Pages

Monday, January 19, 2009

అనగనగా ఒకరోజు

అన్నిరోజులు ఒక్కలా ఉండవు. డైరీ ని అడిగితే చెపుతుంది!

ఓ రోజంతా ఏం చేశామో ఆలోచనలెలా సాగాయో గమనిస్తే, కూర్చుని వాటిని అలాగే రాస్తే మనకే తెలియకుండా ఎన్నో సంగతులు కనిపిస్తాయి! ప్రయత్నించి చూడండి ..... ప్రధమ ప్రచురణ తెలుగురత్న





*****************అనగనగా ఒకరోజు**************************


“భూఊఊఊ…హ హ హ…. సింధూ… బై బాయ్….”

నా పక్కనుండి స్పీడ్ గా స్కేట్ చేస్తూ నన్ను దాటి వెళ్ళింది మధు.

తెల్లటి మంచు శిఖరాలు సూర్యోదయపు వెలుగుల్లో పసిడి కొండల్లా మిలమిల లాడుతున్నాయి. మంచుముద్దలు ఒకరిపై ఒకరు విసురుకుంటూ కేరింతలుకొడుతూ ఆడుతున్నారు స్టూడెంట్స్.

గగుల్సు సవరించుకుంటూ ఆ వచ్చేది కామాక్షీ మేడం లాగుందే! అబ్బ చింపాంజీ లా ఉండే మేడం ఇంత అద్భుతంగా ఎలా మారిపోయింది! ఈ కొండల్లోని మహిమా! ఎప్పట్లాగే అందరికీ ఆర్డలేసుకుంటూ వెళుతోంది, హు ఎలా మారినా ఈవిడ క్లాసులు పీకడం మాత్రం మానదు!

చూస్తుండగానే వాతావరణం మారిపోతూ ఉంది , ఒహ్ ఎక్కడి నుండి వచ్చాయి ఇన్ని మేఘాలు! ఊ… దీనిపై హాయిగా పడుకుని దర్జాగా తిరుగుతా, ఈ మొద్దు మొహాలు నడుస్తూ ఆ లోయలోకి దిగేలోపే నేనూ ఈ మబ్బు మీదకెక్కి అంతా తిరిగి చూసి వాళ్ళకంటే ముందే అక్కడికి చేరుకోవచ్చు.

ఆహా మెత్తగా ఎంత హాయిగా ఉందీ మేఘం!! ఇదే స్వర్గం, స్వర్గం లో ఇలాగే ఉంటుంది ఎన్ని సినిమాల్లో చూడలేదూ!

“సింధూ…సింధూ…”

అదిగో అమ్మ పిలుస్తోది, ఓ అమ్మ కూడా స్వర్గానికొచ్చేసిందా!

“అమ్మా నువ్వూ ఓ మేఘం పై పడుకో.., నడవకు అనవసరంగా కాళ్ళనెప్పి.”

“లే లే కాలేజ్ లేదా?”

అందరూ ఇక్కడే ఉన్నారు ఇంకా కాలేజేంటీ ? అయ్యో నా మబ్బులు లాగేసుకుంటుంది,

“ అమ్మా నీకావాలంటే ఇక్కడ ఇన్ని మేఘాలున్నాయి నాదెందుకు లాక్కుంటున్నావ్.” నా మేఘం కోసం తడుముకుంటూ కళ్ళు తెరిచాను .

చేతిలో దుప్పటితో బెడ్ పక్కనే నిలుచుని ఉంది అమ్మ. “లే టైం చూడు… మళ్ళీ లేటవుతుందని కంగారు పెడతావు.” చెపుతూ వెళ్ళింది.

అబ్బా ఎంతమంచి కల ఇంకాసేపుంటే ఆ మేఘం ఎక్కి ఎక్కడికెళ్ళుండేదాన్నో! అతిలోకసుందరి లో శ్రీదేవిలా అలా మంచుకొండల్లో విహరిస్తూ పాటపాడుకుంటూ…

ఇల్లెగిరిపోయేలా మిల్క్ కుక్కర్ విజిల్...

