Pages

Wednesday, November 17, 2010

ఈ రొజు నాది.....వంశీ లాగేసుకున్నాడు

 *(లాగేసుకోవడం = లాక్కోవటం*  (లాగు +ఏసుకోవటం అనుకోకండే)

అన్నింటికి సెలవు ఇచ్చేసుకున్నాను.  రోజు నాది. అచ్చంగా  నా ఒక్కదానికే!  తీరిగ్గా  దొరికానని  పలకరించడానికి వర్షం  తనకు తొడుగా పొగమంచుని చలిని వెంటబెట్టుకుని మరీ వచ్చేసింది!
  ఇంటి చుట్టూ కురిసే వర్షం  డోంట్ డిస్ట్రబ్  బోర్డ్ లా నా ఏకాంతానికి కాపలా.  చలికాలంలో ఈ తుఫాను వర్షం   కాఫీలు, పుస్తకాలు  సూపర్ జొడీ. 
పుస్తకాల బీరువాలో  పసలపుడి కథలు  మళ్ళీ ఓ సారి మా పసల పూడికి రాకూడదూ  అని ఆహ్వానిస్తూ....
   ఎందుకు మళ్ళీ  చేయి ఆ పుస్తకం  వైపె వెళుతుందంటే..... 
ఏమో!  ఏదో  ప్రత్యేక లోకం లోకి వెళ్ళినట్టుంటుంది నాకు ఆ కథల్లోకి వెళితే. సహజమైన ఏ భెషజాల్లెని ఓ ప్రపంచం అది! 

