Pages

Wednesday, November 17, 2010

ఈ రొజు నాది.....వంశీ లాగేసుకున్నాడు

 *(లాగేసుకోవడం = లాక్కోవటం*  (లాగు +ఏసుకోవటం అనుకోకండే)

అన్నింటికి సెలవు ఇచ్చేసుకున్నాను.  రోజు నాది. అచ్చంగా  నా ఒక్కదానికే!  తీరిగ్గా  దొరికానని  పలకరించడానికి వర్షం  తనకు తొడుగా పొగమంచుని చలిని వెంటబెట్టుకుని మరీ వచ్చేసింది!
  ఇంటి చుట్టూ కురిసే వర్షం  డోంట్ డిస్ట్రబ్  బోర్డ్ లా నా ఏకాంతానికి కాపలా.  చలికాలంలో ఈ తుఫాను వర్షం   కాఫీలు, పుస్తకాలు  సూపర్ జొడీ. 
పుస్తకాల బీరువాలో  పసలపుడి కథలు  మళ్ళీ ఓ సారి మా పసల పూడికి రాకూడదూ  అని ఆహ్వానిస్తూ....
   ఎందుకు మళ్ళీ  చేయి ఆ పుస్తకం  వైపె వెళుతుందంటే..... 
ఏమో!  ఏదో  ప్రత్యేక లోకం లోకి వెళ్ళినట్టుంటుంది నాకు ఆ కథల్లోకి వెళితే. సహజమైన ఏ భెషజాల్లెని ఓ ప్రపంచం అది! 

వంశీ  సినిమా  సినిమాల్లో  ఎలా  డిఫరెంటో,  దాంట్లోని హీరోయిన్ ఎలా  ప్రత్యేకమో,  హీరో, మిగతా  పాత్రలూ, సెట్టింగులు,  ఊరు  వాడ,.  పాటలు  డైలాగులు  మిగతా  సినిమాల కంటే  ఎలా  డిఫరెంటైనవో  అలాగే  వంశీ  కథలు  కూడా.
ఆయన  అన్ని  కథల్లో      ప్రతి పాత్రకీ   ఓ గాధుంటాది.  ప్రత్యేక  లక్షణాలు  అలవాట్లు  కళ్ళకు  కట్టినట్టు  వర్ణింపబడతాయి. పడవ నడిపే వాడైనా,  ఊరిపెద్ద ఐనా,  కూలైనా,  కళాకారుడైనా, మాట్లవాడైనా  సోమరిగా ఉన్న జూదరైనా,  దొంగైనా,  దొరైనా   అంతా  మనకి  తెలిన వాళ్ళే,   అంతా  మనవాళ్ళేననిపిస్తుంది.   ఆ  మనుషులు  మన  మనసుకి  దగ్గరగా,  వాళ్ళ యవ్వారమంతా   ఎంతో  సహజంగా! 
 పాత్రలు  మాటాడవు  మనసువిప్పి  చూపెడతాయి.   హీరో  గురించిన  వర్ణన  ఎలాగుంటుందో  అంతే  సహజంగా  విలన్  గురించీ.  పాత్రల మధ్యనే  యుద్దం.  చూడబోతే  విలన్  తో  ఈయనకేమీ  సొంతపేచీ్లు   ఉండవు.  ముఖ్యంగా  పరిసరాలు  వాటి వర్ణనా  నేను ఆ చోటంతా  తిరిసి వచ్చినట్టు ఓ ఫీలింగ్
అన్నీ ప్లెస్సులేనా...!  నా కైతే  కొన్ని మైనస్సులూ  కనిపిస్తాయి.     కథ  చక్కగా  సాగుతుంటూ  ఉంటుంది     ఆత్రంగా  చదువుతూ  ఉంటాం. మధ్యలో కొస్తుంది  చూడు  తిండి  గురించిన  వర్ణనలు     కథ మానాన దాన్ని  వదిలేసి  ఎంచక్కా  తాపీగా   వంటల గురించి  పేజీలకు  పేజీలు .  ముఖ్యంగా  వార పత్రిక  సీరియల్స్ లొ  చదువుతున్నప్పుడు  ఇది  చాలా  ఇబ్బంది  పెడుతుంది  నన్ను.    పత్రికలో  ఆ  వారానికి  వచ్చే   బాగం   ఉండేదే  మూడో  నాలుగో  పేజీలు   అయ్యో   కథ ఏవైయ్యిందో  అన్న  ఆత్రుత  చదివే వాళ్ళది.  మద్యలో  సాగదీసే  ఆ  వర్ణనలు  అదే విసుగు.
ఇంకోటి  అనవసరపు  రొమాన్స్ .  అసలు  ఈయన  కథల్లో  తిండీ,  రొమాన్స్  అవసరమైన  దానికంటే  ఎక్కువే  ననిపిస్తుంది. 
సరెలే   ఇదంతా  పక్కన  పెట్టి.   మా పసలపూడి  కొద్దాం.
  మా  పసలపూడి  కథలు.  పుస్తకం  చూడగానే  హబ్బో  పెద్దది  అనిపిస్తుంది. (నేను  సీరియల్ గా  వస్తున్నప్పుడు  గనుక  చదివుండకపోయుంటే  అబ్బో  పెద్దగా ఉంది ఇప్పుడే  చదువుతాంలేబ్బా  అన్కునుండేదాన్నే)   పుస్తకం  పెద్దదైనా  అందులో  కథలు  చిన్న  చిన్నవే  గబ గబా  చదివిస్తాయి
  అసలిది  కథల పుస్తకం  మాత్రమేనా   బొమ్మల  పుస్తకంకూడా.   రంగురంగుల   బాపు  బొమ్మలు   పుస్తకానికే  అసలు  అందం.  బాపూ బొమ్మల  అబిమానులకు  ఇది  టూ ఇన్ వన్  అన్నమాట. 
అసలే  వంశీ  కళ్ళకు  కట్టినట్టు  ఆ  కథలోకి  తీసుకెళుతూ  బొమ్మగీసినట్టు  రాస్తారు.  దానికి తోడు  బాపూ గీసిన  బొమ్మలు.. యామ్  యామ్  అన్నమాట.
  గోదావరి జిల్లా నేపధ్యంలో పసలపూడిని కేంద్రంగా చేసుకుని సాగే   కథలు ఇవి. కథలనుకుంటే   కథలు  మొత్తం ఏకంగా ఒకే కథ అనుకుంటే  అదీనూ!  మొత్తం అరవైఏళ్ళ కథ.
 ఇప్పటి పెద్ద వయసు వాళ్ళు  ఆ కథల్లో  తమ  గతకాలం  చూసుకుంటే, ఈ తరం వాళ్ళకి  కథల్లోని సాంప్రదాయక గ్రామీణ జీవితాలు  ఆ కాలాన్ని  పరిచయం చేస్తున్న  చరిత్రలా  అనిపిస్తాయి.
కథల్లో  ఉన్నదేమిటి  అంటే  ..  మనిషితనం,  విలువలు. నిష్కలంకమైన  హృదయాలు. అమాయకత్వం, అనుబంధాలు, నమ్మకాలు, బలహీనతలు,  విషాదం ఇలా చెపుతూ పోతే  మనిషిజీవితంలో ఉన్నదంతా... ముఖ్యంగా  మానవ  సంబంధాలు.
ఆశ, వ్యగ్యం,  హాస్యం, వైరాగ్యం, విషాదం   ఒకో రుచి  చూపిస్తూ  ఒక్కో కథా  సాగుతుంది.
మామూలుగా సాదా సీదాగా కనిపించే జీవితంలోంచి  ఏదో ప్రత్యేకతని తెచ్చి మనముందుంచుతాయి  కొన్ని కథలు.  అసలు పట్టించుకోవలసిన అవసరమే లేదనుకునే  విషయాన్ని  తెచ్చి  కథగా మార్చి ఊరించి చెప్పి  ఇంతుందా  అనిపించేలా  విస్మయ పరుస్తాడు  కొన్ని సార్లు.   ఒకోసారి  హాయిగా సాగే కథని  విషాదాంతం  చేస్తాడు.  వర్ణించీ  ఊరించీ   చివరకలా  ఏడిపించి.. నిజంగా ఎదురుగా ఉంటే  కొట్టాలన్నంతగా ..  కర్కషంగా  ముగిస్తాడు. ఆ శాడిజం  దేముడి  దగ్గర  నేర్చుకున్నాడేమో.
  మనసున్న  మనుషుల్ని,  మహానుభావులనీ  మన కళ్ళముందు  నిలుపుతాడు  వాళ్ళకో  దడం పెట్టుకుంటాం  మనం  మనసులోనే. ఇక్కడ మనిషిలొని బలహీనతలనీ అంతే లైట్గా తీసుకుంటాం. ఇంతేగదా జీవితం అనే వైరాగ్యం పొందుతాం మరొకసారి!

