Pages

Wednesday, August 20, 2008

నీ ఆశ నీదే

నేను రాసిన కథ , " నీ ఆశ నీదే"
ప్రాణహిత ఆగస్ట్ ఎడిషన్ లో మీ అమూల్య అభిప్రాయాలు కోరుతూ:)
http://www.pranahita.org/2008/08/ni_asha_neede/

Thursday, August 7, 2008

నవ్వుతున్న ఏడుపు

ఈ రోజు కూడా లేటైయ్యింది, చిన్నూ ఏడుస్తాడేమో! ఇయర్ ఎండిగ్ మూలంగా పనెక్కువగా ఉంది. ఏదో అలసట, చిరాకు మొరాయించే మనసు, శరీరాల్ని లాక్కెడుతూ ఇంకెంత కాలమో!
“వావ్ యువార్ లుక్కింగ్ వెరీ స్మార్ట్ టుడే!” గుట్కా నములుతూ వెకిలిగా నవ్వుతున్నాడు మేనేజర్.
ఎప్పుడూ అతికించుకునే ప్లాస్టీక్ నవ్వు తో అతని వైపు చూసి బయటకి నడిచాను.

బండి కూడా నాలాగే తయారయ్యింది! బ్యాటరీ వీక్ అయినట్టుంది, సర్వీసింగ్ కి ఇవ్వటానికి టైమేది! దిగి స్టాండ్ వేసి కిక్ రాడ్ పై నా విసుగంతా కుమ్మరించేశాను. నేను మాత్రం నువ్వంటే పడతానేమిటీ? అన్నట్లు అది రివర్స్ లో కాలిని విసురుగా తాకింది, మరింత విసురుగా నా కాలు దాన్ని నెట్టింది, అబ్బా ఏదో అయ్యింది, ఒహ్ కాలి గోరు లేచి వేలాడుతూ ఎర్రగా రక్తం! బండి నన్ను చూసి నవ్వినట్టనిపించింది. రియర్ మిర్రర్ లో నా మొహం కూడా నవ్వుతున్నట్టుగానే ఉంది!
వెర్రినవ్వు అలవాటై పోయింది! నాన్న కొట్టినా, అమ్మ తిట్టినా, అన్న తన్నినా మనం ఏడిస్తే ఓదార్చే వాళ్ళుండరని అర్ధమైన పసివయసులోనే ఏడుపు ఇంకి పోయింది.
ఆడ పిల్ల కి సహనం, దయ, కరుణ తప్పించి మరొక ఎమోషన్‌ ఉండకూడదని ఇంట్లో శిక్షణ మొదలైనప్పుడే పెదాలపై వెర్రి నవ్వు అతుక్కుంది.
కష్టాలు, బాధలు, అవమానాలు అన్నింటికీ ప్రతి స్పందన ఆడదానికి నవ్వే నని మెదడు చిన్నప్పుడే నేర్చేసుకుంది.

పళ్ళు బిగపట్టి మళ్ళీ కిక్.. ఉఫ్ స్టార్ట్ అయ్యింది.

రోడ్డు పై లైట్లు వెలుగుతున్నాయి. చల్ల గాలి దయగా పలకరిస్తోంది. కాలికింద జిగటగా రక్తమేమో! హాస్పెటల్ ముందు నుండి వెళుతున్నా, వెళ్ళి గోరు తీయించి డ్రెస్సింగ్ చేయించుకుంటే..! అమ్మో ఒద్దు ఇంకా లేటౌతుంది, హాస్పిటల్ వైపు చూసాను బైట జనాలు పడిగాపులుకాస్తున్నారు. ఎలాగో ఇల్లు చేరితే మెల్లిగా గోరు పీకి పడేస్తే సరిపోతుంది, ఇక్కడ టైమ్‌ వేస్టు.
ఏడుపొస్తే ఎంత బాగుండు! ట్రాఫిక్ సిగ్నల్ ఆపక తప్పదు! పక్కనే బైకు ఆపుకుని బైటకి గట్టిగా ట్రాఫిక్ ని తిట్టుకుంటున్నాడు ఎవ రో ఒక అతను.
నాకు తెలుసు ఇప్పుడూ నా నవ్వు చెరిగి పోనిదని, హాయిగా అలా చిరాకు పడగలిగితే బాగుండు!