అబ్బా చీ....! అక్కడికి ఎలాగూ పంపరు, కనీసం కలలోనైనా పూర్తిగా చూడనివ్వరు. పక్కనే వెలవెల బోతున్న నా మబ్బుతునని ఒక్క తన్ను తన్ని హాల్లోకి వచ్చాను.

“సింధూ కింద కాయగూరల బండి వచ్చినట్టుంది బుట్టతీసుకొనెళ్ళు. వంకాయలున్నాయేమో చూడు, ఓ నాలుగు మునక్కాడలు, అలాగే కరివేపాకు కూడా తీసుకురా.” అమ్మ వంటింట్లోంచే లిస్ట్ చదువుతోంది.

బ్రష్షు నోట్లో పెట్టుకుని టీవీ ముందు కూర్చున్న సంజు గాన్ని చూడగానే ఒళ్ళు మండింది. వీడికేమీ చెప్పదు. నన్ను లేపిందే ఇందుకు, బంగారం లాంటి కల ఎప్పుడంటే అప్పుడు కావాలంటే కనగలమా అలాంటి కలలు!

“అరేయ్ సంజూ పో బాత్రూం లోకి, అసహ్యంగా హాలంతా తిరుగుతూ బ్రష్ చేయకు.” నా కోపమంతా వాడిపై చూపిస్తూ వాడు తిరిగి సమాధానం ఇవ్వకముందే బుట్ట అందుకుని కారిడార్ లోకి వచ్చేసాను.

పక్క ఫ్లాటు లోని ఎయిర్ టెల్ అంకుల్ పోన్‌ పట్టుకుని అపార్ట్మెంట్స్ అదిరిపోయేలా సౌండ్స్ చేస్తున్నాడు.

అబ్బ ఈయనొకడు ఇంట్లోఉన్నంత సేపూ పోన్‌ లో మాట్లాడుతూనే ఉంటాడు ఆఫీస్ కెళ్ళి ఏం చేస్తాడో!

ఎవడో దుర్మార్గుడు కిందఫ్లోర్ లో లిఫ్ట్ డోర్ సరిగ్గా వేయకుండా పోయినట్టున్నాడు, అది కుయ్యో మొర్రో మంటున్నా ఎవరికీ పట్టనట్టే ఉన్నారు. మెట్లుదిగి రెండో ఫ్లోర్ కి వెళ్ళేసరికే ఎవరో లిఫ్ట్ లో దూరి కింద కెళుతున్నారు.

చీ స్వర్గం లోంచి నరకం లో పడ్డట్టుంది. ఆ మంచుకొండల్లో ఎంతబావుంది!

గేటు పక్కనే కాయగూరల బండిచుట్టూ మూగి బేరాలాడుతున్నారు. ఈ ఆంటీలు ఏంటో! బోడి కూరలకీ బేరాలే! రోజూ ఇదే పని బోరు కొట్టదా వీళ్ళకి!

“సింధూ గుడ్మార్నింగ్.” ఇకిలిస్తూ బయటనుండి వస్తున్నాడు సందీప్.

నిజంగా రోజూ జాగింగ్ కే వెళతాడా? ఇక్కడిక్కడే అమ్మాయిలకు బీటేస్తూ ఉంటాడా? నాకు డౌటే…, అది తీరాలటే ఇంకా పొద్దున్నే లేవాలి అదికుదిరేదికాదులే.

బండివాడిచ్చిన బుట్టతీసుకుంటూ పైకి చూసాను రోజట్లాగే ఫస్ట్ ఫ్లోర్ తాతగారు బాల్కనీ లో నిలుచుని కనిపించని సూర్యునికి ప్రదక్షిణాలు చేస్తూ ఆదిత్యహృదయం చదువుతున్నారు.


ఇంట్లోకొచ్చేసరికి హాలు టీవీ సౌండ్స్ తో కంపించి పోతోంది. కిందకూర్చుని తాపీగా పాలు తాగుతున్నాడు సంజూ.

