జిడ్డు మొహం, మడ్డిమెదడుది దీని బుర్రలో అసలు మెదడుందా! ఎంత తిట్టినా మిడిగుడ్లేసుకుని అట్లా చూస్తూంటది, దీని కసలు ఫీలింగ్స్ ఉండవా!
“ఓయ్ కాఫీ ఇక్కడపెట్టిపోతే..! నాకేవన్నా మంత్రవిధ్యలు వచ్చనుకున్నావా? చెప్పడానికి నీ నాలిక అరిగిపోతుందనా! చూడు నా కాలు తగిలి పడిపోయింది, వచ్చి తుడిచి తగలడు.”
ఆ చూపుకర్ధం ఏమిటో! టీ పాయ్ మీద కాళ్ళెందుకు పెట్టావనేమో! అసలు టీపాయ్ ఉన్నదే కాళ్ళు పెట్టుకోటానికి, దీనికేంతెలుసు గనక ఇది తెలియడానికి!
చీ! తడిబట్టేసి అచ్చం పనిమనిషి లాగే తుడిచేస్తుంది. కాస్త నాజూకుగా తుడవచ్చుగా! మోటు మనిషి.. నా ఖర్మ కొద్దీ దొరికింది.
సినిమాల్లో ఎంత అందంగా చేస్తారు! పనులన్నీ చేసినా జుత్తు చదరకుండా, చీర నలగకుండా, తలనిండా పూలతో నవనవలాడుతూ...!
ఇది పనులు చేస్తుంటే చూసే వాళ్ళు పనిమనిషే అనుకుంటారు తప్పించి ఇంటి ఇల్లాలంటే నమ్ముతారా!
ఆ మోహన్ గాడి పెళ్ళాం ఎప్పుడు చూసినా ఇస్త్రీ చీర నలగ కుండా కనిపిస్తుంది, వాడి అదృష్టం ఏం చేస్తాం!
ఆ మధూ..! వాడి పెళ్ళామైతే నెల తిరిగేసరికల్లా పదివేలు సంపాదించి వాడి చేతిలో పోస్తుంది. ఇదో దరిద్రగొట్టుది, దీనిపై ఖర్చే గాని దమ్మిడీ రాబడి లేదు.
హు… ఇప్పుడెన్ననుకుని ఏం లాభం! ఎక్కువ చదివిన వాళ్ళు మాట వినరనే గదా, చిన్న పిల్లైతే బుద్దిగా, ఒద్దికగా కాపరం చేసుకుంటుందని వెతికి, వెతికి దీన్ని చేసుకుంది. పెళ్ళి నాటికి డెబ్బై శాతం మార్కులతో ఇంటర్ పూర్తిచేసింది, మీకు ఇష్టమైతే చదివించండీ అన్నారు, చదివిస్తే ఉద్యోగం చేసేదే! కాని తనదేమో మరీ బీకాం తర్డు క్లాసు చదువు, చూస్తూ చూస్తూ దీన్ని బియ్యెస్సీ ఎలా చదివించగలం! ఐనా పెళ్ళాం సంపాదన తినే అదృష్టం అందరికీ ఉండొద్దూ!
దీని ముక్కేంటీ ఈ పక్కనుండి చూస్తుంటే నడ్డి ముక్కులాగుంది! పెళ్ళి చూపులనాడు అంత గమనించనేలేదు!
ఆ బల్బు వెలుతుర్లో కూర్చోబెట్టి చూపించారు, పచ్చటి పసిమి చాయ లాంటి రంగు అని మోసపోయా! ఆ.. ఏం రంగులే ఇదంతా మధ్యలోనే తిండివల్ల వచ్చిన రంగే, లేకపోతే ఇద్దరు పిల్లలూ అంత నల్లగా ఎందుకు పుడతారు! నేను నలుపే ఒప్పుకుంటా, నా పిల్లలైనా తెల్లగా ఉండాలనే గా దీనిరంగుచూసి చేసుకుంది.
