“పరిమళ గుర్తుందారా నీకు?” తీరిగ్గా కుర్చీలో కూర్చుంటూ అంది అమ్మ.
“పరిమాళా ఆంటీనా?” టక్కున అడిగాను ఆసక్తితో.
నా వైపు అదోలా చూసింది “బాగానే గుర్తుంచు కున్నావే్! నీ ఫేవరేట్ ఆంటీ కదూ!”
ఆ పేరుతో నాకు తెలిసిన వాళ్ళు ఒకే ఒక్కరు. పరిమళా ఆంటీ పేరు తలచుకోగానే గుర్తొచ్చేది ప్రసన్నంగా ఉండే ఆమె నవ్వు మొహం. ఎప్పుడు కరుణ కురిపించే ఆ చల్లని చూపులు. ఆమె దగ్గర ఏదో డివైన్ నెస్! దేవుడు ప్రత్యక్షమై ఏంకావాలని అడిగితే ‘పరిమళా ఆంటీ లాంటి అమ్మ కావాలి జన్మజన్మలకు’ అని అడగాలనిపించేంత అమ్మతనం ఆంటిలో.
కుటుంబానికి అర్ధం అనేది ఆంటీ వాళ్ళను చూసే నేర్చుకున్నాను. ఆదరణ, ఆప్యాయతా ఎదుటి మనిషికి ఎంత శక్తిని ఇస్తుందో స్వయంగా అనుభవించాను.
చేతిలోని టీవీ రిమోట్ పక్కన పడేస్తూ అమ్మ వైపు తిరిగాను ఆసక్తిగా.
“మొన్న షాపింగ్ వెళ్ళినప్పుడు కనిపించింది, ఇప్పుడు ఇక్కడే వుంటున్నారట. ఆమె భర్త పోయాడుట!”
“అంకుల్ పోయారా ఎప్పుడు? ఎలా?” ప్రశ్నించాను నమ్మలేనట్టుగా.
“ఎనమిదేళ్ళైందని చెప్పింది, యాక్సిడెంట్ లోనట ”
“శరత్, మల్లిక, సిద్దు ఏం చేస్తున్నారు? ఆంటీ ఎలా వుంది?” తికమకగా అడిగాను.
“ఏమోరా నేను పిల్లల గురించి అడగలేదు, రోడ్డుమీద పట్టుకుని ఏం మాట్లాడతాం! నాకు ఆటో వెయిటింగులో ఉంది. తనే గుర్తుపట్టి పలకరించింది, మనిషిలో చాలా మార్పు వచ్చింది, అశోక్ నగర్ రెండో వీధి లో అదేదో బ్యాంకు పేరు చెప్పింది దాని పక్కనే ఉంటున్నారట, ఎప్పుడన్నా తప్పక రండి అంది.”
నాకు ఇష్టమైన వాళ్ళ గురించి ఇన్నేళ్ళ తరువాత, ఇలాంటి వార్త ! మనసంతా అదోలా ఐపోయింది, ఇంకేం అడిగినా అమ్మ దగ్గర సమాధానాలు ఉండవని తెలుసు. లేచి బయటకు నడచాను.
“ఆ రోజుల్లో తెగ తైతక్కలాడేది, మొగుడు పోయాక తెలిసుంటుంది జీవితపు విలువ.” వెనక నుండి అమ్మ మాటలు మనసుని చివుక్కు మనిపించాయి. ఎందుకు ఆమె మీద అంత కసి ! అప్రయత్నంగా వెనిక్కి తిరిగాను.
“హూ అవును, మీ కఠినత్వంతో ద్వేషం తో చెల్లిని పోగొట్టుకున్నాం, మనకి మాత్రం తెలుసా జీవితపు విలువ?” ఏనాడు పలకని విధంగా పరుషంగా పలికింది నా గొంతు.
నేనా మాటలు ఆంటానని అమ్మ ఏనాడూ ఊహించి ఉండదు. ఈగో దెబ్బతిన్నట్టుగా చూసింది నావైపు.