“ఒరేయ్ ఎన్నిసార్లు చెప్పినా నీకు ఏదీ ఎక్కదు, టేబుల్ దగ్గరికెళ్ళి కూర్చోపో, డాడీ టూర్ నుండి రానీ నీ సంగతుంది. ఆ సౌండ్ తగ్గించు, అంతలావు కళ్ళజోడు వచ్చినా బుద్దిరాలే నీకు లేచింది మొదలు ఆ టీవీ ముందే.”

“ఆ రానీలే నేనూ చెప్తా డాడీతో! డాడీ లేనప్పుడు అర్ధరాత్రి దాకా నువ్వేగా టీవీ ముందు కూర్చునేదానివి!”

దొంగరాస్కెల్ గాడు ఈ మధ్య వీడికి గ్రామర్ ఎక్కువైపోతుంది, మాటకి మాటా నేర్చాడు. అమ్మననాలి అసలు వీడ్ని నెత్తి కెక్కించుకుంటుంది.


“సింధూ ఏమైంది? ఎంతసేపు?”

“ఆ వస్తున్నా.” అబ్బ, వీడు గంటలు గంటలు ఏ పని చేసినా ఏవనదు, ననైతే పరిగెత్తిస్తారు!

“వెళ్ళు, లేటయ్యిందని వెళ్ళేముందు గెంతులేస్తావు. మొహం కడిగి, స్నానం చేసి రెడీ అవ్వు. ఆ తల తడపకు…” వెనిక్కి తిరిగి చూడకుండా చెప్పుకు పోతోంది అమ్మ.


ఆ క్లోజప్ యాడ్ లో మోడల్స్ పళ్ళు మెరిసిపోతుంటాయ్! ఎంత పేస్ట్ ఏసి తోమినా ఇక్కడ మాత్రం ఆ మెరుపు రాదు! ఈ సారి వేరే బ్రాండ్ కొనాలి.

హు జుట్టు తడపద్దూ… రోజూ చెప్పే మాటలే మళ్ళీ మళ్ళీ. అమ్మ కసలు బోర్ కొట్టదా…!

సౌందర్య తారల సబ్బుఅని చెప్పి అమ్ముకుంటున్నారు గానీ… హు నిజంగా ఆ తారలు దీన్ని వాడ్తారా!

నా జుట్టు పై నాకే అధికారం లేదు! పొట్టిగా బాబ్డ్ చేయించుకుంటే ఎంత బావుంటాను. ఈవిడ అర్ధం చేసుకోదు, అమ్మమ్మలా ఇంతబారు జడ వేసుకుని తిరగాలి. ఈ సారి తిరుపతి మొక్కు అనిచెప్పి ఎలాగైనా కత్తిరించేసేయాలి.

అమ్మో బుగ్గమీద పింపుల్ లాగుందే, నిన్న లేదు తెల్లారేసరికల్లా ఇలా వచ్చేసిందేమిటి! పెద్దదవదు కదా… దేవుడా నువ్వుంటే ఈ పింపుల్ పెద్దదవకుండా మాడిపోయేట్టు చూడు.


“సింధూ అయ్యిందా?”

“వస్తున్నా అమ్మా.”
అవక ఇక్కడేవన్నా మేకప్పులు వేసుకునేంత సీనుందా!

“టెబుల్ పై టిఫిన్‌ ఉంచాను తింటూ వాడికేవో సమ్స్ రాలేదంట చూడు.” వంటింట్లోంచే ఆర్డలేస్తోంది అమ్మ.

ఆ సరిగ్గా దొరికాడు. చెప్తానుండు వీడి సంగతి. “ఏరా నిన్నంతా ఏం చేసావ్? హోం వర్క్ పెట్టుకుని. తెల్లాగానే టీవీ ముందు సెటిలయ్యిపోయావు బుద్దిలేదు!