ఇద్దర్ని కని గేదె లా తయారైయ్యింది! నాకు బయట సవాలక్షపనులు.. బలం కోసం నేను తినడం ఎలాగూ తప్పదు, పొట్ట ఇలా పెరగాల్సిందే, ఏం చేయలేం. ఐనా మగ వాడికి పొట్ట ఉంటేనే ఇంట్లో లక్ష్మి తాండవిస్తుందంటారు. ఆడది దీనికేం రోగం! కాస్త తిండి తగ్గించి సన్నబడచ్చుగా.
ప్చ్.. మొన్నటికి మొన్న.. రమణ మామ కొడుకు పెళ్ళికి దీన్నేసుకు వెళితే ఎంత అవమానంగా అనిపించిందనీ! ఆ శేఖర్ గాడిదీ తమది ఓ రెండ్రోజుల తేడాతో ఒకేసారి కదూ పెళ్ళైంది. వాడు, వాడి పెళ్ళాం కొత్తగా పెళ్ళైన జంటలా వచ్చారు అక్కడికి. వాడి పెళ్ళాం ఆ కారులోంచి దిగడమే ఎంత స్టైల్ గా దిగిందని! జుట్టు విరబోసుకుని ఎంత అందంగా తయారై వచ్చింది!
ఇదీ ఉంది కోతిలా నా వెనుక స్కూటర్ పై కూర్చుని గాలికి చిందరవందరైన జుట్టుతో, జడేసుకుని పల్లెటూరి గబ్బిలం లాగ!
ఆ పెళ్ళి లో మెరుపు తీగల్లా తిరుగుతూవున్న వాళ్ళని చూస్తూంటే ఈ బండది ఎంత రోత గా అనిపించిందో. ఖర్మ కాలి దీన్ని చేసుకున్నా.
చూస్తుంటే ఇది రోజు రోజు కీ పొట్టిగా ఐపోతున్నట్లు నాకు డౌట్! పెళ్ళి చూపులనాడు బానే కనిపించింది ఆ హైమని చేసుకోవాల్సిందా! ప్చ్ నేనే తిప్పి తిప్పి కొడితే ఐదున్నరకి రెండంగులాలు తక్కువే ఉన్నా, హైమ నాకంటే పొడవనే కదా ఆ సంబంధం వదులుకుంది. మామయ్య కూతుర్నైనా చేసుకోసుకునుండాల్సింది. అది నల్లగా ఉందని వద్దన్నా...., మొన్నటి పెళ్ళి కి తన భర్త తో కలిసి వచ్చింది, ఎంతబావుందని!
ఐనా దీని బాబు ఇచ్చే కట్నం మామయ్య ఇస్తానన్న దానికన్నా ఓ యాభై వేలు ఎక్కువని, అనవసరంగా తొందరపడి దీన్ని చేసేసుకున్నా! ఆ డబ్బ కాస్తా చెల్లి పెళ్ళికి చేసిన బాకీలకీ, వేరే పాత అప్పులు తీర్చడానికీ అప్పుడే ఖర్చైపోయింది.
పెద్దక్క మొదట చెప్పిన సంబంధం బాగుండే, బాగా డబ్బున్న వాళ్ళు, పైగా చిన్న పిల్ల.. ! ఆ… ఏం చిన్నపిల్లలే చిన్న పిల్ల మాటలా అది మాట్లాడింది!! జుట్టంతా గీకేసిన మరిగుజ్జు గొరిల్లా లాగా ఉన్నాడు నేను చేసుకోను అంది అందరిముందూ!! తనకేం తక్కువ? కాస్త మూతి ఎత్తుగా ఉన్నందుకే గొరిల్లా లా కనిపించానా దానికి!! తననొద్దనన్నందుకు దానికి తగిన శాస్తి జరిగింది, అందరికీ ఒంకలు పెడుతూ పెళ్ళీ పెటాకులు లేక ఇంకేం చేయాలో తోచక చదివీ, చదివీ ఇప్పుడేదో ఉద్యోగం చేస్తుందట. పెద్ద హోదా అని చెప్పుకు మురుస్తున్నారు గాని అదే నన్ను చేసుకునుంటే ఇప్పటికి ఇద్దరు పిల్లల్ని కని గౌరవంగా ఇంటిపట్టున హాయిగా ఉండేది. బైటకెళ్ళి అడ్డమైన చాకిరీ చేసే బాధ తప్పేది.