బైక్ కీస్ తీసుకుని బయటకు వచ్చాను. పరిమళా ఆంటీ ప్రస్తావన తో నా జ్ఞాపకాలు ఉవ్వెత్తున ఎగసి, ఉక్కిరి బిక్కిరిగా ఉంది కాసేపు నడిస్తేబావుంటుందనిపించి కీస్ జేబులో పడేసుకుని గేటు తీసి నడవడం మొదలెట్టాను.
అమ్మా నాన్నల ఉద్యోగాల రిత్యా ఒకే వూరిలొ దాదాపు పదేళ్ళు వున్నాం. మాలాగే ఉద్యోగరీత్యా ఆవూరిలో ఉండేవాళ్ళు పరిమళా అంటీ వాళ్ళు. ఆమె భర్త ఎమార్వో గా పనిచేసేవాడు.
ఎక్కువ కాలమే అక్కడ ఉన్నాకూడా అ వూళ్ళో. మాకు పెద్దగా స్నేహితులూ దగ్గరివారూ అంటూ ఎవరూ లేరు. అమ్మ కి పల్లెటూరి జనం అంటే ఒకరకమైన చులకనగా ఉండేది. వాళ్ళతో స్నేహం చేస్తే మేం ఎక్కడ క్రమశిక్షణ తప్పుతామోనని నన్నూ చెల్లినీ కూడా ఎవరితోనూ కలవనిచ్చేది కాదు. ఇరుగుపొరుగుతోనూ దగ్గర పరిచలేవీ లేవు. అమ్మ తన పనులన్నీ తన స్టూడెంట్స్ తో చేయించుకొనేది. నాన్నకి ఆఫీసులో పరిచయాలు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు గాని ఇంటిదగ్గర సీరియస్ గా స్ట్రిక్టుగా ఉండేవాడు. ఇది మనవూరు కాదు అన్న ఎరుక చాలా ఎక్కువగా ఉండెది వాళ్ళిద్దరిలోనూ.
తొమ్మిదో తరగతి వరకు మాత్రమే నేను అక్కడ చదువుకున్నా అ తర్వాత ట్రాన్స్ ఫర్ పై సిటీక్ దగ్గర్లోకి వచ్చాం. సిటీలోనే ఇక్కడే సెటిల్ ఐపోయాం . ఆ తరువాత అ వూరు వెళ్ళింది లేదు.
మనస్సు గత జ్ఞాపకాలతో పరుగులు పెడుతోంది కాళ్ళు మెయిన్ రోడ్డు వైపుగా దారితీశాయి. రోడ్డు క్రాస్ చేసి అవతలవైపు వీధిలోని పార్క్ లోకి అడుగులేశాను.
ఆదివారపు మధ్యాహ్నం . వీధిలోని పిల్లలంతా పార్కులో చేరారు. పార్కుచుట్టూ ఉన్న పెద్ద చెట్ల నీడల్లో కొందరు, గ్రౌండ్ లా ఉన్న చోట కొందరు. ఆ పెద్ద పార్కు అంతా సందడిగా ఉంది. వాళ్ళని చూస్తూనే నా బాల్యం కళ్ళముందు తిరిగింది. ఈ పిల్లల్లా నా బాల్యమూ ఆటపాటలతో కేరింతలు కొట్టిందంటే అది పరిమళా ఆంటీ వాళ్ళ మూలంగానే ! ప్రతి ఒక్కరికీ జీవితమంతా తీపిగుర్తులు బాల్యపు ఆటపాటలూ సరదాలూ మాత్రమే, ఆంటీ వాళ్ళతో సాంగత్యం లేక పోతే నా బాల్య జ్ఞా పకాలలో ఇప్పుడు నాకు నా పుస్తకాలు మార్కులు మాత్రమే మిగిలి ఉండేవేమో!
అమ్మ ఓసారి వేరేవూరికి ఎలక్షన్ డ్యూటీ కెళుతూ తప్పనిసరై నన్నూ, చెల్లిని ఆంటీ దగ్గర వదిలింది. ఎవరితో కలవని మాకు పరిమళా ఆంటీ వాళ్ళతో అలా పరిచయం ఏర్పడింది. మా ఇంట్లో అన్నీ మిలటరీ రూల్స్ ఉండేవి! ఆంటీ వాళ్ళింట్లో ఉన్నంతసేపు నేను, చెల్లి విడుదలైన ఖైదీల్లా ఫీలయ్యేవాళ్లం!