సరె.............కథల గురించి మొదలెట్టానంటే  ఇంకోరోజు నేను సెలవు పుచ్చుకోవలసిందే....

ఇంతకీ అసలు ఇసయం ఏంటంటేనండి. నాకు నేను పుచ్చుకున్న సెలవు రోజుని  ఇంకేం చేయకుండా   ఈ వంశీ లాగేసుకున్నాడండీ బాబూ  :(

ఆయ్  అదండీ........
మరి శెలవండీ
  ఆయన స్టైల్లో చెప్పాలంటే ..  దిగడతానండి!
                     

Wednesday, November 10, 2010

ఐతే

"హబ్బ... ఎంతబావుందో ఇక్కడ! ఎంచక్కా వాకింగు  చేసుకోవచ్చు."   అసలిన్నాళ్ళూ ఈ వైపురానందుకు మనసులో ఓవైపు కుములుతూ,  ఇప్పుడు ఇంతమంచి చోటుని కనుగొన్న    ఆనందంలో  తన  చేతిని గిల్లేస్తూ  సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ...

"ఉస్, అబ్బా చెయ్యొదులు"

నా మాటలు విననట్టు నటెంచేస్తే  మనం  ఊర్కుంటామేమిటి.  చెయ్యి వదిలి మళ్ళీ  మళ్ళీ అదే డైలాగు రిపీటు చేసెయ్యమూ
"వాకింగు  వాకింగు రోజూ ఇక్కడికి వచ్చి చేసేద్దాం, ఏం?"

"సరే చేద్దూగానిలే"

"చేద్దూగాని ఏంటీ చేస్తున్నాం ఇద్దరం కలిసి కబుర్లాడుకుంటూ హాయిగా వాకింగ్ చేద్దాం."
"చూద్దాంలే"

//ఈ చూద్దాంలే ని ఎవరు కనిపెట్టారోగాని....ఆన్ని...... #౨$‌&@//

"నానీ  మీ డాడీ  చేద్దాంలే అంటున్నారు.  రేప్పటినుండి  సాయంత్రం అవగానే అందరం  ఇక్కడికి వచ్చేద్దాం . అలా చూడు  ఆ గ్రౌండులో  చిన్న పిల్లలు భలేగా ఆడుకుంటున్నారు   నువ్వూ  ఆడచ్చు.  తొందర తొందరగా పొడవైపోవాలని అంటావుగా . ఎంత ఆడితే అంత పొడవు."

"అమ్మా  మరి మజిల్స్ కూడా"

"ఊ ఊ బోల్డు బలం కూడా వచ్చేస్తుంది.  మేం ఇద్దరం వాకింగ్ చేస్తాం  నువ్వు  ఇంటికెడదాం అంటూ గోలచేయకుండా  చక్కగా  ఆడుకోవాలి సరేనా."
సాయంకాలపు నీరెండలో  మిల మిలా మెరుస్తున్న మట్టిలో  హాయిగా ఆడుతున్న పిల్లలు. ఆ  పేద్ద  మైదానం  చుట్టూ  నాలుగు వైపులా  విశాలమైన నల్లటి తారు రోడ్డు. రోడ్డుకి  రెండువైపులా  చెట్లు  పైన ఆకాశం  కనిపించకుండా  అల్లుకున్న  వాటి కొమ్మలు.    అలాంటి చోటుతో ప్రేమలో పడకుండా  ఎలా ఉండటం!

"అలా చూడండి  ఆ కపుల్ ఎంచక్కా కబుర్లాడుకుంటు  నడుస్తున్నారు....." (సాధింపు) మొదలెట్టాను. ఎలాగైనా సరె అనిపించేయాలి.
అదిగో  తాతయ్యల  గుంపు కులాసాగా  కాసేపు నడచి  ఆ  ఆడిటోరియం మెట్లపై  లోకాభిరామాయం చెప్పుకుంటున్నారు.   బుజ్జి బుజ్జి పిల్లలు  రోడ్డుకడ్డంగా  సైకిల్ తొక్కడం ప్రాక్టీసు చేస్తున్నారు.  అమ్మాయిలూ ఆంటీలూ  ఒక్కరోజు లోనే  జీరో సైజు సాధించేయాలన్నంత కసితో  నడుస్తున్నారు.  యువకులు హేప్పీగా గ్రౌండు పక్కన  మెట్లపై గుంపులుగా  చేరి కబుర్లు చెప్పేసుకుంటున్నారు.


ఇంటికి  వచ్చేదారిలో... 
నడక - నలభై లాభాలు అంటూ...

చెప్పేవన్నీ  తనకి ఈ చెవిలోంచి ఆచెవిలోకి అటునుండి బయటకు వెళుతూనే వున్నాయ్.

ఫ్చ్.. ఒక్కదాన్నే వెళ్ళనా!

ఒక్కదాన్నీ నోరు మూసుకుని నడవాలంటే ఎంతకష్టం!
ఇంట్లో అందరం కలిసి గడిపే  సాయంకాలం  వీళ్ళని మిస్సవుతూ  ఒక్కదాన్నీ...!

ఐడియా..!  (ఉపాయం తెలియనోన్ని ఊళ్ళోనుంచి వెళ్ళగొట్టాలి అంటుండేది మా అమ్మమ్మ:)
మాధవన్   దూరంగా రొడ్డుపక్కన  ....
అవును మాధవన్
హోర్డింగు  పై  ఫోజిచ్చి.

"అదిగో మాధవన్.  మీరు గనక  బరువు తగ్గి స్లిమ్ము ఐతే  అచ్చు  మాధవన్ లాగే  ఉంటారు."

"డాడీ  వెళుతుంటే  మాధవన్ మాధవన్ అంటారా అందరూ!"   మా వాడి అమాయకపు తెలివైన  ప్రశ్న.
ఆయన మొహం ముసి ముసి నవ్వులతో వెలిగింది.
హమ్మయ్య.
ఓ పనైపొయింది బాబూ

"అమ్మా మరి నాకక్కడ బోర్.  రెండు గెమ్స్   డౌన్లోడ్  చేస్కోనివ్వాలి.  అక్కడ కూర్చుని ఆడుకుంటా."

టైం చూసి మరీ  నెగ్గించుకుంటావుగా  సరె కానివ్వు.

**

"నిన్న అంత  మంది ఉన్నారు. ఈ రోజు ఎవరూ లేరే!" 

"ఆరు దాటిందిగా  ఇళ్ళకెళ్ళిపోయుంటారు"

చీ  మెకానికల్ మనుషులు. అసలు  సాయంసమయం  బావుండేదే ఇప్పుడు  ఆరింటి నుండి ఏడున్నర వరకు నడవచ్చు. చల్లగా  హాయిగా  ఎంతబావుంటుంది.
నడక మొదలైంది  ఇద్దరం హాయిగా కబుర్లాడుకుంటూ ఆకాశానికి పందిరేసినట్టున్న పచ్చటి ఆ కొమ్మల కింద  చల్లగాలికి......  ఓహో  చెపితే తెలుస్తుందా  ఆ ఆనందంఏంటో.


వాళ్ళ నడక ముగిస్తూ  ఒకరిద్దరు మా వైపు ఓ మాదిరిగా   చూస్తూ హడావిడిగా  పరుగులెత్తుతూ వాళ్ళ  వాహనాల వైపు వెళ్ళిపోయారు. చెట్ల కింద  రోడ్డు అంతా ఎందుకో ఒక్కసారిగా నిర్మానుష్యం గా మారింది. గ్రౌండులోని ఆడిటోరియం మెట్లమీద మాత్రం ఉన్నారు కొందరు.
అబ్బా ఏమిటి. అందరూ ఏదో టైం పెట్టుకున్నట్టు  వెళ్ళిపోయారు. ఏం జనాల టేస్టు నిన్న చూస్తే ఎండపూట ఉక్కపోతలో   తెగ నడుస్తున్నారు. చక్కగా  చల్లటి వేళ ఒక్కరూ లేరు.