వంశీ  సినిమా  సినిమాల్లో  ఎలా  డిఫరెంటో,  దాంట్లోని హీరోయిన్ ఎలా  ప్రత్యేకమో,  హీరో, మిగతా  పాత్రలూ, సెట్టింగులు,  ఊరు  వాడ,.  పాటలు  డైలాగులు  మిగతా  సినిమాల కంటే  ఎలా  డిఫరెంటైనవో  అలాగే  వంశీ  కథలు  కూడా.
ఆయన  అన్ని  కథల్లో      ప్రతి పాత్రకీ   ఓ గాధుంటాది.  ప్రత్యేక  లక్షణాలు  అలవాట్లు  కళ్ళకు  కట్టినట్టు  వర్ణింపబడతాయి. పడవ నడిపే వాడైనా,  ఊరిపెద్ద ఐనా,  కూలైనా,  కళాకారుడైనా, మాట్లవాడైనా  సోమరిగా ఉన్న జూదరైనా,  దొంగైనా,  దొరైనా   అంతా  మనకి  తెలిన వాళ్ళే,   అంతా  మనవాళ్ళేననిపిస్తుంది.   ఆ  మనుషులు  మన  మనసుకి  దగ్గరగా,  వాళ్ళ యవ్వారమంతా   ఎంతో  సహజంగా! 
 పాత్రలు  మాటాడవు  మనసువిప్పి  చూపెడతాయి.   హీరో  గురించిన  వర్ణన  ఎలాగుంటుందో  అంతే  సహజంగా  విలన్  గురించీ.  పాత్రల మధ్యనే  యుద్దం.  చూడబోతే  విలన్  తో  ఈయనకేమీ  సొంతపేచీ్లు   ఉండవు.  ముఖ్యంగా  పరిసరాలు  వాటి వర్ణనా  నేను ఆ చోటంతా  తిరిసి వచ్చినట్టు ఓ ఫీలింగ్
అన్నీ ప్లెస్సులేనా...!  నా కైతే  కొన్ని మైనస్సులూ  కనిపిస్తాయి.     కథ  చక్కగా  సాగుతుంటూ  ఉంటుంది     ఆత్రంగా  చదువుతూ  ఉంటాం. మధ్యలో కొస్తుంది  చూడు  తిండి  గురించిన  వర్ణనలు     కథ మానాన దాన్ని  వదిలేసి  ఎంచక్కా  తాపీగా   వంటల గురించి  పేజీలకు  పేజీలు .  ముఖ్యంగా  వార పత్రిక  సీరియల్స్ లొ  చదువుతున్నప్పుడు  ఇది  చాలా  ఇబ్బంది  పెడుతుంది  నన్ను.    పత్రికలో  ఆ  వారానికి  వచ్చే   బాగం   ఉండేదే  మూడో  నాలుగో  పేజీలు   అయ్యో   కథ ఏవైయ్యిందో  అన్న  ఆత్రుత  చదివే వాళ్ళది.  మద్యలో  సాగదీసే  ఆ  వర్ణనలు  అదే విసుగు.
ఇంకోటి  అనవసరపు  రొమాన్స్ .  అసలు  ఈయన  కథల్లో  తిండీ,  రొమాన్స్  అవసరమైన  దానికంటే  ఎక్కువే  ననిపిస్తుంది. 
సరెలే   ఇదంతా  పక్కన  పెట్టి.   మా పసలపూడి  కొద్దాం.
  మా  పసలపూడి  కథలు.  పుస్తకం  చూడగానే  హబ్బో  పెద్దది  అనిపిస్తుంది. (నేను  సీరియల్ గా  వస్తున్నప్పుడు  గనుక  చదివుండకపోయుంటే  అబ్బో  పెద్దగా ఉంది ఇప్పుడే  చదువుతాంలేబ్బా  అన్కునుండేదాన్నే)   పుస్తకం  పెద్దదైనా  అందులో  కథలు  చిన్న  చిన్నవే  గబ గబా  చదివిస్తాయి
  అసలిది  కథల పుస్తకం  మాత్రమేనా   బొమ్మల  పుస్తకంకూడా.   రంగురంగుల   బాపు  బొమ్మలు   పుస్తకానికే  అసలు  అందం.  బాపూ బొమ్మల  అబిమానులకు  ఇది  టూ ఇన్ వన్  అన్నమాట. 
అసలే  వంశీ  కళ్ళకు  కట్టినట్టు  ఆ  కథలోకి  తీసుకెళుతూ  బొమ్మగీసినట్టు  రాస్తారు.  దానికి తోడు  బాపూ గీసిన  బొమ్మలు.. యామ్  యామ్  అన్నమాట.
  గోదావరి జిల్లా నేపధ్యంలో పసలపూడిని కేంద్రంగా చేసుకుని సాగే   కథలు ఇవి. కథలనుకుంటే   కథలు  మొత్తం ఏకంగా ఒకే కథ అనుకుంటే  అదీనూ!  మొత్తం అరవైఏళ్ళ కథ.
 ఇప్పటి పెద్ద వయసు వాళ్ళు  ఆ కథల్లో  తమ  గతకాలం  చూసుకుంటే, ఈ తరం వాళ్ళకి  కథల్లోని సాంప్రదాయక గ్రామీణ జీవితాలు  ఆ కాలాన్ని  పరిచయం చేస్తున్న  చరిత్రలా  అనిపిస్తాయి.
కథల్లో  ఉన్నదేమిటి  అంటే  ..  మనిషితనం,  విలువలు. నిష్కలంకమైన  హృదయాలు. అమాయకత్వం, అనుబంధాలు, నమ్మకాలు, బలహీనతలు,  విషాదం ఇలా చెపుతూ పోతే  మనిషిజీవితంలో ఉన్నదంతా... ముఖ్యంగా  మానవ  సంబంధాలు.
ఆశ, వ్యగ్యం,  హాస్యం, వైరాగ్యం, విషాదం   ఒకో రుచి  చూపిస్తూ  ఒక్కో కథా  సాగుతుంది.
మామూలుగా సాదా సీదాగా కనిపించే జీవితంలోంచి  ఏదో ప్రత్యేకతని తెచ్చి మనముందుంచుతాయి  కొన్ని కథలు.  అసలు పట్టించుకోవలసిన అవసరమే లేదనుకునే  విషయాన్ని  తెచ్చి  కథగా మార్చి ఊరించి చెప్పి  ఇంతుందా  అనిపించేలా  విస్మయ పరుస్తాడు  కొన్ని సార్లు.   ఒకోసారి  హాయిగా సాగే కథని  విషాదాంతం  చేస్తాడు.  వర్ణించీ  ఊరించీ   చివరకలా  ఏడిపించి.. నిజంగా ఎదురుగా ఉంటే  కొట్టాలన్నంతగా ..  కర్కషంగా  ముగిస్తాడు. ఆ శాడిజం  దేముడి  దగ్గర  నేర్చుకున్నాడేమో.
  మనసున్న  మనుషుల్ని,  మహానుభావులనీ  మన కళ్ళముందు  నిలుపుతాడు  వాళ్ళకో  దడం పెట్టుకుంటాం  మనం  మనసులోనే. ఇక్కడ మనిషిలొని బలహీనతలనీ అంతే లైట్గా తీసుకుంటాం. ఇంతేగదా జీవితం అనే వైరాగ్యం పొందుతాం మరొకసారి!

సరె.............కథల గురించి మొదలెట్టానంటే  ఇంకోరోజు నేను సెలవు పుచ్చుకోవలసిందే....

ఇంతకీ అసలు ఇసయం ఏంటంటేనండి. నాకు నేను పుచ్చుకున్న సెలవు రోజుని  ఇంకేం చేయకుండా   ఈ వంశీ లాగేసుకున్నాడండీ బాబూ  :(

ఆయ్  అదండీ........
మరి శెలవండీ
  ఆయన స్టైల్లో చెప్పాలంటే ..  దిగడతానండి!
                     