కథల పుస్తకాలతో నిండి ఉండే వాళ్ళ ముందు గదిలోని అలమార మాకొక అద్భుతం. నిశ్శబ్దపు మా ఇంటికి, సందడితో సంతోషంతో నిండి వున్న వాళ్ళ ఇంటికి ఉన్న తెడా మమ్మల్ని అటుకేసి లాగేస్తుండేది.
ఆంటీ అంటే వూళ్ళొ అందరికీ గౌరవం, ఇష్టం. ఎప్పుడూ పూజలనో ఇంకోటనో అందరినీ పిలిచి భోజనాలు పెడుతుండేది. ఆమె దానధర్మాలు చూసి అమ్మ ‘ఈవిడదంతా అదోరకం మంచిదాన్ననిపించుకునేందుకే ఈ వేషాలు, తక్కువ కులస్తులతో ఎవరూ కూడరనీ, పనివాళ్ళు దొరకరనీ అందుకే ఆకులస్థులు అలా అందరినీ ఆకట్టుకుంటారనీ’ అంటుండేది!
ఆంటీ చేసే ప్రతి పనీ ఇతరులతో విలక్షణంగా ఉండేది. ‘అబ్బో సినిమాలు చూసి అందులోలా చేస్తుంది ఈవిడ’ అనేది అమ్మ.
ఆంటీ తో ఎప్పుడూ ఓ ఇద్దరు పనివాళ్ళు ఉండేవాళ్ళు . డ్రైవర్, అటెండర్ కూడా ఇష్టంగా సాయానికి పరిగెత్తుకొచ్చేవారు. ఇంటిముందు పూల తోట, వెనక కూరగాయల మడులు పెంచేది. ప్రతిసాయంత్రం పూలు మాల కట్టించి పిల్లలందరికీ తలలో పెట్టేది. పెరట్లో పెద్ద గోరింటాకు పొద ఉండేది. ఆకు రుబ్బించి అందరికీ పంపించేది. ఆమెతో గోరింటాకు పెట్టించుకోవటానికి పిల్లలందరం క్యూ కట్టే వాళ్ళం.
అమ్మ కోపం లెక్కచేయకుండా ఎలాగో కన్నుగప్పి మేం మెల్లిగా ఆటకి అక్కడి జారుకునే వాళ్ళం. ఆంటికి చెల్లి ని చాలా ముద్దు చేసేది. ఆంటీ వాళ్ళింట్లో అందరు నలుపే. పచ్చటి పసిమి ఛాయ చెల్లిది. చెల్లిని బంగారు తల్లి అని పిలుస్తుండేది. తన ముగ్గురి పిల్లలే కాకుండా చుట్తుపక్కల పిల్లలందరినీ చేరదీసేది, ఎప్పుడూ పిల్లలకోడిలా ఉండేది. సంతోషం, నవ్వులు, నిశ్చింత ఆమెచుట్టూ! వూళ్ళొ స్నేహితులూ ఎక్కువే ఆమెకి. మంగళహారతి పాటలు తను నేర్చుకుని పిల్లలకు నేర్పిస్తూ ఉండేది. పద్యాలు, కథలు, ఆటలు, పాటలు పిల్లల్లో తానూ ఓ చిన్నపిల్లలా కలిసిపోయేది.
వూళ్ళొ ఎప్పుడూ కరెంటు సరిగా ఉండేది కాదు, వేసవి రాత్రులు మరీ ఉండేదికాది. కరెంటు పోయిందంటే నేను చెల్లి ఆంటీ వాళ్ళింట్లో చేరేవాళ్ళం, వెన్నెల రోజుల్లో వీధిలో ఆటలు, మిగతా రోజుల్లో వరండాలో కథలూ, అంత్యాక్షరి లాంటి ఆటలు ఆడించేది. ఆంటీ దగ్గర ఎప్పుడూ చిరు తిండి రెడీగా ఉండేది. పిల్లలందరికీ తినడానికి ఏవేవో పెడుతుండేది.