ఎప్పటిలాగానే  నేను మాట్లాడుతున్నాను తను వింటున్నారు.
" గ్రౌండు చుట్టు  ఒక రౌండ్ వేస్తే  ఒక కిలోమీటర్  కదా. మనం ఈ రోజుకి  రెండు రౌండ్స్ నడుద్దాం."

వర్షం పడుతున్నట్టుందే!

టప్ టప్ మంటూ ఏవో పడుతున్నాయ్.
అవి ఏంటో బుర్రకి అర్ధం అయ్యేలోగానే..
నెత్తి మీదా, బట్టలమీదా  తెల్ల తెల్లగా....
ఓహ్ ..
ఇంకేం మాటల్లేవు

పరిగెత్తుకుంటూ  పార్కింగు కేసి తను. పిల్లాడి కోసం ఆ పక్కనే ఉన్న మెట్లవైపు నేను.


ముందు రోజే గమనించాను  రోడ్డునిండా  దట్టంగా   తెల్లగా ఉన్న ముగ్గుల్ని. ఏమోలే  చెట్లన్నాక పక్షులు ఉండవా   పక్షులన్నాకా  రెట్టలు వేయావా  అనుకున్నా గానీ :(


"అమ్మా అప్పుడే వెళ్ళిపోతున్నామా.  రేపు త్వరగా వద్దాం".

"సరెలే  నీ పిచ్చి గేమ్స్ ఇక్కడా మొదలెట్టేసావ్. కళ్ళు చూడు. అందుకే ఆ కళ్ళజోడు వచ్చింది. ముందు నువ్వా పిచ్చి  పీసీ గేములు మాను."




ఐతే....
ఐతే ఏంటీ ఐతే..
అంతే  ఈ ఎపిసోడు.

Saturday, August 28, 2010

మా తోట -2

 మా తోట చిత్రాలు  మా అబ్బాయి తీసినవి








  

చక్కగా  ఏపుగా  మొలకెత్తన  మడి అనిపిస్తోంది  కదూ!  లూసర్న్  వేయిస్తే  అంతా  అలా  కలుపు  వచ్చేసింది.  మేనేజర్ ఏమంటాడంటే   పక్క  వాళ్ళ  తోటలో  ఉన్న  కోళ్ళఫాంలోని  ఈగలు వచ్చి  ఈ లూసర్న్ మొక్కలని  తినేశాయిట   :-)

పూదీనా  మడి





 

Thursday, July 22, 2010

మా తోట

కొన్నాళ్ళ క్రితం. అంటే.. కొన్ని చాన్నాళ్ళ క్రితం అన్నమాట. చుట్టలు చుట్టుకుంటూకుంచెం త్వరగానే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోవచ్చు. ( పుగాకు చుట్టలు కాదు సినిమాల్లోలా ఫ్లాషు బ్యాకు చుట్లు/ వలయాలు)
ఓ రోజు మా వారు ఫోన్ చేసి 'చిన్నూ రెడీగా ఉండు బయటకెడుతున్నాం, నేనో అరగంటలో వచ్చేస్తాను' అన్నారు ఆ అరగంట చుట్టుపక్కల తన ఫ్రెండ్స్ ఇండ్లల్లో (ఆటకి వెళ్ళిన) మా వాడిని వెతికి ఇంటికి తీసుకువచ్చే సరికే అయ్యింది. ఈయన వచ్చీరావడంతోనే "పదా పదా వెళదాం ఇలాగే రండీ." అంటూ.. "సరే సరే ఎక్కడికీ ఎక్కడికీ ముందది చెప్పండి." అంటూ నేను. (ఎక్కడికో తెలిస్తే అక్కడికి తగ్గట్టు ముస్తాబై వెళ్ళాలి కదా :p )
"నీకు తోటలు చెట్లూ చేమలు పొలాలు చేన్లూ అంటే పిచ్చి కదా. ( ) అదే అదే పిచ్చిప్రేమ కదా.. ఓ తోట వుంది నీకు నచ్చిందంటే అది మనదే."
"భలే! కానీ ఇప్పుడా మనం వెళ్ళేసరికే చీకటి పడిపోతుందేమో అక్కడేం చూస్తాం."
"ఎంతా అరగంటలో అక్కడుంటాం" ఆయన నోట్లోంచి వస్తున్న మాటలు పూర్తవకుండానే ఓ వాటర్ బాటిల్ బ్యాగులో పడేసుకుని చెప్పులేసుకుని సిద్దం అయిపోయ్యాం ఉన్నఫలంగా.

{ఇక్కడో పి.వే. ;- మేం ఇప్పటి వరకు ఏది చేసినా, ఏది చూసినా, ఎక్కడికి వెళ్ళినా చీకటి పడిపోయే వుంటది :( మా హీరోగారు హడావిడిగా ఆలస్యంగా పదా పదా అంటూ వస్తారు. హూ  అర్ధరాత్రి స్వాతంత్ర్యం పొందినవాళ్ళం కదా, అదే పరంపరలో మా పనులు}
"మనకి దగ్గర.  ఎప్పుడుకావాలన్నా వెళ్ళొచ్చు...  అంటూ మొదలెడుతూ ఆ పొలమూ తోటా విశేషాలు, సంగతులూ చెప్తూ ఊరిస్తున్నారు. వింటూ కలల్లోకి వెళ్ళిపోయాను నలుపూ తెలుపులో సావిత్రి ఎంటీయార్ లా పొలం పనుల్లో నేనూ మావారు. వెనకే ఓ బుల్లి రైతు గెటప్పులో మా చిన్నోడు . మనసు తెరపై వరసగా దృశ్యాలు మారుతున్నాయి . పొలం గట్లపై క్రిష్ణా శ్రీదేవి లా (డ్యూయెట్) కబుర్లు చెప్పుకుంటూ. నాగేశ్వర్రావ్ వాణిశ్రీలా...

అలా నా గోలలో నేనున్నా నా సుపుత్రిడి ప్రశ్నలూ ఈయన సమాధానాలు ఓపక్క విపిస్తునే వున్నాయి.
"డాడీ నాకు తోటలో బోరు కొట్టకుండా ఎదన్నా పెంచుకోనా"
"ఓయస్స్ నాన్నా, ఓయస్స్."
"చిక్స్ పెంచుకుంటా, ఎంచక్కా వాటితో ఆడుకోవచ్చు."
"ఓకే, ఓకే"
"మేక పిల్లను పెంచుకుంటా డాడీ, కార్టూన్ లో ఆమెవెంటే మేకపిల్ల వెళుతూ వుంటది గెంతుతూ భలే బావుంటది. నేను పెంచింది నా వెనకే అలాగే వస్తుంది."
"రైట్, పెంచేద్దాం."
కుందేళ్ళూ, బాతులు, నెమళ్ళు, పక్షులు అంటున్నాడు. కాసేపు వాటికేం పేర్లు పెడతాడో చెప్పాడు. అన్నింటికీ వాళ్ళ నాన్న రైటో రైటో.
"డాడీ గుర్రం పెంచుకుందాం. నేను పొలంలో తిరగడానికి కావాలి కదా."
వాళ్ళ నాన్న తల ఆడించడం ఏమాత్రం తగ్గించకుండా అలాగే అలాగే అన్న ఫోజులోనే వున్నారు వరాలిచ్చే దేవుడిలా.
హమ్మో నేనింక నా ఊహల్లోంచి బయటపడి విషయాన్ని నా చేతుల్లోకి తీసుకోకపోతే నా సుపుత్రుడు ఏనుగు, ఒంటే కూడా పెంచుతానంటాడు :(
(వాడికి ఏదైనా నో చెప్పినా ఊరుకుంటాడుగానీ సరే అన్నతరువాత దాన్ని వద్దంటే :(
నా మనసులోని అందమైన సినిమాకి తెరవేసి వాడిని మెల్లిగా వేరే కబుర్లలోకి మళ్ళించడం మొదలెట్టాను. మా వారు చిద్విలాసంగా డ్రైవింగ్ మునిగి పోయారు. కారు సిటీ దాటింది.



*********** కట్ .. చేస్తే .. *************


సావిత్రీ, ఎంటీయార్, పొలం పాటలు దృశ్యాలైతే లేవుగానీ...

జీవితంలో వున్న ఆనందాలకు మరొక్కటి జతకూడింది :)

ఇంకా.... రోజూ  ఇంటికి వచ్చే తోటలోని కాయగూరలు, పండ్లూ,పూలు, పాలు. అప్పుడప్పుడు ఆకుపచ్చని వారాంతాలు. ఇంకా ఇంకా...