హమ్మ ట్రాఫిక్ వదిలారు, ఇంకొక్క సిగ్నల్ దాటేస్తే ఇంటికి చేరినట్టే! ఆడవాళ్ళకి ఇంతసేపు పనెందుకు ఉంటుంది..! మా ఆఫీసు లో నాలిగింటికే బయలుదేరుతారు అంటాడు మాటి మాటికీ ఆయన!

పక్కన ఫుట్ పాత్ పై పడి దొర్లు తున్న పిచ్చి మనిషి! ఏది సున్నితమో అక్కడికి చేరుతుందేమో ప్రతి బాధ!
గుండె పట్టేసినట్టు గా ఉంది, ఏదో తెలియని బాధ.

ఇల్లు వచ్చేసింది, ఒక స్టెజ్ పైనుండి మరొక స్టేజ్ పై నటన! జీవితమంతా ఇంతేనా!

చిన్నూ గేటు దగ్గరే వెక్కుతూ నిల్చుని ఉన్నాడు, బండి కనిపించగానే పరిగెత్తుకుంటూ వచ్చేశాడు.

“అమ్మా త్వరగా వస్తానన్నవ్? మళ్ళీ లేటు గా వచ్చావ్.”

వాచ్ మెన్‌ చేతికి బండి ఇచ్చి పార్కింగ్ లో పెట్టమని సైగ చేస్తూ, “ఏవయ్యింది?” అడుగుతూ చిన్నూని దగ్గరకి తీసుకున్నాను..

"అట్లాస్ తెచ్చావా?" సందేహంగా అడిగాడు.

"అయ్యో మర్చి పోయా నాన్నా!, చీ దానికేనా ఏడుపు ఏడవకూడదు." వాడిని ఓదారుస్తూ లిఫ్ట్ వైపు నడిచాం.

“నా వైట్ షూ చిల్లు పడిపోయింది కొనుక్కోవాలి త్వరగా రమ్మని చెప్పాగా, ఈ రోజు పీఇటీ సార్ కొట్టాడు! నాన్న ని అడిగితే నాన్న కూడా కొట్టాడు.” వెక్కుతూ చెప్పుకుపోతున్నాడు.

“రేపు తప్పక కొంటాను నాన్నా నువ్వు బంగారు కొండవు కదు ఏడవకూడదు, నాన్న ని విసిగించావా?”
కందిన వాడి లేత బుగ్గల్ని కళ్ళు హృ దయానికి చేరవేసాయి, అది భోరు మంటూ ఉంది.

రక్తం తో అతుక్కు పోయి రానంటున్న చెప్పు ని బలవంతంగా లాగి పడేస్తూ ఉంటే, హాల్లో టీవీలోంచి తల ఎత్తి గుర్రు గా చూసి నా చిరునవ్వు పలకరింపు తో మళ్ళీ టీవీ లో పడిపోయింది అత్తయ్య.

రామ కోటి పేపర్లు మడతపెడుతూ, "వీడి అల్లరి ఎక్కువై పోయింది, ముఖ్యమైన వార్తలు వినకుండా ఇంట్లొ ఒకటె గొడవ ఏడుపు. మళ్ళీ పదిన్నర తరువాత గానీ చూపించరు పూర్తి వార్తలు!"
విసుగ్గా ఆరోపిస్తున్నట్లుగా గట్టిగా చెపుతూ నా వెనుక నక్కిన చిన్నూ ని ఉరిమి చూశాడు మామయ్య.

అయ్యో అలాగా అన్నట్లు హావ బావాలు చూపుతూ లోనికి నడిచాను.

"పాపం వాడికి ఒహటే తల నెప్పిట అలసిపోయి ఆఫీసు నుండి వచ్చాడు పడుకో నివ్వకుండా వీడు ఊరికే సతాయించేస్తూ ఉన్నాడు." తన కొడుకుపై జాలి పడిపోయింది అత్తయ్య.

“అయ్యో ఏరీ ! పడుకున్నారా! టీ తాగారా, డిస్ప్రిన్‌ ఉండాలి ఇంట్లో, వేసుకున్నారా?” కుశలమడుగుతూ బాత్రూం లో టాప్ కింద కాలు పెట్టి నీళ్ళు వదిలా చుర్రు మంది.