అమ్మ ఆమెని తక్కువ కులస్థులని లోకువగానే చూసేది. .. ఆమె పెట్టే ఖర్చులు, ఆమె జీవిత విధానం పట్ల అమ్మకెప్పుడూ నిరసనే ఉండేది. పేరంటమనో ఇంకేదనో ఆంటీ పిలిచినా అమ్మ ఎప్పుడూ వెళ్ళేదికాదు.
చుట్టు ప్రక్కల వాళ్ళు ఎవరికే సహాయం కావాలన్నా ఆమె దగ్గరకు వచ్చేవాళ్ళు. పాతబట్టలకూ స్టీలు సామాను కొనేరకం వ్యక్తులకు ఆమె చేసే దానాలని చూస్తే ఎప్పుడూ ఆశ్చర్యంగానే ఉండేది.
ఆంటీ కి ముగ్గురు పిల్లలు పెద్దవాడు శరత్ నా కంటే ఓ క్లాసు పెద్ద. తరువాత అమ్మాయి మల్లిక చెల్లి క్లాసు. తరువాతి వాడు సిద్దార్థ. మేం వూరినుండి ఇక్కడికి వచ్చేసేనాటికి వాడు రెండో మూడో చదువుతుండేవాడు. వాడికసలు భయం అంటే ఏమిటో తెలిసేది కాదు. బొద్దుగా ముద్దుగా ఉండేవాడు. శరత్ కాస్త పెద్దరికంగా వ్యవహరించినా ఆటల్లో మునిగితే అందరికంటే చిన్నపిల్లాడిలా మారేవాడు. మల్లిక కాస్త సిగ్గరిగా ఉన్నా అందరితో స్నేహంగా ఉండేది వాళ్ళ అమ్మ లాగే. పాటలు చక్కగా పాడేది.
"అన్నా బాల్"
ఎవరిదో పిలుపు విని ఆలోచనలనుండి బయటపడుతూ అటుకేసి చూశాను. సైగ చేస్తూ పిలుస్తున్నాడు ఓ అబ్బాయి. నా దగ్గరగా పడ్డ బాల్ చేతిలోకి తీసుకుంటూ అతడికేసి చూసాను ఓ పద్నాలుగేళ్ళ కుర్రాడు. వెంటనే శరత్ గుర్తొచ్చాడు. చివరిగా నేను చూసినప్పుడు ఇలాగే ఉండేవాడు శరత్ ఇప్పుడేం చేస్తున్నాడో!
ప్చ్ అమ్మ ఆ వార్త చెప్పకుంటే బావుండు ఆంటీ గురించిన జ్ఞాపకాలు అలాగే భద్రంగా ఉండేవేమో! ఆంటీ గురించిన విషాదవార్త నాకు స్థిమితం లేకుండా చేస్తొంది.
ప్రతి పండగా ఆర్భాటంగా జరిపించేది, ఏదైనా పదిమందితో పంచుకుంటేనే ఆనందం అనేది. జడనిండా పూలు, పట్టుచీర ధరించి లక్ష్మీ దేవిలా ఉండేది, ఆమె అంటే పిల్లలందరికీ అదోరకమైన క్రేజ్!
ఓ సారి మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో చెల్లినీ నన్నూ పెద్దయ్యాక ఏమౌతావు అని అడిగిన ప్రశ్నకి చెల్లి చెప్పిన సమాధానం గుర్తొస్తే ఇప్పటికీ నవ్వాగదు. ‘నేను పెద్దయ్యాక పరిమళా ఆంటీ నవుతా’ అంది అది. ఆ రోజు అమ్మ భద్రకాళికే అయ్యింది.
ఎంత మెత్తగా మాట్లాడేదో, పిల్లలని బుజ్జగించి లాలించడం ఆమెలా ఇంకెవరూ చేయలేని పని. మాటలో, చూపులో, చేతలో అంత ప్రేమ తొణికిసలాడుతూ ఉండడం ఎలా సాధ్యమో నా కిప్పటికీ అదో అద్భుతమే! ఆమె ఓ అద్భుత జ్ఞాపకంగా అలాగే ఉంటే బావుండు. ఇప్పుడు ఇక ఆంటీ కథ విషాదాంతమై గుర్తొస్తూ ఉంటుంది.
