ఓ రోజు మా వారు ఫోన్ చేసి 'చిన్నూ రెడీగా ఉండు బయటకెడుతున్నాం, నేనో అరగంటలో వచ్చేస్తాను' అన్నారు ఆ అరగంట చుట్టుపక్కల తన ఫ్రెండ్స్ ఇండ్లల్లో (ఆటకి వెళ్ళిన) మా వాడిని వెతికి ఇంటికి తీసుకువచ్చే సరికే అయ్యింది. ఈయన వచ్చీరావడంతోనే "పదా పదా వెళదాం ఇలాగే రండీ." అంటూ.. "సరే సరే ఎక్కడికీ ఎక్కడికీ ముందది చెప్పండి." అంటూ నేను. (ఎక్కడికో తెలిస్తే అక్కడికి తగ్గట్టు ముస్తాబై వెళ్ళాలి కదా :p )
"నీకు తోటలు చెట్లూ చేమలు పొలాలు చేన్లూ అంటే పిచ్చి కదా. ( ) అదే అదే పిచ్చిప్రేమ కదా.. ఓ తోట వుంది నీకు నచ్చిందంటే అది మనదే."
"భలే! కానీ ఇప్పుడా మనం వెళ్ళేసరికే చీకటి పడిపోతుందేమో అక్కడేం చూస్తాం."
"ఎంతా అరగంటలో అక్కడుంటాం" ఆయన నోట్లోంచి వస్తున్న మాటలు పూర్తవకుండానే ఓ వాటర్ బాటిల్ బ్యాగులో పడేసుకుని చెప్పులేసుకుని సిద్దం అయిపోయ్యాం ఉన్నఫలంగా.
{ఇక్కడో పి.వే. ;- మేం ఇప్పటి వరకు ఏది చేసినా, ఏది చూసినా, ఎక్కడికి వెళ్ళినా చీకటి పడిపోయే వుంటది :( మా హీరోగారు హడావిడిగా ఆలస్యంగా పదా పదా అంటూ వస్తారు. హూ అర్ధరాత్రి స్వాతంత్ర్యం పొందినవాళ్ళం కదా, అదే పరంపరలో మా పనులు}
"మనకి దగ్గర. ఎప్పుడుకావాలన్నా వెళ్ళొచ్చు... అంటూ మొదలెడుతూ ఆ పొలమూ తోటా విశేషాలు, సంగతులూ చెప్తూ ఊరిస్తున్నారు. వింటూ కలల్లోకి వెళ్ళిపోయాను నలుపూ తెలుపులో సావిత్రి ఎంటీయార్ లా పొలం పనుల్లో నేనూ మావారు. వెనకే ఓ బుల్లి రైతు గెటప్పులో మా చిన్నోడు . మనసు తెరపై వరసగా దృశ్యాలు మారుతున్నాయి . పొలం గట్లపై క్రిష్ణా శ్రీదేవి లా (డ్యూయెట్) కబుర్లు చెప్పుకుంటూ. నాగేశ్వర్రావ్ వాణిశ్రీలా...
అలా నా గోలలో నేనున్నా నా సుపుత్రిడి ప్రశ్నలూ ఈయన సమాధానాలు ఓపక్క విపిస్తునే వున్నాయి.
"డాడీ నాకు తోటలో బోరు కొట్టకుండా ఎదన్నా పెంచుకోనా"
"ఓయస్స్ నాన్నా, ఓయస్స్."
"చిక్స్ పెంచుకుంటా, ఎంచక్కా వాటితో ఆడుకోవచ్చు."
"ఓకే, ఓకే"
"మేక పిల్లను పెంచుకుంటా డాడీ, కార్టూన్ లో ఆమెవెంటే మేకపిల్ల వెళుతూ వుంటది గెంతుతూ భలే బావుంటది. నేను పెంచింది నా వెనకే అలాగే వస్తుంది."
"రైట్, పెంచేద్దాం."
కుందేళ్ళూ, బాతులు, నెమళ్ళు, పక్షులు అంటున్నాడు. కాసేపు వాటికేం పేర్లు పెడతాడో చెప్పాడు. అన్నింటికీ వాళ్ళ నాన్న రైటో రైటో.
"డాడీ గుర్రం పెంచుకుందాం. నేను పొలంలో తిరగడానికి కావాలి కదా."
వాళ్ళ నాన్న తల ఆడించడం ఏమాత్రం తగ్గించకుండా అలాగే అలాగే అన్న ఫోజులోనే వున్నారు వరాలిచ్చే దేవుడిలా.
హమ్మో నేనింక నా ఊహల్లోంచి బయటపడి విషయాన్ని నా చేతుల్లోకి తీసుకోకపోతే నా సుపుత్రుడు ఏనుగు, ఒంటే కూడా పెంచుతానంటాడు :(
(వాడికి ఏదైనా నో చెప్పినా ఊరుకుంటాడుగానీ సరే అన్నతరువాత దాన్ని వద్దంటే :(
నా మనసులోని అందమైన సినిమాకి తెరవేసి వాడిని మెల్లిగా వేరే కబుర్లలోకి మళ్ళించడం మొదలెట్టాను. మా వారు చిద్విలాసంగా డ్రైవింగ్ మునిగి పోయారు. కారు సిటీ దాటింది.
*********** కట్ .. చేస్తే .. *************
సావిత్రీ, ఎంటీయార్, పొలం పాటలు దృశ్యాలైతే లేవుగానీ...
జీవితంలో వున్న ఆనందాలకు మరొక్కటి జతకూడింది :)
ఇంకా.... రోజూ ఇంటికి వచ్చే తోటలోని కాయగూరలు, పండ్లూ,పూలు, పాలు. అప్పుడప్పుడు ఆకుపచ్చని వారాంతాలు. ఇంకా ఇంకా...
తోటలోని కొన్ని చిత్రాలు