగాక.

"అభిప్రాయాలు" ఒక రికార్డ్ గా. ఓహో ఇదేదో ఆలోచించాల్సిందే!
చూసింది విన్నది అనుభవించింది ఇంకొదరికి చూపించాలన్న తాపత్రమే, మనసులోనిది నలురిలోకి వెళ్ళాలన్న తపనే తప్పించి ఓ రచన ద్వారా సందేశాలో మరింకేదో చెప్పాలని లేదు. మరింక పేచీ లేనట్టే అనిపిస్తీంది, కానీ ..మరీ... ఊ ఇంక చాలు.