ఉహూ ఇక లాభం లేదు, నా ఆలోచనలు అంతు పొంతు లేకుండా సాగుతూనే ఉంటాయి. ఆంటీ ఇప్పుడెలాగుందో చూస్తేగాని మనసు స్థిమిత పడదు. అమ్మ అన్నట్టు ఆంటీ తన స్వభావం మూలంగా పిల్లల భవిష్యత్తు చెడగొట్టిందా! ఏం జరిగి ఉంటుంది!
వెంటనే వెళ్ళి చూడాలని నిర్ణయించుకుంటూ ఇంటివైపు వడి వడిగా అడుగులేశాను.
ఎందుకో లోపలికి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు వాళ్ళింటికి వెళుతున్నానంటే అమ్మ ఏమంటుందోనాకు తెలుసు. బైక్ స్టార్ట్ చేసి బయట పడ్డాను.
అంకుల్ ఆమెనెంత అపురూపంగా చూసుకునే వాడు! ఆయన లేని ఆమెని ఊహించలేకపోతున్నా. అంగ రంగ వైభోగంగా ఉండేది వాళ్ళజీవితం. ఇప్పుడెలా ఉన్నారొ! ఆనాటి వాళ్ళ ఖర్చులూ వాటిని బట్టీ చూస్తే వాళ్ళేం వెనకేయలేదనే అనిపిస్తుంది. భర్త నీడలో చీకూచింతా తెలియకుండా ఉన్న ఆవిడ ఆయన పోయాక ముగ్గురు పిల్లలతో ఎలాంటి జీవితం గడిపిందో! వాళ్ళ చదువులు, పోషన ముందులా మాత్రం ఉండకపోయే అవకాశమే ఎక్కువ. అసలు ప్రేమించటం తప్ప ఆమెకేం తెలుసు! ఏం చేయగలదు! కాలు కందకుండా చూసుకున్నాడు భర్త.
దేవుడు తనకిచ్చిన దాన్ని పదిమందికీ పంచడమే తెలుసు ఆమెకి ఒకరిని చేయి చాచి అడగడం ఆమె చేయగలదా!
‘పిల్లలకు అంత స్వేచ్చా! అంతేసి ఖర్చులూ పెడుతోంది వాళ్ళ భవిష్యత్తు చేతులారా చెడగొడుతుంది. ఆ ఆటా, పాటా రేపొద్దున అన్నం పెడతాయా’ అనేది అమ్మ అస్తమానం. అదే నిజమైయ్యిందా!
శరత్ నిజంగా దురదృష్ట వంతుడు. మంచి జీనియస్ వాడు పెద్ద చదువులు చదువుతాడని అనుకునేవాళ్ళు అంతా. ఇప్పుడేం చేస్తున్నాడో! అన్నీ సవ్యంగా ఉన్నవాళ్ళే ఈరోజుల్లో ఎగ్జిస్ట్ కావడం కష్టంగా ఉంది. ఇక ఏ సపోర్టూ లేకుండా అతడేం చేయగలడు!
ముగ్గురు పిల్లలు తండ్రి మరణం వాళ్ళ జీవితాలని ఎంత తలకిందులు చేసిందో! వాళ్ళ స్థితి ఊహించుకుంటే మనసంతా చేదుగా మారింది.
మనసులో జోరీగల్లా ఆలోచనలు ముసురుతూనే ఉన్నాయి, అశోక్ నగర్ చేరుకుని పెద్ద కష్టం లేకుండా ఆ ఇల్లు చేరుకున్నాను. గేటు దగ్గరే వున్న ఓ కుర్రాడితో “పరిమళా ఆంటీ వుండేది ఇక్కడేనా?” ప్రశ్నిస్తూ అడిగాను. మౌనంగా ఫస్ట్ ఫ్లోర్ వైపు వేలు చూపించాడు ఆ అబ్బాయి. పక్కగా ఉన్న మెట్లు ఎక్కుతూ ఉంటే ఒక్క క్షణం అనిపించింది అసలు నేను గుర్తున్నానా ఆంటీకి. ఇక్కడికి రాకుండా వుండాలిసిందా అని. నా క్యూరియాసిటీ ఆ భావాన్ని అదిమేసింది.