ఇప్పుడు చూడు ఆ అదృష్టం దీనికి పట్టింది.
అబ్బ ఎంత పొగరు! దీనికి? గుడ్డ తెచ్చి మొహాన కొట్టి పోయింది. జలుబు చేస్తే చీమిడి రాదేమిటీ? ఏదో లేవలేక ఇక్కడే చీది పడేసా, తరువాత ఎలాగూ తుడుస్తుంది కదా అని! దీనికే ఇదొక్కతే ప్రపంచంలో పరిశుభ్ర్తత పాటించే దానిలా!
నేను పెట్టే తిండి ఎక్కువై కొవ్వెక్కింది దీనికి.
ఆడపడుచు కట్నం దగ్గర పేచీ పడి ఒదులుకున్నాడు గాని ఆ సిక్రింద్రాబాద్ వాళ్ళ అమ్మాయి ఉమ ఐతే సిటీ పిల్ల అన్నివిధాలా బాగుండేది. ఈ పల్లెటూరి ముచ్చుమొహం దానికి ఓకల్చరూ లేదు పాడు లేదు. ఏదో ఆస్థివుంది ఒక్కతే పిల్ల అని ఆశపడి ఈ శని గ్రహాన్ని తెచ్చుకున్నా. పోనీ ఏమైనా పెట్టుపోతలు పెడుతున్నారా అంటే అదీ లేదు చెప్పుకుంటే సిగ్గు చేటు. ఆ పెళ్ళి నాడు ఇచ్చిందే!
ఏదడిగినా ఆ పొలం మాతరువాత మీకే కదండీ అంటారు దొంగ పీనుగులు వీళ్ళు ఎప్పుడు చావాలీ? ఏడాది కి ముష్టి మూడు జతల బట్టలు పెట్టి ఏదో పీతాంబాలు ఇచ్చినట్టు పోజులు! మహా ఐతే సంవత్సరానికి ఓ రెండు బస్తాల బియ్యం, ఇంటికి కావలసిన సరుకులూ అవీ పంపిస్తున్నారు, దానికే తెగ నీలిగి పోతున్నారు. అసలు ముందుముందు నాకు రావల్సిన పొలం లోని పండే పంటే కదా అదంతా, నా పంట నాకు పంపటం కూడా గొప్పేనా!
ఇంకేం మిగిలింది దీనికి! పెళ్ళిచూపులకి ముందు అక్క దీన్ని చూసొచ్చి అమ్మాయిది తాచుపాము లాంటి జడరా అని తెగ చెప్పింది. ఏం తాచుపాము! ఇప్పుడది వానపామైపోయింది. తనంటే ఆఫీసుకెళతాడు, ఎండలో బైట తిరుగుతాడు కనక తనకు బట్టతలైంది. అదీగాక మగవాడికి బట్టతల సిరిని తెస్తుంది అంటారు. ఆడదాని అందం దాని జట్టులోనే కదా ఉండేది. ఆ మాత్రం మెయింటేయిన్ చేసి చావద్దూ వెదవ పీనుగ!
హా.. హైనా ఇప్పుడెన్ని అనుకుని ఏం లాభం! నా తలరాత ఇలా ఏడిచింది.
ఏదో నాది విశాల హృదయం కనక ఇంకా దీన్ని ఏలుకుంటున్నా! ఈ జన్మ కి దీంతో అడ్జెస్ట్ అవ్వాల్సిందే తప్పదు.
**************