సరె, సరె త్వరగా కానీ నాకు టైమ్‌ లేదు ఈ రోజు త్వరగా వెళ్ళాలి.” అబ్బ! ఫేసు ఎంత బుద్దిమంతునిలా పెడతాడు, ఏవనకుండా!

“ఇఫ్ ఎ నంబర్ ఈస్ ఇంక్రీస్డ్ బై సెవెన్‌ టైమ్స్ అండ్ ఈస్ ఆడెడ్ బై ట్వంటీ, దెన్‌ ది రిజెల్ట్ ఈస్ తర్టీ ఫోర్. ఫైండ్ ది నంబర్. ఇదేనా..?

సెవెన్‌ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఈస్ ఈక్వల్ ట థర్టీ ఫోర్. సెవెనెక్స్ ఈస్ ఈక్వల్ టు థర్టీ ఫోర్ మైనస్ ట్వంటీ.
ఎక్స్ ఈస్ ఈక్వల్ టు ఫోర్టీన్‌ బై సెవెన్‌.. ఈస్ ఈక్వల్ టు… టూ. నువ్వు దాన్ని ఎక్స్ ప్లస్ సెవెన్‌ ప్లస్ టెన్‌ వేసుకుని చేసావు అందుకే రాలేదు నీకు. అర్ధమైందా?”

“ఆ అయ్యిందిలే నేనూ అంతే అనుకున్నా.” నోటుబుక్కు లాక్కుని తుర్రుమన్నాడు. వీడి కసలు కృతజ్ఞతే లేదు! వేలెడు లేడు ఒంటినిండా పొగరే!

“అమ్మా నేనెళ్ళాలి. త్వరగా వస్తానని ప్రి యతో చెప్పాను. ఈ రోజు ఎగ్జామ్‌ కోసం ముందుగా వెళ్ళి కాస్త డిస్కస్ చేసుకోవాలి.”

“ఇదిగో వంటయిపోయింది బాక్సులు సర్దుదువు గానీ రా.” అమ్మ ఆర్డర్ విసిరింది.

హూ! ప్రియ, నాన్సీల్లా లంచ్ లో పిజ్జాలు కొరుక్కుతినే యోగం నాకెక్కడిదీ! వాదించీ లాభం లేదు, అమ్మ వినదు, ఆరోగ్య సూత్రాలు చెప్పటం మొదలెడుతుంది! వంకాయన్నం, సాంబారన్నం అంటూ మిగల్చకుండా తినాల్సిందే! దేవుడా.


“అమ్మా వెళ్ళొస్తున్నా.. బై.”

ఈ పుస్తకాల బరువు రోజూ మోసుకెళ్ళాలి! హాయిగా లాప్ టాప్ పట్టుకుని కాలేజ్ కెళ్ళడం ఎంతబావుంటుంది!

కాస్త త్వరగా వెళ్తే బావుండు, ప్రియ వచ్చేసిందో ఏమో! ప్చ్.. లాస్ట్ సెమిస్టర్ లో రెండు మార్కుల తేడాతో క్లాసులో సెకండ్ ఐపోయాను, ఈ సారి మళ్ళీ నా పొజీషన్‌ తిరిగి తెచ్చుకోవాలి.


“బై సింధూ..” సందీప్ ఇకిలిస్తూ చెయ్యూపుతున్నాడు.

బైకు పై తన ప్రెండ్ వెనకాల కూర్చుని కాలేజ్ కెళుతున్నాడు. ఎప్పుడూ రోడ్లెమ్మట తిరుగుతూ అమ్మాయిలకి బీటేస్తూ ఉంటాడు. ఐనా నైంటీ పర్సెంట్ మార్కులకి ఎప్పుడూతగ్గడు. ఎలా, ఎప్పుడు చదువుతాడో!స్కూల్లో కూడా ఎప్పుడూ గేమ్స్ లో ప్రైజులన్నీ కొట్టేసేవోడు, చదువూ బానే చదివేవాడు!