Wednesday, November 10, 2010

ఐతే

"హబ్బ... ఎంతబావుందో ఇక్కడ! ఎంచక్కా వాకింగు  చేసుకోవచ్చు."   అసలిన్నాళ్ళూ ఈ వైపురానందుకు మనసులో ఓవైపు కుములుతూ,  ఇప్పుడు ఇంతమంచి చోటుని కనుగొన్న    ఆనందంలో  తన  చేతిని గిల్లేస్తూ  సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ...

"ఉస్, అబ్బా చెయ్యొదులు"

నా మాటలు విననట్టు నటెంచేస్తే  మనం  ఊర్కుంటామేమిటి.  చెయ్యి వదిలి మళ్ళీ  మళ్ళీ అదే డైలాగు రిపీటు చేసెయ్యమూ
"వాకింగు  వాకింగు రోజూ ఇక్కడికి వచ్చి చేసేద్దాం, ఏం?"

"సరే చేద్దూగానిలే"

"చేద్దూగాని ఏంటీ చేస్తున్నాం ఇద్దరం కలిసి కబుర్లాడుకుంటూ హాయిగా వాకింగ్ చేద్దాం."
"చూద్దాంలే"

//ఈ చూద్దాంలే ని ఎవరు కనిపెట్టారోగాని....ఆన్ని...... #౨$‌&@//

"నానీ  మీ డాడీ  చేద్దాంలే అంటున్నారు.  రేప్పటినుండి  సాయంత్రం అవగానే అందరం  ఇక్కడికి వచ్చేద్దాం . అలా చూడు  ఆ గ్రౌండులో  చిన్న పిల్లలు భలేగా ఆడుకుంటున్నారు   నువ్వూ  ఆడచ్చు.  తొందర తొందరగా పొడవైపోవాలని అంటావుగా . ఎంత ఆడితే అంత పొడవు."

"అమ్మా  మరి మజిల్స్ కూడా"

"ఊ ఊ బోల్డు బలం కూడా వచ్చేస్తుంది.  మేం ఇద్దరం వాకింగ్ చేస్తాం  నువ్వు  ఇంటికెడదాం అంటూ గోలచేయకుండా  చక్కగా  ఆడుకోవాలి సరేనా."
సాయంకాలపు నీరెండలో  మిల మిలా మెరుస్తున్న మట్టిలో  హాయిగా ఆడుతున్న పిల్లలు. ఆ  పేద్ద  మైదానం  చుట్టూ  నాలుగు వైపులా  విశాలమైన నల్లటి తారు రోడ్డు. రోడ్డుకి  రెండువైపులా  చెట్లు  పైన ఆకాశం  కనిపించకుండా  అల్లుకున్న  వాటి కొమ్మలు.    అలాంటి చోటుతో ప్రేమలో పడకుండా  ఎలా ఉండటం!

"అలా చూడండి  ఆ కపుల్ ఎంచక్కా కబుర్లాడుకుంటు  నడుస్తున్నారు....." (సాధింపు) మొదలెట్టాను. ఎలాగైనా సరె అనిపించేయాలి.
అదిగో  తాతయ్యల  గుంపు కులాసాగా  కాసేపు నడచి  ఆ  ఆడిటోరియం మెట్లపై  లోకాభిరామాయం చెప్పుకుంటున్నారు.   బుజ్జి బుజ్జి పిల్లలు  రోడ్డుకడ్డంగా  సైకిల్ తొక్కడం ప్రాక్టీసు చేస్తున్నారు.  అమ్మాయిలూ ఆంటీలూ  ఒక్కరోజు లోనే  జీరో సైజు సాధించేయాలన్నంత కసితో  నడుస్తున్నారు.  యువకులు హేప్పీగా గ్రౌండు పక్కన  మెట్లపై గుంపులుగా  చేరి కబుర్లు చెప్పేసుకుంటున్నారు.


ఇంటికి  వచ్చేదారిలో... 
నడక - నలభై లాభాలు అంటూ...

చెప్పేవన్నీ  తనకి ఈ చెవిలోంచి ఆచెవిలోకి అటునుండి బయటకు వెళుతూనే వున్నాయ్.

ఫ్చ్.. ఒక్కదాన్నే వెళ్ళనా!

ఒక్కదాన్నీ నోరు మూసుకుని నడవాలంటే ఎంతకష్టం!
ఇంట్లో అందరం కలిసి గడిపే  సాయంకాలం  వీళ్ళని మిస్సవుతూ  ఒక్కదాన్నీ...!