“ఆ.. టీ తాగక? నువ్వొచ్చి ఇచ్చే వరకు ఎదురుచూడాలా, ఐనా వాడికి పెళ్ళం చేతి టీ తాగేంత అదృష్టమా!” హాల్లోంచి అత్తయ్య మాటలు వింటూ గోరు లాగిపడేసి, కట్టు కట్టుకుని, ఇల్లాలి వేషం కట్టుకున్నాను.
మిరపకాయ బజ్జీలు తెచ్చుకుతిన్నట్లున్నారు, టేబుల్ పై వదిలేసిన ముక్కలకి ఎర్ర చీమలు పట్టి ఉన్నాయి. చిన్నూ అటువైపు వెళ్ళకు జాగ్రత్త నా వెంటే తిరుగుతున్న చిన్నూ ని హెచ్చరిస్తూ గబ గబా శుభ్రం చేసి వంట పనిలో పడిపోయాను.

తిన్నా తినకపోయినా రెండుపూటలా వంట చేయక తప్పదు. పెళ్ళైన నాల్గు నెలలకే, కోడలు సరిగా అన్నం పెట్టలేదనీ, పాచి కూరలూ, అన్నం తిన్నామనీ కూతురితో చెప్పుకుని బంధువుల్లో దోషి గా నిలబెట్టేసారు.
“అన్నం తినకుండా ఎలా బ్రతికున్నారు? నా పై అభాండాలు వేసి ఇక్కడ అన్నం లేకుండా ఉండడమెందుకు? అంత బాగా చూసుకునే మీ అన్నలు ఎవరో ఒకరి దగ్గరa ఉండొచ్చుగా!” అంటూ భర్తనడిగింది ఆ రోజు.

“అన్నయ్య ల్లా నేను పెళ్ళాం చాటు వాజమ్మ ని కాదు! తల్లీ తండ్రీ తరువాతే నాకెవరైనా! నేను పెళ్ళి చేసుకున్నదే వాళ్ళకోసం, వాళ్ళని చూసుకునే వాళ్ళు లేరనే నిన్ను చేసుకుంది. అత్తా, మామ లకి తిండి పెట్టడం కూడా నీకు బరువైన పనా? మీ వాళ్ళైతే ఇలాగే చేసేదానివా?”
భర్త మాటలకి సమాధానం చెప్పి ఒప్పించటం కన్నా ఓ పూట వంటే తేలికనిపించింది.

“అమ్మా ఆకలి” చిన్నూ మాటలకి ఈ లోకం లోకి వస్తూ వాడికి అన్నం కలిపి “ఇదిగో నేను కలిపింది అంతా వదిలేయ కుండా తినేయాలి వెళ్ళి హాల్లో కూర్చో.
అత్తయ్యా, మామయ్య గారు వడ్డిస్తున్నాను రండి” అందమైన చిరునవ్వు తో కూడిన నా పిలుపు అందుకొని లేచారు వాళ్ళు.

“మోకాళ్ళ నెప్పి అడుగు తీసి అడుగు వేయలేక పోతున్నా, రాధ దగ్గరున్నప్పుడు వారం, వారం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేది! అది మాత్రం ఉద్యోగం చేయడం లేదా ఏమిటి? నీలా రాత్రుల దాకా బయట తిరుగుళ్ళు దానికి లేవు ఇంటిని చక్కదిద్దుకునే సంసార లక్షణాలు గలది!”
తమని తరిమేసిన పెద్ద కోడలి గొప్పలు అత్తగారి నోటంబడి వినటం అలవాటై పోయింది.

“అయ్యో నెప్పి ఎక్కువగా ఉందాండీ! రేపు తప్పకుండా హాస్పెటల్ కి వెళదాం! మందులు ఉన్నాయిగా, రోజు వాడుతున్నారా?”

“ఆ ఉన్నాయిలే! పాడు మందులు పనిచేస్తాయా పాడా! ఇదేంటే.. వంకాయ వేయించావు? మేం భూమ్మీద ఇంకో నాల్గు రోజులు ఉండాలా వద్దా!” పళ్ళెం లో మరి కాస్త వంకాయ వేసుకుని తింటూ ధీర్ఘాలు తీస్తోంది.