తోటలోని కొన్ని చిత్రాలు





Thursday, July 1, 2010

ఆ జ్ఞాపకాలు ఇకలేవు!

హైవేనుండి ఊళ్ళోకి వెళ్ళే రోడ్డు దారి పట్టింది కారు. ఏదో తెలియని ఉత్సాహంతో మనసు మరింత చిందులేస్తోంది.
"అప్పట్లో ఈ గుడిని చూస్తే భయమేసేది. ఇప్పుడేంటో ఇలాగైపోయింది." రోడ్డు పక్కనే ఉన్న గూడులాంటి గ్రామదేవత గుడిని చూపిస్తూ చెపుతోంది అమ్మ. "ఓసారి ఇదిగో ఈ చింతచెట్ల కిందగా బండిలో వస్తోంటే నువ్వు చింతకాయకోసం కొమ్మలు పట్టేసుకున్నావు, బండి వెళ్ళిపోతూనే వుంది నువ్వేమో ఏడుస్తూ కొమ్మని అలాగే పట్టుకువ్రేలాడుతూ ఉండిపోయావు." ఎప్పటివో గుర్తుతెచ్చుకుంటో అమ్మ.
ఈ చెట్టేనా.., ఉహూ కాదు దీనికంత పొడవు కొమ్మలు లేవు అదిగో అదేమో, ఓ చిన్ని బుజ్జిపాపను ఆ చెట్టుకొమ్మకి ఊహించుకుంటూ నేను.
మసకగా గుర్తున్న ఆ ఊరి జ్ఞాపకాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఊహతెలియని వయసులోనివి నాకు ఇంకా ఎలా గుర్తున్నాయి అది అమ్మకే కాదు నాకూ ఆశ్చర్యమే!

కారు మెల్లిగా ఊళ్ళోకి ప్రవేశించింది. నా స్మృతిలో విశాలంగా ఉన్న రోడ్డు చిన్నగా ఇరుకుగా! "అయ్యో ఊరేంటి ఇలా మారింది" ఆశ్చర్యమో మరింకేదో అమ్మ గొంతులో. "చూడు వీధికి ఎదురుగా ఉన్న ఆఇల్లు ఆరోజుల్లో ఎత్తుగా ఊరంతటికీ అందంగా అనిపించేది, అదే కాదు ఇండ్లన్నీ చిన్నగా కుచించుకు పోయినట్టు అదోలా ఐపోయాయి!" నమ్మలేనట్టుగా చూస్తూ అంటోంది. అందరూ ఇండ్లలో తలుపులు బిగించుకుని టీవీ లో మునిగారేమో వీధుల్లో ఒక్కరూ లేరు.

గతుకులరోడ్డు పై డ్రైవింగులో మా వారు నా మాటలు వింటూ ఊరిని చూసే పరిస్థితిలో లేరు.
సీరియస్ గా, తనకేమీ పట్టనట్టుగా నాన్న. ఆయకిష్టంలేదు తప్పనిసరై వచ్చాడు. ఆయన్ని అనవసరంగా బలవంతపెట్టి తీసుకొచ్చానా అనే గిల్టీ నాలో ఓసారి తొంగిచూసి లోనకెళ్ళింది.

ఊరి మధ్య ఎత్తుగా ఆంజనేయస్వామి గుడి వుండాలి. ఎత్తైన మిద్దెలా రాళ్ళను పేర్చిన కట్టడం పైన స్థలంలో చుట్టూ చిన్న పిట్టగోడ మధ్యలో ఆరు బయటే నిలువెత్తు ఆంజనేయస్వామి విగ్రహం ఊరంతటినీ చూస్తున్నట్టుగా ఉండేది. వెతుక్కుంటూ చూస్తున్నా దాన్ని దాటివెళ్ళినా గుర్తుపట్టలేకపోయాను. ఓ రాళ్ళకుప్పని అదేనేమో నన్న అనుమానంతో తిరిగి తిరిగి చూస్తూ అదేనని నిర్ధారించుకొన్నా.
నగరాల్లో ఎత్తైన భవనాలు, విశాలమైన రోడ్లకి అలవాటైన నా కళ్ళకి ఇవన్నీ చిన్న చిన్ని మట్టి బొమ్మల్లా ఉన్నాయేమో :(

ఇంటిదాకా వచ్చేసాం.ఆ చిన్నరోడ్డుపైనే ఓ పెద్ద చెట్టుకింద కారు ఆపుకుని దిగి పరిసరాల పరిశీలనలో మునిగిపోయాను. ఇంటికెదురుగా ఎత్తైన ప్రహారీ లోన పెద్ద వృక్షాల మధ్య హుందాగా నిలుచుని ఉన్న బడి భవంతి దానికీ ఇంటికి మధ్య పేద్ద (చిన్నపిల్లలకు అలా అనిపించేదేమో) రోడ్డు అదీ నా జ్ఞాపకం. కానీ అక్కడలాలేదు :( ఇంటికెదురుగా చిన్న రోడ్డు కావల వెలిసిపోయిన శిధిలమైన ఓ చిన్న బడి!

అయోమయంలోంచి తేరుకుంటూ అమ్మ వెనక ఇంటిగేటు వైపు అడుగులేసాను. ఇంట్లోని వస్తువులతో సహా బంధువులకి ఒప్పజెప్పిన ఇల్లు. మరో రెండుమూడు చేతులుమారి ఇప్పుడెవరో ఉంటున్నారు. కృంగిపోయిన ఆ ఇల్లు ఉహూ అదికాదు నా జ్ఞాపకం :(
ఒప్పుడు ఆ ఆవరణలో అపరిశుభ్రంగా పశువులు,శిధిలావస్థలో ప్రహారీగోడ. లోనకెల్లకుండానే వచ్చేసి రొడెంటా నడుస్తూ ముందుకెళ్ళాను.

కారు పక్కనే కదలకుండా నాన్న. ఒకప్పుడు ఆ ఊరివాళ్ళైన తన స్నేహితులకి(ఇప్పుడెవరూ లేరు ఆ వూళ్ళో) ఫోన్ చేస్తూ. మీరొస్తామని చెపితే వచ్చేవాళ్ళం అన్నారట. 'పెద్ద చదువులు అందరినీ వూరికి దూరంగా పట్టుకెళ్ళిపోయాయి. ఊళ్ళో ఎవరుంటారు మన పిచ్చిగాని.' అక్కడే మిగిలి వున్న వాళ్ళలో కళ్ళలో 'ఏదో ఇంకేదీ చేతగాక ఇక్కడే పడివున్నాం' అన్న విసుగు.

కాసేపు ఫోన్ మాట్లాడుతూ, కాసేపు ఊరికే తనకేం పట్టనట్టు బడి వైపు చూస్తూ అక్కడే వుండిపోయాడు నాన్న. 'అబ్బ ఎంత అదృష్టవంతుడు. పుట్టి పెరిగిన సొంత వూరిని ఎన్నో ఏళ్ళతరువాత చూసినా ఏ అనుభూతీ, ఆరాటమూ లేకుండా!' స్థితప్రజ్ఞుడు!
అనవసరంగా బలవంతపెట్టి తీసుకొచ్చానేమో, ఉహూ అనుభూతి అంటూ లేని మనిషెవరుంటారు. ఏమో..!