గ్రిల్ రూము తలుపు తెరిచే ఉంది. కాలింగ్ బెల్ నొక్కి అక్కడే నిలబడి పోయాను. కొన్ని క్షణాల తరువాత బయటకు వచ్చింది ఆంటీ నేను వెంటనే గుర్తు పట్టేశాను.
“ఎవరండి?” అడిగింది.
“ఆంటీ నేను. లలితా టిచర్ గారి అబ్బాయిని, కార్తిక్ ని. అమ్మను మీరు కలిసారటగా..., మొన్న షాపింగ్ కాంప్లెక్స్ లో.....”
“ఆ.., ఆ..., రా... రా ... లోపలకి రా. కార్తిక్ కదూ! బావున్నావా? పెద్దవాడివైపోయావు, వెంటనే గుర్తుపట్టలేకపోయాను గాని, ఎక్కడో చూసినట్టు అనిపించింది.” చెయ్యి పట్టుకుని లోపలి నడిపించింది.
“అమ్మ రాలేదా? ఇంకా గుర్తుంచుకున్నావ్ చాలా సంతోషం. అమ్మా, నాన్నా చెల్లి అందరు బావున్నారుగా. నువ్వేం చేస్తున్నావు? అమ్మ మొన్న కనిపించింది గాని హడావిడిలో ఏమి మాట్లాడుకోలేదు..” నన్ను చూసిన సంతోషం తో ననుకుంటా అన్ని ఒకేసారిగా అడిగేసింది.
ఆమె అడిగిన వాటికి సమాధానాలు చెబుతూ మెల్లిగా కబుర్లలో మునిగి పోయాను. ఆంటిలో అప్పటికి ఇప్పటికి మార్పేమీ లేదు అదే ఆప్యాయతా. సున్నితంగా, ప్రేమగా నవ్వుతు మాట్లాడుతోంది. శరీరం వడలినట్టువుందే గాని హృదయంలోని ప్రేమ కంఠ స్వరంలోని మృదుత్వం అప్పటిలాగే ఉంది.
నాగురించి ఉద్యోగం గురించి చెపితే సంతోషంతో తలూపింది. చెల్లి డిప్రెషన్ తో సూసైడ్ చేసుకుందని చెప్పినప్పుడు కళ్ళనిళ్ళు పెట్టుకుంటూ అప్పట్లో చెల్లి ఎంత చలాకీగా చక్కగా ఉండేదో గుర్తుతెచ్చుకుంది. “మా ఇంట్లో ఫోటోలోని లక్ష్మి దేవి పాపలాగా మారి వచ్చినట్టు ఉండేదిరా దాన్ని చూస్తే. దానికి గోరింటాకు ఎంత ఎర్రగా పండేదిరా! మల్లెపూల జడంటే దానికి ఇష్టం కదూ దానిది బారుజుట్టు ‘ఆంటీ పుల జడ వేయవా’ అంటూ వచ్చేది! ప్రతి శనివారం పూలన్నీ దానికోసమే దాచి తెల్లవారి జడవేసేదాన్ని.” ఎన్నో విషయాలు మాట్లాడసాగింది. చిన్న చిన్న విషయాలు కుడా ఆమెకి బాగా గుర్తున్నాయ్.
అంకుల్ గురించి అడిగినప్పుడు ఆమె కళ్ళల్లో తడి నా దృష్టిని దాటలేదు. ఆయన పోయాక తనకు ఇచ్చిన అటెండర్ ఉద్యోగం చేస్తున్నానని చెపుతున్నప్పుడు నా మొహంలో కనిపించిన విస్మయం గమనించి చల్లగా నవ్వింది.
“మీరు అటెండర్ గా….!” నమ్మలేనట్టుగా చూశాను. తండ్రి ఉద్యోగం పిల్లలకు ఇస్తారుగా.” శరత్ ఉద్యోగం చేయొచ్చుగా అనే అర్ధంతో అన్నాను.