“ఏంటీ సాంబారు చల్లగా ఉంది?” మామయ్య మాటలకి నా మతి మరపు ని తిట్టుకుంటూ సాంబారు గిన్నె తీసుకుని స్టౌ వైపు నడిచాను, వెనక వాళ్ళ మటలు వినిపిస్తూనే ఉన్నయి.

“సంధ్య పోన్‌ చేసిందని చెప్పావా?”

“ఏదీ మహారాణీ గారు ఇప్పుడేగా ఇంటికి చేరింది.”

వాళ్ళ ఒక్కగానొక్క కూతురు సంధ్య ఫోన్‌ చేసిందంటే ఏదో పెద్ద ఖర్చు మీదపడపోతుందన్నమాటే!

చిన్నూ పిలుస్తూన్నాడు “అమ్మా తినేసా.”

“గుడ్ వెళ్ళి పడుకో నాన్నా.” నా మాటలకి బుద్దిగా బెడ్ రూం కేసి వెళుతున్న చిన్నూ తో పాటు పరుగు పెడుతున్న మనసునీ, శరీరాన్నీ బలవంతంగా ఆపి పనిలో మునిగి పోయాను.

“సాంబారు వేసుకోండి, జాగ్రత్త వేడిగా ఉంది.”

“కొద్దిగా చాల్లే ఏదీ ఎక్కువ తినలేక పోతున్నా! ఉదయం సంధ్య ఫోన్‌ చేసింది వచ్చే వారం లీవు తీసుకో మళ్ళీ దొరకలేదంటావు” చెపుతూ తన భార్య వైపు చూసాడు మామయ్య మిగతాది నువ్వు చెప్పు అన్నట్టుగా.

“సంధ్య ఫోన్‌ చేసింది, నీకూ చేస్తే ఎంగేజ్ వచ్చిందట. వచ్చే శుక్రవారం అపార్టుమెంటు గృహప్రవేశం పెట్టుకున్నారట. ఇల్లు కొన్నుక్కుని రెండేళ్ళైనా కాలేదు మళ్ళీ అపార్టు మెంటు కొన్నుక్కున్నారని అందరూ తెగ ఏడ్చి పోతున్నారు అందుకే సింపుల్ గా చేస్తున్నాం అని చెప్పింది. అన్నా తమ్ముళ్ళు అంటూ ముగ్గురున్నారు ఏం లాభం? ఏదన్నా ఘనం గా చదివించాలి ఈ సారి!
నీకు మీ అన్నయ్య ఇచ్చాడు చూడు అలాంటి వెండి అష్టలక్ష్మీ బిందే, నిలువెత్తు దీపపు సెమ్మెలూ తీసుకు రమ్మని చెప్పింది. పాడు ఉద్యోగం వల్ల తీరికే దొరకదు వచ్చి పిలవలేక పోతునాను అని ఒకటే బాధ పడిందనుకో. పాపం అన్నీ అదే చూసుకుంటుంది ఒంటరి కాపురం !”
ఎప్పటిలాగే కూతురి ఎంత కష్టపడి పోతొందో వివరించడం మొదలెట్టింది అత్తయ్య

నాకు అన్నయ్య ఇచ్చాడా? పెళ్ళి లో పీడించి నాన్న దగ్గర వసులు చేసింది వీళ్ళేగా! ఎంత లోగా అందంగా ఎలా మార్చేశారు విషయాన్ని! ఆమె ఒక ఇల్లు కట్టి సంవత్సరమైనా కాలేదు అప్పటి గృహ ప్రవేశానికి వెండి డైనింగ్ సెట్టు కావాలి అంటూ దాదాపు వెండి వంటపాత్రలు అన్నీ కొనిపించుకు వెళ్ళింది! మళ్ళీ ఇప్పుడు...!

“వింటున్నావా? అన్నా తమ్ముళ్ళు బాగా సంపాదిస్తూ ఉన్నారు, ఏం లాభం? ఒక్కగానొక్క ఆడపిల్ల ప్రతి దానికీ దేవిరించుకొని అడుక్కోవలసిందే! నువ్వో రోజు లీవు పెడితే వెళ్ళి కొనుక్కు రావచ్చు అలాగే దానికీ, అల్లుడుకీ, పిల్లలకీ బట్టలు కూడా తీయాలి.”
నా తల గంగిరెద్దు లా ఆడుతోంది, పెదాలపై చిరునవ్వు తాండవిస్తోంది. నా మొహం లోకి పరీక్ష గా చూస్తూ చెప్పుకు పోతోంది అత్తయ్య. తను ఆశించిన చిరునవ్వు నామొహం లో చూసిందేమో ఎక్కువ రాద్దాంతం లేకుండా భోజనాలు ముగించి టీవీ ముందు సెటిల్ ఐపోయారు ఇద్దరూ.