రోడ్డు పక్కనే ఉన్న సాయిబాబ గుడి పక్కనే బైకు ఆపి గుళ్ళో కెళ్ళారు వాళ్ళిద్దరూ.

అయ్యో ఈ రోజు గురువారం కదూ, నేనూ వెళ్తే బావుండు. ప్చ్.. బస్సు మిస్సవుతుందేమో. వీళ్ళకేం హాయిగా రివ్వున బైక్ పై వెళతారు, అదీ కాక వాళ్ళ కాలేజ్ ఇక్కడికి చాలా దగ్గర.

హమ్మయ్య ఎర్ర లిప్స్టిక్ ఆంటీ, లెదర్ బ్యాగ్ పొడవు అంకుల్ ఉన్నారంటే బస్సు ఇంకా రాలేదన్న మాటే! ఏంటో త్వరగా వచ్చి నిలుచున్న రోజే బస్సు లేటుగా వచ్చి చస్తుంది!

అదిగో వస్తోంది. బస్సుల్ని ఎంత తిట్టుకున్నా ఈ బస్సు తో మాత్రం ఏదో అటచ్ మెంట్. దూరంగా కనిపించగానే ఏదో ప్రాణమున్న దానిలా నన్ను చూసి గుర్తుపట్టినట్టే ఓ ఫీలింగ్!

ఆ ఆంటీ ఎప్పుడూ కూర్చోదు ఎందుకనో! నాలుగు స్టాపులు నిలుచునే ఉంటుంది. బరువు తగ్గే ప్రోగామేమో!

మధ్య మధ్య డ్రైవర్ తో జోకులేసుకుంటూ నవ్వు మొహం తో డ్యూటీ చేస్తున్నాడు కండక్టర్. ఇతనికి నిజంగా బెస్ట్ కండక్టర్ అవార్డ్ ఇవ్వాలి. హాప్పీగా జోకులేసుకుంటూ డ్యూటీ చేస్తాడు. అడిగిన వాళ్ళకి అవసరమైన చోట ఆపుతాడు. ఈయన పుణ్యమాని స్టూడెంట్స్ కాలేజీ ముందే దిగగల్గుతున్నారు. ఉద్యోగం పాతబడ్డాక అందరిలాగే కస్సు బుస్సు లాడుతూ డ్యూటీ చేస్తాడా...! లేదులే ఇతను మంచివాడు.

బస్సు ఫ్లైయ్యోవర్ దాటి స్లో అవుతోంటే రోజూలాగే పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కేసింది నీతు. "హాయ్" చెప్పింది. నా సీటు పక్కనే నిలుచుని బ్యాగ్ నా మీద పడేస్తూ.


పొడవు జుట్టు అబ్బాయి స్టాపు వచ్చింది . ఈ రోజు ఎందుకో అతను రాలేదు! నీతు బస్సులో వెనక డోర్ వైపు చూస్తోంది.

బస్సు కదిలింది, నీతు నా వైపు చూసి కళ్ళెగరేసింది. వెనిక్కి చూసి ఏమో అన్నట్టు రియాక్షనిచ్చాను ఆమెవైపు తిరిగి.

మరో స్టాప్ దాటింది బస్సు. తరువాతి స్టాపులో దిగటానికి పక్క నున్న అమ్మాయి లేచి వెళ్ళి నిలుచుంది. వచ్చి ఆ సీట్లో కూర్చుని మళ్ళీ వెనిక్కి తిరిగి చూసుకుంటోంది నీతు.


”పోనీలే గోల వదిలింది” చెప్పాను తనతో.

”అంటే.., ఊరికే చూస్తాడంతే! చూడనీలే పాపం, వెంటబడి మరీ వేధించే టైపు కాదు, మంచాడి లాగే ఉండేవాడు!” డిజప్పాయింటెడ్ గా అంటోంది నీతు.

రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై సామాగ్రి పెట్టుకుని బూటు పాలీష్ చేస్తున్నాడు చిన్న పిల్లవాడు. సంజూ కన్నా చిన్న వాడే! పొద్దున్నే లేచి చిట్టి చిట్టి చేతులతో పని మొదలెట్టాడు! వంటిపై చిరుగుల చొక్కా, లాగు.

క్యాంటీన్ లో పిల్లాడు గుర్తొచ్చాడు నీళ్ళు మోస్తూ, పాత్రలు కడుగుతూ, సర్వర్ గానూ పని చేస్తూ ఉంటాడు. అంత చిన్న వాడు! వీళ్ళ అమ్మానాన్నలకి వీళ్ళ బుజ్జి పొట్టకి ఇంత తిండి పెట్టడమే బరువా!

సంజూ పాలు తాగిన గ్లాసు కూడా ఎత్తడు. ఇప్పటికీ అన్నం అమ్మ కలిపి ఇవ్వాల్సిందే! వాడంటే అందదరికీ ఎంతో ముద్దు. ఊరికే సరదాగా అరచుకోవటం అలవాటైంది గానీ తననకీ సంజూ అంటే అపురూపమే. ఇంట్లొ అలా గారాబంగా చేస్తాడుగా నీ వాడు జీనియస్. పాపం ఈ పిల్లలు తెలివైన వాళ్ళే ఐయ్యుంటారు కానీ వీళ్ళ శక్తి టైమూ అంతా ఆ పనులు చేసుకోaటానికే. అలాంటి చోట పుట్టడమే వీళ్ళు చేసుకున్న పాపమా!

అసలు పసిపిల్లలకి తిండి పెట్టగగలిగితేనే పిల్లల్ని కనాలనే రూల్ పెట్టాలి. పసి పిల్లలతొ పని చేయించే తలల్లిండ్రులని జైల్లో వేయాలి.

క్యాంటిన్ ఓనరైతే అంత చిన్న పిల్లాడిని కొడతాడు కూడా, చిన్నవాడు భయ పెట్టినా కొట్టినా తిట్టినా తిరిగి ఏమీ అనలేడనేగా, అదే పెద్ద వయసున్న పనివాళ్లనైతే అలా కొట్టి పని చేయించ గలడా. వీళ్ళందరినీ చూస్తుంటే మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో, వీళ్ళ కోసం ఒక బంగారు లోకాన్ని తయారు చేయాలని ఉంది.

చక్కగా ఆడుతూ పాడుతూ చదువూ పని నేర్చుకుంటూ విలువలూ వివేకం గల జీవితాన్ని వీళ్ళు పొందాలి. నా చదువు పూర్తయ్యాక ఈ సంగతి ఇంట్లో చెప్పాలి. దేవుడా నా జీవితానికి ఆ భాగ్యం కలిగించు, అస్సలు అమ్మ నాన్న ఒప్పుకుంటారా! అమ్మను ఒప్పించ గలను.

పిల్లల విషయం లో అమ్మ మనసు ఎంత సున్నిత మైందో తనకు తెలియదా, సంజు ని తనని కంటికి రెప్పలా కాపాడే అమ్మ తప్పక అర్ధం చేసుకుంటుంది.


“సింధూ కమాన్” నీతూ బుజం పై చరుస్తూ పిలుస్తోంది.

అమ్మో కాలేజ్ వచ్చేసింది.బస్సు దిగి రోడ్డు క్రాస్ చేస్తుంటే ప్రియ డాడీ వెళుతున్న జీప్ ఎదురైయ్యింది.

హమ్మ నేనేం లేటుకాలేదు…

మార్కులన్నీ ఇంటర్నల్స్ లోనే సంపాదించాలి. రోడ్డు దాటి కాలేజ్ ఉన్న సందు మలుపు తిరిగి చెయ్యూపుతున్న ప్రియ వైపు వడి వడి గా అడుగులేసాను ... నైట్ చదివిన సబ్జెక్ట్ అంతా మైండ్ లో ప్రేములు ప్రేములుగా అమర్చుకుంటూ...


౮౮౮౮౮౮౮౮౮****** ౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