“మీ అంకుల్ పోయినప్పుడు శరత్ ఇంటర్ చదువుతున్నాడు వాడికి ఉద్యోగం ఇస్తామన్నారు. నాకే ఇష్టం లేకపోయింది. వాడి వయసెంతని? వాడింకా పసికూన. మొదటినుండి వాడికి కొన్ని ఆశలు, ఆశయాలు ఉన్నాయి. చదువు మానిపించి ఆ పసివాడిపై ఈ కుటుంబ భారం మోఫై వాడి భవిష్యత్తు పాడు చేయటం సరికాదనిపించింది. అది గాక అంకుల్ వాడిని ఐ ఐ టి చదివించాలని ఎప్పుడు అంటుండేవాడు. ఆయన కోరిక, వాడి కల అవి రెండు నెరవేర్చటం నా బాధ్యత. పిల్లలు ముగ్గురూ తండ్రి ఉన్న రోజుల్లోని సౌకర్యాలు పొందకపోయినా వాళ్ళ సంతోషం అలాగే ఉండాలనేది నా కోరిక."
మహారాణిలా బ్రతికిన ఆమె, ఆఫీసర్ భార్య గా ఒక హోదా అనుభవించిన ఆమె తను అటెండర్ పని చేస్తున్నానని ఎంత మాములుగా చెపుతోంది! ప్రపంచం అంటే ఏమిటో ఎరుగకుండా భర్త రక్షణలో అపురూపంగా ఉన్న ఆ సుకుమారి పిల్లల భవిష్యత్తుని తన చేతుల్లోకి ఎంత ధైర్యంగా తీసుకుంది!
“నా శ్రేభిలాషులు నాకు అండగా ఉన్నారు, పిల్లలు నాకు తోడుగా ఉన్నారు ఆ భగవంతుడి దయ వల్ల మల్లిక శరత్ కోరుకున్న చదువులు చెప్పించగాలిగాను .. .. శరత్ పూణే లో ఉద్యోగం చేస్తున్నాడు. మల్లిక ఇక్కడే ఉంది. ఇక సిద్దు చదువు పూర్తయ్యి ఉద్యోగంలో చేరితే అందరు సెటిల్ ఐనట్టే.” చెప్పుకు పోతోంది.
ఆమె అడిగే వాటికి సమాధానమిస్తూ వాళ్ళ గురించి తెలుసుకుంటూ సమయం తెలియలేదు. ‘ప్రేమ ఏదైనా చేయిస్తుంది. ప్రేమకున్న శక్తి మరొక్కసారి ఇక్కడ నిరూపించ బడింది. ప్రేమ దేన్నైనా సాధిస్తుంది.
“ఇక వెళతా ఆంటీ చాలా ఆలస్యమయ్యింది.” లేచాను .
“మల్లిక, సిద్ధు వస్తారు ఉండు.” అంటోంది ఆంటీ. “ఇంకోసారి వస్తానాంటి…” బయల్దేరాను తృప్తిగా.
దారిలో వెళ్ళేటప్పుడు నేను ఉహించుకున్నవి గుర్తొచ్చి నవ్వుకున్నాను. ‘అవును ఆంటికి ప్రేమించం తప్ప ఇంకేమి చేతకాదు...... అదే ఆమె బలం.’ ప్రేమంటే ఎదుటివారిని అర్ధం చేసుకోవడం. ప్రేమంటే ఎదుటివారి సంతోషం చూడాలనుకోవడం. ప్రేమ జయిస్తుంది ఎవరినైనా…, ఎలాంటి పరిస్థితులనైనా.
ఇంట్లో అడుగు పెట్టగానే నాకోసం ఎదురుచూస్తూ ఉన్న అమ్మ కనిపించింది. “ఏరా చెప్పకుండా వెళ్ళావని అమ్మ కంగారు పడుతోంది.” అన్నాడు నాన్న నావైపు చూస్తూ. “అమ్మా ఆలస్యంగా భొంచేస్తావు నీకు గ్యాస్త్రిక్ సమస్య వుండీ? రా కలిసి తిందాం.” ఆప్యాయంగా పిలుస్తున్న నావైపు అర్ధం కానట్టు చూస్తూ కదిలింది అమ్మ.
*** ** *** **