“ఏవండీ! మీరూ రండి.. భోంచేద్దురు గానీ,”

“అమ్మా, నాన్నా సరిగా భోంచేసారా? ఎందుకింత లేటు చేస్తునావు? ఇలాగైతే వాళ్ళ ఆరోగ్యం ఏమౌతుంది? నీకస్సలు శ్రద్ద లేకుండా పోతోంది!” భోజనానికి కూర్చుని తల్లీ తండ్రీ వినేట్టు క్లాసు పీకడం మొదలెట్టాడు.

హు.. చిన్నవాడు ఆరోగ్యంగా పెరగాల్సిన వాడు తిన్నాడో లేదో పట్టదు వీళ్ళకి! ఇంత మందిలో వాడు ఒంటరిగా బిక్కు బిక్కు మంటూ పెరుగుతున్నాడు! సొంత గా పెట్టుకు తినగలిగే వాళ్ళకి మాత్రం ఒకరు దగ్గరుండి చూసుకోవాలిట!

“ఏంటీ మొహం అదోలా పెట్టావ్?” అడుగుతున్న ఆయన్ని నమ్మలేనట్టు చూసాను.
ఓహో నా మొహం అదోలా కూడా మారుతుందా! వాష్ బేసిన్‌ దగ్గరున్న అద్దం లోని నా మొహం లోని చిరునవ్వు నన్ను నిరాశ పరిచింది.

“సాంబారు చల్లారి పోయింది.”

“మళ్ళీ వేడి చేసి తీసుకొస్తా.”

“ఇల్లంతా చెత్త కుప్ప లా తయారైయ్యింది! ఓ రోజు లీవ్ పెట్టి సర్దేయకూడదూ?”

“ఈ సండే ఓ రెండు గంటలు ముందుగానే లేచి సర్దేస్తా.” ఇంటి అందమే కదా, ఇల్లాలికి ముఖ్యమైనది.

వెండి బింది, సెమ్మెలు పుణ్యమాని వ్యంగపు బాణాలు లేకుండా ఈ రోజు భోజనాల కార్యక్రమం ముగిసింది. ఒంటరిగా ఎంత సేపైనా పనిచేసుకోగలను గానీ ఈ గంట భోజనాల తంతు ముగిసేసరికి నీరసం ముంచుకొచ్చేస్తుంది!
ఈ నా ఇంటిలో ఎక్కువ సేపు నేను గడిపే స్థలం ఈ ఎనిమిదడుగుల వంటగదే!
ఎంతసేపు, ఓ ఐదు గంటలు అలా పడుకుని ఇలా లేచి వచ్చేయనూ.. వంటగదితో వీడ్కోలు పలికి నడిచాను మరో స్టేజ్ పైకి మరో పాత్ర లోకి.
“చీ అలసిపోయినట్టు ఉంటావు ఉత్సాహంగా ఉండొచ్చుగా! పెద్ద ఉద్యోగం నువ్వొక్క దానివే చేస్తున్నావా! మా ఆఫీసుకొచ్చి చూడు ఆడవాళ్ళు ఎలా ఉంటారో పిట పిటలాడుతూ.”

పిడికెడంత హృదయం నెప్పి తట్టుకోలేక మూలుగుతోంది. పెదాలపై వెర్రి నవ్వు ఉండే ఉంటుంది!
జీవితం లో తీరని కోరిక మళ్ళీ మనసులో పురి విప్పుకుంటుంది, దిక్కులు పిక్కటిల్లేలా ఏడవాలని..
అమ్మో ఇప్పుడు ఏడవడానికి టైమ్‌ ఏదీ! పొద్దున్నేలేవాలి, స్టేజ్ పై నవ్వులు పూయించడానికి.
~~~~~~~~~~~~~~~~~~