ఐడియా..!  (ఉపాయం తెలియనోన్ని ఊళ్ళోనుంచి వెళ్ళగొట్టాలి అంటుండేది మా అమ్మమ్మ:)
మాధవన్   దూరంగా రొడ్డుపక్కన  ....
అవును మాధవన్
హోర్డింగు  పై  ఫోజిచ్చి.

"అదిగో మాధవన్.  మీరు గనక  బరువు తగ్గి స్లిమ్ము ఐతే  అచ్చు  మాధవన్ లాగే  ఉంటారు."

"డాడీ  వెళుతుంటే  మాధవన్ మాధవన్ అంటారా అందరూ!"   మా వాడి అమాయకపు తెలివైన  ప్రశ్న.
ఆయన మొహం ముసి ముసి నవ్వులతో వెలిగింది.
హమ్మయ్య.
ఓ పనైపొయింది బాబూ

"అమ్మా మరి నాకక్కడ బోర్.  రెండు గెమ్స్   డౌన్లోడ్  చేస్కోనివ్వాలి.  అక్కడ కూర్చుని ఆడుకుంటా."

టైం చూసి మరీ  నెగ్గించుకుంటావుగా  సరె కానివ్వు.

**

"నిన్న అంత  మంది ఉన్నారు. ఈ రోజు ఎవరూ లేరే!" 

"ఆరు దాటిందిగా  ఇళ్ళకెళ్ళిపోయుంటారు"

చీ  మెకానికల్ మనుషులు. అసలు  సాయంసమయం  బావుండేదే ఇప్పుడు  ఆరింటి నుండి ఏడున్నర వరకు నడవచ్చు. చల్లగా  హాయిగా  ఎంతబావుంటుంది.
నడక మొదలైంది  ఇద్దరం హాయిగా కబుర్లాడుకుంటూ ఆకాశానికి పందిరేసినట్టున్న పచ్చటి ఆ కొమ్మల కింద  చల్లగాలికి......  ఓహో  చెపితే తెలుస్తుందా  ఆ ఆనందంఏంటో.


వాళ్ళ నడక ముగిస్తూ  ఒకరిద్దరు మా వైపు ఓ మాదిరిగా   చూస్తూ హడావిడిగా  పరుగులెత్తుతూ వాళ్ళ  వాహనాల వైపు వెళ్ళిపోయారు. చెట్ల కింద  రోడ్డు అంతా ఎందుకో ఒక్కసారిగా నిర్మానుష్యం గా మారింది. గ్రౌండులోని ఆడిటోరియం మెట్లమీద మాత్రం ఉన్నారు కొందరు.
అబ్బా ఏమిటి. అందరూ ఏదో టైం పెట్టుకున్నట్టు  వెళ్ళిపోయారు. ఏం జనాల టేస్టు నిన్న చూస్తే ఎండపూట ఉక్కపోతలో   తెగ నడుస్తున్నారు. చక్కగా  చల్లటి వేళ ఒక్కరూ లేరు.

ఎప్పటిలాగానే  నేను మాట్లాడుతున్నాను తను వింటున్నారు.
" గ్రౌండు చుట్టు  ఒక రౌండ్ వేస్తే  ఒక కిలోమీటర్  కదా. మనం ఈ రోజుకి  రెండు రౌండ్స్ నడుద్దాం."

వర్షం పడుతున్నట్టుందే!

టప్ టప్ మంటూ ఏవో పడుతున్నాయ్.
అవి ఏంటో బుర్రకి అర్ధం అయ్యేలోగానే..
నెత్తి మీదా, బట్టలమీదా  తెల్ల తెల్లగా....
ఓహ్ ..
ఇంకేం మాటల్లేవు

పరిగెత్తుకుంటూ  పార్కింగు కేసి తను. పిల్లాడి కోసం ఆ పక్కనే ఉన్న మెట్లవైపు నేను.


ముందు రోజే గమనించాను  రోడ్డునిండా  దట్టంగా   తెల్లగా ఉన్న ముగ్గుల్ని. ఏమోలే  చెట్లన్నాక పక్షులు ఉండవా   పక్షులన్నాకా  రెట్టలు వేయావా  అనుకున్నా గానీ :(


"అమ్మా అప్పుడే వెళ్ళిపోతున్నామా.  రేపు త్వరగా వద్దాం".

"సరెలే  నీ పిచ్చి గేమ్స్ ఇక్కడా మొదలెట్టేసావ్. కళ్ళు చూడు. అందుకే ఆ కళ్ళజోడు వచ్చింది. ముందు నువ్వా పిచ్చి  పీసీ గేములు మాను."




ఐతే....
ఐతే ఏంటీ ఐతే..
అంతే  ఈ ఎపిసోడు.