కాస్త ముందుకెళితే అక్కడ గచ్చుతో కూడిన పునాదులు ఉండాలి అది నాన్న వాళ్ళదే పూర్వీకులది అది పడిపోయాక ఇటుపక్కగా ఇంకోఇల్లు కట్టించారట. అల్లిబిల్లిగా అల్లుకున్న చెట్లలో ఆసక్తిగా చూస్తూ మా వారితో ఆ సంగతులు చెపుతూ నేను. పక్కనే పెద్ద బావి ఒకేసారి నలుగు తోడుకునేవిధంగా నాల్గువైపులా గిలకలతో. అది మాత్రం ఇంకా అలాగే ఉంది ఊరికి నీళ్ళందిస్తూ.
చేనంతా ఎవరెవరో ఆక్రమించుకుని ఇండ్లు కట్టుకున్నారు. దానికావల వాగు. అన్నయ్యతో కలిసి వాగులో చేపలు పట్టే వాళ్ళని గమనిస్తూ ప్రశ్నలేస్తూ ఒంటిమీద సృహలేకుండా రోజంతా తిరిగి బాబాయితో చేతిలో తిన్న ఆ దెబ్బలు ఇంకా గుర్తున్నాయి ఏమిటో నాకు!
వాగు దాటి కాళ్ళు నెప్పెట్టేంత దూరం నడిస్తే నాన్న వాళ్ళ తోట. పెద్దబావి దాని పంపులోంచి వేగంగా ఎగిరిదూకే పాలనురుగులాంటి నీళ్ళూ అవి పారే కాలువ వాటిల్లో నా ఆటలు. కాలువ నిళ్ళ అడుగున మెరిసే సన్నటి ఇసక గుండ్రని నున్నని రాళ్ళూ..
బావికి ఓపక్క పచ్చటి పొలం, ఇంకోవేపు మామిడి తోట దాంట్లో తాతమ్మ, తాతయ్య సమాధులు. ఇంకోపక్క కాయగూరల మడులు.. నా జ్ఞాపకాలు.
ఇప్పుడూ అలాగే వుందో లేదో.
"అక్కడికి వెళ్దామా?"
అడిగాను వాగుకీవల నిలుచుని కనిపించనంత దూరంలో వున్న ఆ తోటకోసం చూస్తూ.
"వద్దులే గుళ్ళో దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం." వాగులో కాళ్ళు కడుకుని పక్కనే వున్న కొండ మెట్లవైపు వెళ్ళింది అమ్మ. వాగునానుకుని కొండ దానిపై శ్రీనివాసుడి కోవెల. ఆ మెట్లు చాలా ఎత్తుగా నిట్టనిలువుగా వున్నట్టుగా వుంటాయి. ఈ నిరుత్సాహంలో ఆ మెట్లు ఎక్కలేనంతగా నీరసించాను.

వాగుకి కొండకి మధ్య కాలిబాట ఆ వైపుగా వెళితే ఇంకోపొలం ఒకప్పుడు బంగారంలా పండే వరిpolaM, ఇప్పుడంతా పత్తి వేశారు. ఈ పొలం ఎంతబావుండేది. పక్కనే పంట నూర్పిళ్ళకోసం సహజసిద్దమైన బల్లపరుపుగా పరుచుకున్న కొండరాయి. అలసిపోతే విశ్రాంతికి పెద్ద వేపచెట్టు. పైగా ఇంటికి పక్కనే. ఇప్పుడా పొలం ఎవరిదో!

నా జ్ఞాపకాలేవీ అక్కడున్న వాటితో సరిపోలలేదు. ఆ ఊరంటే ఇప్పుడింక ఇవే గుర్తొస్తాయి. ఏదో అనుకుని వెళ్ళి ఆ పాత బంగారు జ్ఞాపకాలను పోగొట్టుకున్నాను.

ఊరడించే నా మనసు మాటలు వింటూ బయలుదేరాను, లేదు లేదు అనుభూతులు ఎన్నటికీ వదిలిపోవు కదూ తిరిగి అలాంటి సన్నివేశాలు నాజీవితంలో ఉంటాయి రూపం మార్చుకుని. జీవితంలో వ్యక్తులు మారతారు ప్రేమమారదు. దారులు పరిసరాలు,ప్రదేశాలు మారతాయి అనుభూతులూ స్పందనలూ మారవు.
మన కోసం మన జ్ఞాపకాలని ఊరువాడా ఏరు ని ఎవరో అట్టేపెట్టుకు కూర్చోవాలని అనుకోవడం అత్యాశ కదూ!

మళ్ళీ..

నేనేమీ కొత్తగా రాయకపోయినా అడపా దడపా కామెంట్లతో పరకరిస్తూనే వున్నారు మిత్రులు. తట్టిలేపిన వారందరికీ దన్యవాదాలు.

రాయండి, ఎందుకని మానేసారు అంటూ అడిగారు ఓ ప్రెండ్. మిగతా సాకులన్నీ పక్కన పెడితే,
నిజంగా చెప్పాలంటే... రాయడానికేమీ లేదండి నా అభిప్రాయాలు మారిపోతూ ఉన్నాయి. ఏదైనా రాయాలంటే చూసిందో విన్నదో లేదూ అనుభవమో దానికి మన అభిప్రాయాన్ని జోడించడమేగా! నమ్మకాలు అభిప్రాయాలు కాలాన్ని బట్టి మారుతున్నాయి. ఈ లెఖ్ఖన ఇప్పుడు నేనేదన్నా చెప్పానో అది నాకు ఇంకొన్నాళ్ళకు సరి అనిపించదేమో కదూ!

పోనీయండి అభిప్రాయాలు మారనివ్వండి మారుతున్న అభిప్రాయాలే ఓ రికార్డ్ గా ఉండనివ్వండి. సందేశాలేమీ ఇవ్వనప్పుడు, అవి భోధనలు కాదని అన్నప్పుడు ఇంక పేచీ ఏముంది. రాయండి. ఈ క్షణంలో మీకేం అనిపిస్తే అది. మరు క్షణం ఆ అభిప్రాయం మారనీగాక.

"అభిప్రాయాలు" ఒక రికార్డ్ గా. ఓహో ఇదేదో ఆలోచించాల్సిందే!
చూసింది విన్నది అనుభవించింది ఇంకొదరికి చూపించాలన్న తాపత్రమే, మనసులోనిది నలురిలోకి వెళ్ళాలన్న తపనే తప్పించి ఓ రచన ద్వారా సందేశాలో మరింకేదో చెప్పాలని లేదు. మరింక పేచీ లేనట్టే అనిపిస్తీంది, కానీ ..మరీ... ఊ ఇంక చాలు.

Tuesday, April 20, 2010

పరిమళం

పరిమళ గుర్తుందారా నీకు? తీరిగ్గా కుర్చీలో కూర్చుంటూ అంది అమ్మ.


పరిమాళా ఆంటీనా? టక్కున అడిగాను ఆసక్తితో.


నా వైపు అదోలా చూసింది బాగానే గుర్తుంచు కున్నావే్! నీ ఫేవరేట్ ఆంటీ కదూ!”


ఆ పేరుతో నాకు తెలిసిన వాళ్ళు ఒకే ఒక్కరు. పరిమళా ఆంటీ పేరు తలచుకోగానే గుర్తొచ్చేది ప్రసన్నంగా ఉండే ఆమె నవ్వు మొహం. ఎప్పుడు కరుణ కురిపించే చల్లని చూపులు. ఆమె దగ్గర ఏదో డివైన్ నెస్! దేవుడు ప్రత్యక్షమై ఏంకావాలని అడిగితేపరిమళా ఆంటీ లాంటి అమ్మ కావాలి జన్మజన్మలకు అని అడగాలనిపించేంత అమ్మతనం ఆంటిలో.
కుటుంబానికి అర్ధం అనేది ఆంటీ వాళ్ళను చూసే నేర్చుకున్నాను. ఆదరణ, ఆప్యాయతా ఎదుటి మనిషికి ఎంత శక్తిని ఇస్తుందో స్వయంగా అనుభవించాను.


చేతిలోని టీవీ రిమోట్ పక్కన పడేస్తూ అమ్మ వైపు తిరిగాను ఆసక్తిగా.

మొన్న షాపింగ్ వెళ్ళినప్పుడు కనిపించింది, ఇప్పుడు ఇక్కడే వుంటున్నారట. ఆమె భర్త పోయాడుట!


అంకుల్ పోయారా ఎప్పుడు? ఎలా? ప్రశ్నించాను నమ్మలేనట్టుగా.


ఎనమిదేళ్ళైందని చెప్పింది, యాక్సిడెంట్ లోనట


శరత్, మల్లిక, సిద్దు ఏం చేస్తున్నారు? ఆంటీ ఎలా వుంది? తికమకగా అడిగాను.


ఏమోరా నేను పిల్లల గురించి అడగలేదు, రోడ్డుమీద పట్టుకుని ఏం మాట్లాడతాం! నాకు ఆటో వెయిటింగులో ఉంది. తనే గుర్తుపట్టి పలకరించింది, మనిషిలో చాలా మార్పు వచ్చింది, అశోక్ నగర్ రెండో వీధి లో అదేదో బ్యాంకు పేరు చెప్పింది దాని పక్కనే ఉంటున్నారట, ఎప్పుడన్నా తప్పక రండి అంది.


నాకు ఇష్టమైన వాళ్ళ గురించి ఇన్నేళ్ళ తరువాత, ఇలాంటి వార్త ! మనసంతా అదోలా ఐపోయింది, ఇంకేం అడిగినా అమ్మ దగ్గర సమాధానాలు ఉండవని తెలుసు. లేచి బయటకు నడచాను.


ఆ రోజుల్లో తెగ తైతక్కలాడేది, మొగుడు పోయాక తెలిసుంటుంది జీవితపు విలువ. వెనక నుండి అమ్మ మాటలు మనసుని చివుక్కు మనిపించాయి. ఎందుకు ఆమె మీద అంత కసి ! అప్రయత్నంగా వెనిక్కి తిరిగాను.


హూ అవును, మీ కఠినత్వంతో ద్వేషం తో చెల్లిని పోగొట్టుకున్నాం, మనకి మాత్రం తెలుసా జీవితపు విలువ?” ఏనాడు పలకని విధంగా పరుషంగా పలికింది నా గొంతు.

నేనా మాటలు ఆంటానని అమ్మ ఏనాడూ ఊహించి ఉండదు. ఈగో దెబ్బతిన్నట్టుగా చూసింది నావైపు.

బైక్ కీస్ తీసుకుని బయటకు వచ్చాను. పరిమళా ఆంటీ ప్రస్తావన తో నా జ్ఞాపకాలు ఉవ్వెత్తున ఎగసి, ఉక్కిరి బిక్కిరిగా ఉంది కాసేపు నడిస్తేబావుంటుందనిపించి కీస్ జేబులో పడేసుకుని గేటు తీసి నడవడం మొదలెట్టాను.

అమ్మా నాన్నల ఉద్యోగాల రిత్యా ఒకే వూరిలొ దాదాపు పదేళ్ళు వున్నాం. మాలాగే ఉద్యోగరీత్యా ఆవూరిలో ఉండేవాళ్ళు పరిమళా అంటీ వాళ్ళు. ఆమె భర్త ఎమార్వో గా పనిచేసేవాడు.

ఎక్కువ కాలమే అక్కడ ఉన్నాకూడా అ వూళ్ళో. మాకు పెద్దగా స్నేహితులూ దగ్గరివారూ అంటూ ఎవరూ లేరు. అమ్మ కి పల్లెటూరి జనం అంటే ఒకరకమైన చులకనగా ఉండేది. వాళ్ళతో స్నేహం చేస్తే మేం ఎక్కడ క్రమశిక్షణ తప్పుతామోనని నన్నూ చెల్లినీ కూడా ఎవరితోనూ కలవనిచ్చేది కాదు. ఇరుగుపొరుగుతోనూ దగ్గర పరిచలేవీ లేవు. అమ్మ తన పనులన్నీ తన స్టూడెంట్స్ తో చేయించుకొనేది. నాన్నకి ఆఫీసులో పరిచయాలు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు గాని ఇంటిదగ్గర సీరియస్ గా స్ట్రిక్టుగా ఉండేవాడు. ఇది మనవూరు కాదు అన్న ఎరుక చాలా ఎక్కువగా ఉండెది వాళ్ళిద్దరిలోనూ.

తొమ్మిదో తరగతి వరకు మాత్రమే నేను అక్కడ చదువుకున్నా తర్వాత ట్రాన్స్ ఫర్ పై సిటీక్ దగ్గర్లోకి వచ్చాం. సిటీలోనే ఇక్కడే సెటిల్ ఐపోయాం . ఆ తరువాత అ వూరు వెళ్ళింది లేదు.

మనస్సు గత జ్ఞాపకాలతో పరుగులు పెడుతోంది కాళ్ళు మెయిన్ రోడ్డు వైపుగా దారితీశాయి. రోడ్డు క్రాస్ చేసి అవతలవైపు వీధిలోని పార్క్ లోకి అడుగులేశాను.


ఆదివారపు మధ్యాహ్నం . వీధిలోని పిల్లలంతా పార్కులో చేరారు. పార్కుచుట్టూ ఉన్న పెద్ద చెట్ల నీడల్లో కొందరు, గ్రౌండ్ లా ఉన్న చోట కొందరు. ఆ పెద్ద పార్కు అంతా సందడిగా ఉంది. వాళ్ళని చూస్తూనే నా బాల్యం కళ్ళముందు తిరిగింది. ఈ పిల్లల్లా నా బాల్యమూ ఆటపాటలతో కేరింతలు కొట్టిందంటే అది పరిమళా ఆంటీ వాళ్ళ మూలంగానే ! ప్రతి ఒక్కరికీ జీవితమంతా తీపిగుర్తులు బాల్యపు ఆటపాటలూ సరదాలూ మాత్రమే, ఆంటీ వాళ్ళతో సాంగత్యం లేక పోతే నా బాల్య జ్ఞా పకాలలో ఇప్పుడు నాకు నా పుస్తకాలు మార్కులు మాత్రమే మిగిలి ఉండేవేమో!

అమ్మ ఓసారి వేరేవూరికి ఎలక్షన్ డ్యూటీ కెళుతూ తప్పనిసరై నన్నూ, చెల్లిని ఆంటీ దగ్గర వదిలింది. ఎవరితో కలవని మాకు పరిమళా ఆంటీ వాళ్ళతో అలా పరిచయం ఏర్పడింది. మా ఇంట్లో అన్నీ మిలటరీ రూల్స్ ఉండేవి! ఆంటీ వాళ్ళింట్లో ఉన్నంతసేపు నేను, చెల్లి విడుదలైన ఖైదీల్లా ఫీలయ్యేవాళ్లం!

కథల పుస్తకాలతో నిండి ఉండే వాళ్ళ ముందు గదిలోని అలమార మాకొక అద్భుతం. నిశ్శబ్దపు మా ఇంటికి, సందడితో సంతోషంతో నిండి వున్న వాళ్ళ ఇంటికి ఉన్న తెడా మమ్మల్ని అటుకేసి లాగేస్తుండేది.

ఆంటీ అంటే వూళ్ళొ అందరికీ గౌరవం, ఇష్టం. ఎప్పుడూ పూజలనో ఇంకోటనో అందరినీ పిలిచి భోజనాలు పెడుతుండేది. ఆమె దానధర్మాలు చూసి అమ్మ ఈవిడదంతా అదోరకం మంచిదాన్ననిపించుకునేందుకే వేషాలు, తక్కువ కులస్తులతో ఎవరూ కూడరనీ, పనివాళ్ళు దొరకరనీ అందుకే ఆకులస్థులు అలా అందరినీ ఆకట్టుకుంటారనీఅంటుండేది!
ఆంటీ చేసే ప్రతి పనీ ఇతరులతో విలక్షణంగా ఉండేది. అబ్బో సినిమాలు చూసి అందులోలా చేస్తుంది ఈవిడఅనేది అమ్మ.

ఆంటీ తో ఎప్పుడూ ఓ ఇద్దరు పనివాళ్ళు ఉండేవాళ్ళు . డ్రైవర్, అటెండర్ కూడా ఇష్టంగా సాయానికి పరిగెత్తుకొచ్చేవారు. ఇంటిముందు పూల తోట, వెనక కూరగాయల మడులు పెంచేది. ప్రతిసాయంత్రం పూలు మాల కట్టించి పిల్లలందరికీ తలలో పెట్టేది. పెరట్లో పెద్ద గోరింటాకు పొద ఉండేది. ఆకు రుబ్బించి అందరికీ పంపించేది. ఆమెతో గోరింటాకు పెట్టించుకోవటానికి పిల్లలందరం క్యూ కట్టే వాళ్ళం.

అమ్మ కోపం లెక్కచేయకుండా ఎలాగో కన్నుగప్పి మేం మెల్లిగా ఆటకి అక్కడి జారుకునే వాళ్ళం. ఆంటికి చెల్లి ని చాలా ముద్దు చేసేది. ఆంటీ వాళ్ళింట్లో అందరు నలుపే. పచ్చటి పసిమి ఛాయ చెల్లిది. చెల్లిని బంగారు తల్లి అని పిలుస్తుండేది. తన ముగ్గురి పిల్లలే కాకుండా చుట్తుపక్కల పిల్లలందరినీ చేరదీసేది, ఎప్పుడూ పిల్లలకోడిలా ఉండేది. సంతోషం, నవ్వులు, నిశ్చింత ఆమెచుట్టూ! వూళ్ళొ స్నేహితులూ ఎక్కువే ఆమెకి. మంగళహారతి పాటలు తను నేర్చుకుని పిల్లలకు నేర్పిస్తూ ఉండేది. పద్యాలు, కథలు, ఆటలు, పాటలు పిల్లల్లో తానూ ఓ చిన్నపిల్లలా కలిసిపోయేది.

వూళ్ళొ ఎప్పుడూ కరెంటు సరిగా ఉండేది కాదు, వేసవి రాత్రులు మరీ ఉండేదికాది. కరెంటు పోయిందంటే నేను చెల్లి ఆంటీ వాళ్ళింట్లో చేరేవాళ్ళం, వెన్నెల రోజుల్లో వీధిలో ఆటలు, మిగతా రోజుల్లో వరండాలో కథలూ, అంత్యాక్షరి లాంటి ఆటలు ఆడించేది. ఆంటీ దగ్గర ఎప్పుడూ చిరు తిండి రెడీగా ఉండేది. పిల్లలందరికీ తినడానికి ఏవేవో పెడుతుండేది.
అమ్మ ఆమెని తక్కువ కులస్థులని లోకువగానే చూసేది. .. ఆమె పెట్టే ఖర్చులు, ఆమె జీవిత విధానం పట్ల అమ్మకెప్పుడూ నిరసనే ఉండేది. పేరంటమనో ఇంకేదనో ఆంటీ పిలిచినా అమ్మ ఎప్పుడూ వెళ్ళేదికాదు.

చుట్టు ప్రక్కల వాళ్ళు ఎవరికే సహాయం కావాలన్నా ఆమె దగ్గరకు వచ్చేవాళ్ళు. పాతబట్టలకూ స్టీలు సామాను కొనేరకం వ్యక్తులకు ఆమె చేసే దానాలని చూస్తే ఎప్పుడూ ఆశ్చర్యంగానే ఉండేది.
ఆంటీ కి ముగ్గురు పిల్లలు పెద్దవాడు శరత్ నా కంటే ఓ క్లాసు పెద్ద. తరువాత అమ్మాయి మల్లిక చెల్లి క్లాసు. తరువాతి వాడు సిద్దార్థ. మేం వూరినుండి ఇక్కడికి వచ్చేసేనాటికి వాడు రెండో మూడో చదువుతుండేవాడు. వాడికసలు భయం అంటే ఏమిటో తెలిసేది కాదు. బొద్దుగా ముద్దుగా ఉండేవాడు. శరత్ కాస్త పెద్దరికంగా వ్యవహరించినా ఆటల్లో మునిగితే అందరికంటే చిన్నపిల్లాడిలా మారేవాడు. మల్లిక కాస్త సిగ్గరిగా ఉన్నా అందరితో స్నేహంగా ఉండేది వాళ్ళ అమ్మ లాగే. పాటలు చక్కగా పాడేది.


"అన్నా బాల్"

ఎవరిదో పిలుపు విని ఆలోచనలనుండి బయటపడుతూ అటుకేసి చూశాను. సైగ చేస్తూ పిలుస్తున్నాడు ఓ అబ్బాయి. నా దగ్గరగా పడ్డ బాల్ చేతిలోకి తీసుకుంటూ అతడికేసి చూసాను ఓ పద్నాలుగేళ్ళ కుర్రాడు. వెంటనే శరత్ గుర్తొచ్చాడు. చివరిగా నేను చూసినప్పుడు ఇలాగే ఉండేవాడు శరత్ ఇప్పుడేం చేస్తున్నాడో!

ప్చ్ అమ్మ ఆ వార్త చెప్పకుంటే బావుండు ఆంటీ గురించిన జ్ఞాపకాలు అలాగే భద్రంగా ఉండేవేమో! ఆంటీ గురించిన విషాదవార్త నాకు స్థిమితం లేకుండా చేస్తొంది.
ప్రతి పండగా ఆర్భాటంగా జరిపించేది, ఏదైనా పదిమందితో పంచుకుంటేనే ఆనందం అనేది. జడనిండా పూలు, పట్టుచీర ధరించి లక్ష్మీ దేవిలా ఉండేది, ఆమె అంటే పిల్లలందరికీ అదోరకమైన క్రేజ్!

ఓ సారి మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో చెల్లినీ నన్నూ పెద్దయ్యాక ఏమౌతావు అని అడిగిన ప్రశ్నకి చెల్లి చెప్పిన సమాధానం గుర్తొస్తే ఇప్పటికీ నవ్వాగదు. నేను పెద్దయ్యాక పరిమళా ఆంటీ నవుతాఅంది అది. ఆ రోజు అమ్మ భద్రకాళికే అయ్యింది.
ఎంత మెత్తగా మాట్లాడేదో, పిల్లలని బుజ్జగించి లాలించడం ఆమెలా ఇంకెవరూ చేయలేని పని. మాటలో, చూపులో, చేతలో అంత ప్రేమ తొణికిసలాడుతూ ఉండడం ఎలా సాధ్యమో నా కిప్పటికీ అదో అద్భుతమే! ఆమె ఓ అద్భుత జ్ఞాపకంగా అలాగే ఉంటే బావుండు. ఇప్పుడు ఇక ఆంటీ కథ విషాదాంతమై గుర్తొస్తూ ఉంటుంది.

ఉహూ ఇక లాభం లేదు, నా ఆలోచనలు అంతు పొంతు లేకుండా సాగుతూనే ఉంటాయి. ఆంటీ ఇప్పుడెలాగుందో చూస్తేగాని మనసు స్థిమిత పడదు. అమ్మ అన్నట్టు ఆంటీ తన స్వభావం మూలంగా పిల్లల భవిష్యత్తు చెడగొట్టిందా! ఏం జరిగి ఉంటుంది!
వెంటనే వెళ్ళి చూడాలని నిర్ణయించుకుంటూ ఇంటివైపు వడి వడిగా అడుగులేశాను.


ఎందుకో లోపలికి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు వాళ్ళింటికి వెళుతున్నానంటే అమ్మ ఏమంటుందోనాకు తెలుసు. బైక్ స్టార్ట్ చేసి బయట పడ్డాను.


అంకుల్ ఆమెనెంత అపురూపంగా చూసుకునే వాడు! ఆయన లేని ఆమెని ఊహించలేకపోతున్నా. అంగ రంగ వైభోగంగా ఉండేది వాళ్ళజీవితం. ఇప్పుడెలా ఉన్నారొ! ఆనాటి వాళ్ళ ఖర్చులూ వాటిని బట్టీ చూస్తే వాళ్ళేం వెనకేయలేదనే అనిపిస్తుంది. భర్త నీడలో చీకూచింతా తెలియకుండా ఉన్న ఆవిడ ఆయన పోయాక ముగ్గురు పిల్లలతో ఎలాంటి జీవితం గడిపిందో! వాళ్ళ చదువులు, పోషన ముందులా మాత్రం ఉండకపోయే అవకాశమే ఎక్కువ. అసలు ప్రేమించటం తప్ప ఆమెకేం తెలుసు! ఏం చేయగలదు! కాలు కందకుండా చూసుకున్నాడు భర్త.
దేవుడు తనకిచ్చిన దాన్ని పదిమందికీ పంచడమే తెలుసు ఆమెకి ఒకరిని చేయి చాచి అడగడం ఆమె చేయగలదా!

పిల్లలకు అంత స్వేచ్చా! అంతేసి ఖర్చులూ పెడుతోంది వాళ్ళ భవిష్యత్తు చేతులారా చెడగొడుతుంది. ఆ ఆటా, పాటా రేపొద్దున అన్నం పెడతాయాఅనేది అమ్మ అస్తమానం. అదే నిజమైయ్యిందా!

శరత్ నిజంగా దురదృష్ట వంతుడు. మంచి జీనియస్ వాడు పెద్ద చదువులు చదువుతాడని అనుకునేవాళ్ళు అంతా. ఇప్పుడేం చేస్తున్నాడో! అన్నీ సవ్యంగా ఉన్నవాళ్ళే ఈరోజుల్లో ఎగ్జిస్ట్ కావడం కష్టంగా ఉంది. ఇక ఏ సపోర్టూ లేకుండా అతడేం చేయగలడు!

ముగ్గురు పిల్లలు తండ్రి మరణం వాళ్ళ జీవితాలని ఎంత తలకిందులు చేసిందో! వాళ్ళ స్థితి ఊహించుకుంటే మనసంతా చేదుగా మారింది.

మనసులో జోరీగల్లా ఆలోచనలు ముసురుతూనే ఉన్నాయి, అశోక్ నగర్ చేరుకుని పెద్ద కష్టం లేకుండా ఆ ఇల్లు చేరుకున్నాను. గేటు దగ్గరే వున్న ఓ కుర్రాడితో పరిమళా ఆంటీ వుండేది ఇక్కడేనా?” ప్రశ్నిస్తూ అడిగాను. మౌనంగా ఫస్ట్ ఫ్లోర్ వైపు వేలు చూపించాడు ఆ అబ్బాయి. పక్కగా ఉన్న మెట్లు ఎక్కుతూ ఉంటే ఒక్క క్షణం అనిపించింది అసలు నేను గుర్తున్నానా ఆంటీకి. ఇక్కడికి రాకుండా వుండాలిసిందా అని. నా క్యూరియాసిటీ ఆ భావాన్ని అదిమేసింది.

గ్రిల్ రూము తలుపు తెరిచే ఉంది. కాలింగ్ బెల్ నొక్కి అక్కడే నిలబడి పోయాను. కొన్ని క్షణాల తరువాత బయటకు వచ్చింది ఆంటీ నేను వెంటనే గుర్తు పట్టేశాను.


ఎవరండి?” అడిగింది.


ఆంటీ నేను. లలితా టిచర్ గారి అబ్బాయిని, కార్తిక్ ని. అమ్మను మీరు కలిసారటగా..., మొన్న షాపింగ్ కాంప్లెక్స్ లో.....


ఆ.., ఆ..., రా... రా ... లోపలకి రా. కార్తిక్ కదూ! బావున్నావా? పెద్దవాడివైపోయావు, వెంటనే గుర్తుపట్టలేకపోయాను గాని, ఎక్కడో చూసినట్టు అనిపించింది. చెయ్యి పట్టుకుని లోపలి నడిపించింది.

అమ్మ రాలేదా? ఇంకా గుర్తుంచుకున్నావ్ చాలా సంతోషం. అమ్మా, నాన్నా చెల్లి అందరు బావున్నారుగా. నువ్వేం చేస్తున్నావు? అమ్మ మొన్న కనిపించింది గాని హడావిడిలో ఏమి మాట్లాడుకోలేదు..” నన్ను చూసిన సంతోషం తో ననుకుంటా అన్ని ఒకేసారిగా అడిగేసింది.

ఆమె అడిగిన వాటికి సమాధానాలు చెబుతూ మెల్లిగా కబుర్లలో మునిగి పోయాను. ఆంటిలో అప్పటికి ఇప్పటికి మార్పేమీ లేదు అదే ఆప్యాయతా. సున్నితంగా, ప్రేమగా నవ్వుతు మాట్లాడుతోంది. శరీరం వడలినట్టువుందే గాని హృదయంలోని ప్రేమ కంఠ స్వరంలోని మృదుత్వం అప్పటిలాగే ఉంది.


నాగురించి ఉద్యోగం గురించి చెపితే సంతోషంతో తలూపింది. చెల్లి డిప్రెషన్ తో సూసైడ్ చేసుకుందని చెప్పినప్పుడు కళ్ళనిళ్ళు పెట్టుకుంటూ అప్పట్లో చెల్లి ఎంత చలాకీగా చక్కగా ఉండేదో గుర్తుతెచ్చుకుంది. మా ఇంట్లో ఫోటోలోని లక్ష్మి దేవి పాపలాగా మారి వచ్చినట్టు ఉండేదిరా దాన్ని చూస్తే. దానికి గోరింటాకు ఎంత ఎర్రగా పండేదిరా! మల్లెపూల జడంటే దానికి ఇష్టం కదూ దానిది బారుజుట్టు ఆంటీ పుల జడ వేయవా అంటూ వచ్చేది! ప్రతి శనివారం పూలన్నీ దానికోసమే దాచి తెల్లవారి జడవేసేదాన్ని.” ఎన్నో విషయాలు మాట్లాడసాగింది. చిన్న చిన్న విషయాలు కుడా ఆమెకి బాగా గుర్తున్నాయ్.

అంకుల్ గురించి అడిగినప్పుడు ఆమె కళ్ళల్లో తడి నా దృష్టిని దాటలేదు. ఆయన పోయాక తనకు ఇచ్చిన అటెండర్ ఉద్యోగం చేస్తున్నానని చెపుతున్నప్పుడు నా మొహంలో కనిపించిన విస్మయం గమనించి చల్లగా నవ్వింది.


మీరు అటెండర్ గా….!” నమ్మలేనట్టుగా చూశాను. తండ్రి ఉద్యోగం పిల్లలకు ఇస్తారుగా. శరత్ ఉద్యోగం చేయొచ్చుగా అనే అర్ధంతో అన్నాను.


మీ అంకుల్ పోయినప్పుడు శరత్ ఇంటర్ చదువుతున్నాడు వాడికి ఉద్యోగం ఇస్తామన్నారు. నాకే ఇష్టం లేకపోయింది. వాడి వయసెంతని? వాడింకా పసికూన. మొదటినుండి వాడికి కొన్ని ఆశలు, ఆశయాలు ఉన్నాయి. చదువు మానిపించి పసివాడిపై కుటుంబ భారం మోఫై వాడి భవిష్యత్తు పాడు చేయటం సరికాదనిపించింది. అది గాక అంకుల్ వాడిని ఐ ఐ టి చదివించాలని ఎప్పుడు అంటుండేవాడు. ఆయన కోరిక, వాడి కల అవి రెండు నెరవేర్చటం నా బాధ్యత. పిల్లలు ముగ్గురూ తండ్రి ఉన్న రోజుల్లోని సౌకర్యాలు పొందకపోయినా వాళ్ళ సంతోషం అలాగే ఉండాలనేది నా కోరిక."

మహారాణిలా బ్రతికిన ఆమె, ఆఫీసర్ భార్య గా ఒక హోదా అనుభవించిన ఆమె తను అటెండర్ పని చేస్తున్నానని ఎంత మాములుగా చెపుతోంది! ప్రపంచం అంటే ఏమిటో ఎరుగకుండా భర్త రక్షణలో అపురూపంగా ఉన్న ఆ సుకుమారి పిల్లల భవిష్యత్తుని తన చేతుల్లోకి ఎంత ధైర్యంగా తీసుకుంది!


నా శ్రేభిలాషులు నాకు అండగా ఉన్నారు, పిల్లలు నాకు తోడుగా ఉన్నారు ఆ భగవంతుడి దయ వల్ల మల్లిక శరత్ కోరుకున్న చదువులు చెప్పించగాలిగాను .. .. శరత్ పూణే లో ఉద్యోగం చేస్తున్నాడు. మల్లిక ఇక్కడే ఉంది. ఇక సిద్దు చదువు పూర్తయ్యి ఉద్యోగంలో చేరితే అందరు సెటిల్ ఐనట్టే. చెప్పుకు పోతోంది.


ఆమె అడిగే వాటికి సమాధానమిస్తూ వాళ్ళ గురించి తెలుసుకుంటూ సమయం తెలియలేదు. ప్రేమ ఏదైనా చేయిస్తుంది. ప్రేమకున్న శక్తి మరొక్కసారి ఇక్కడ నిరూపించ బడింది. ప్రేమ దేన్నైనా సాధిస్తుంది.

ఇక వెళతా ఆంటీ చాలా ఆలస్యమయ్యింది.” లేచాను .


మల్లిక, సిద్ధు వస్తారు ఉండు.” అంటోంది ఆంటీ.ఇంకోసారి వస్తానాంటి…” బయల్దేరాను తృప్తిగా.

దారిలో వెళ్ళేటప్పుడు నేను ఉహించుకున్నవి గుర్తొచ్చి నవ్వుకున్నాను. అవును ఆంటికి ప్రేమించం తప్ప ఇంకేమి చేతకాదు...... అదే ఆమె బలం. ప్రేమంటే ఎదుటివారిని అర్ధం చేసుకోవడం. ప్రేమంటే ఎదుటివారి సంతోషం చూడాలనుకోవడం. ప్రేమ జయిస్తుంది ఎవరినైనా…, ఎలాంటి పరిస్థితులనైనా.


ఇంట్లో అడుగు పెట్టగానే నాకోసం ఎదురుచూస్తూ ఉన్న అమ్మ కనిపించింది. ఏరా చెప్పకుండా వెళ్ళావని అమ్మ కంగారు పడుతోంది. అన్నాడు నాన్న నావైపు చూస్తూ.అమ్మా ఆలస్యంగా భొంచేస్తావు నీకు గ్యాస్త్రిక్ సమస్య వుండీ? రా కలిసి తిందాం.” ఆప్యాయంగా పిలుస్తున్న నావైపు అర్ధం కానట్టు చూస్తూ కదిలింది అమ్మ.

*** ** *** **